Telangana floods: వర్షాలు, వరదలతో ఆర్‌అండ్‌బీకి రూ.1,157 కోట్ల నష్టం
ABN , Publish Date - Aug 29 , 2025 | 03:59 AM
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు ఇప్పటివరకు రూ.1,157.46 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా సర్కారుకు ఆ శాఖ నివేదికను అందజేసింది.
తాత్కాలిక మరమ్మతులకు రూ.53.76కోట్లు కావాలి
మెదక్‌లో 52కి.మీ రోడ్లు ధ్వంసం
కామారెడ్డిలో 4చోట్ల దెబ్బతిన్న బ్రిడ్జిలు.. సర్కారుకు ఆర్‌అండ్‌బీ నివేదిక
అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు ఇప్పటివరకు రూ.1,157.46 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా సర్కారుకు ఆ శాఖ నివేదికను అందజేసింది. తాత్కాలిక మరమ్మతులకు రూ.53.76 కోట్లు కావాలని నివేదికలో పేర్కొంది. ఆర్‌అండ్‌బీ శాఖ నివేదికలోని వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 794 ప్రాంతాల్లో సమస్యాత్మక రోడ్లను గుర్తించారు. వీటిలో 1,039 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. 31 చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. 10 చోట్ల తాత్కాలిక మరమ్మతులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 356 చోట్ల రోడ్లపై వరద ప్రవహిస్తోంది. 305 చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగితే, 236 చోట్ల ట్రాఫిక్‌ను దారి మళ్లించి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు. మెదక్‌లో 52 కి.మీ మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లపై 33 చోట్ల వరద ప్రవహిస్తోంది. 5 చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 4 చోట్ల వంతెనలు దెబ్బతినగా వాటి అప్రోచ్ రోడ్లు కోతకు గరయ్యాయి. మొత్తం 15 ప్రాంతాల్లో రోడ్డుపై నుంచి వరద ప్రవహిస్తోంది. 3 చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఆయన ఆర్‌అండ్‌బీ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన నష్టం, వాటి శాశ్వత, తాత్కాలిక మరమ్మతులకయ్యే ఖర్చు వివరాలను మంత్రికి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ దెబ్బతిన్న రహదారులకు సంబంఽధించి శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. ప్రజారవాణాకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
నేడు, రేపు వర్షాలు..
కొన్ని చోట్ల భారీ వానలు పడే చాన్స్
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండు రోజుల పాటు చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..