Share News

Basara: వరద ముంపులోనే బాసర

ABN , Publish Date - Aug 31 , 2025 | 04:43 AM

నిర్మల్‌ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో గోదావరి వరద పోటెత్తుతోంది. శుక్రవారం మొదలైన ప్రవాహం శనివారం అదే స్థాయిలో కొనసాగింది.

Basara: వరద ముంపులోనే బాసర

  • రైళ్ల రాకపోకలపై కొనసాగుతున్న ఆంక్షలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): నిర్మల్‌ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో గోదావరి వరద పోటెత్తుతోంది. శుక్రవారం మొదలైన ప్రవాహం శనివారం అదే స్థాయిలో కొనసాగింది. అమ్మవారి ఆలయ ప్రధాన రహదారులు, ప్రైవేటు సత్రాలు, హోటళ్లు, దుకాణాల్లోకి నీరు చేరింది. ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారుల్లో పది అడుగుల వరకు నీరు నిలిచి చెరువులను తలపించాయి. టీటీడీ అతిథి గృహం, వ్యాస మహర్షి ఆలయం వరకు వరద చేరింది. శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టుకు శనివారం 4లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో రాగా, 5లక్షల క్యూసె క్కులకు పైగా నీటిని దిగువకు వదిలారు. అయినా బాసర వద్ద వరద తగ్గలేదు. భక్తులను బాసర గ్రామం నుంచి కొండల మధ్య ఉన్న రహదారి వెంబడి అనుమతించారు. బాసరబ్రిడ్జి మీదుగా రైళ్ల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 7,27,223 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.


భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంవద్ద 12.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీకి 10,25,600 క్యూసెక్కుల వరద వస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి 47.6అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలో 48,200ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. 11 మండలాల్లో 3వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు నిర్ధారించారు. ఒక్కోబాధిత కుటుంబానికి రూ.11,500 ఆర్థిక సాయం అందిస్తామని కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. కాగా, జూరాలకు 2.10లక్షలు, శ్రీశైలానికి 2.52లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.


నేడు 3 జిల్లాలకు భారీ వర్ష సూచన

రాష్ట్రంలో ఆదివారం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిం ది. ఈ జిల్లాలకు ఎల్లోఅలెర్ట్‌ జారీ చేసింది. అలాగే, సెప్టెంబరు 3 వరకు అన్నిజిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్‌‌పై మాటల యుద్ధం..

15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కేటీఆర్ డిమాండ్

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 31 , 2025 | 04:43 AM