Father Children: కన్నతండ్రే కాలయముడు
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:12 AM
కన్నబంధం మాటున క్రూరత్వం దాగుందని తెలియదా ఆ ముక్కుపచ్చలారని పిల్లలకు! వేలు పట్టి నడిపించే నాన్నే కాలయముడు అవుతాడని ఊహించి ఉండరు ఆ చిన్నారులు! ఓ తండ్రి పేగుబంధాన్ని మరిచి మానవమృగంగా మారి తన ముగ్గురు పిల్లలను పాశవికంగా చంపిన దారుణ ఘటన నాగర్‌కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది.
వీడిన ముగ్గురు చిన్నారుల అదృశ్యం మిస్టరీ
పిల్లలకు పురుగుల మందు తాగించి..
పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి
ముగ్గురు పిల్లల మృతదేహాలు లభ్యం
పిల్లల్ని చంపి.. వేరేచోట తండ్రి ఆత్మహత్య
ఇప్పటికే అతని మృతదేహం గుర్తింపు
నిందితుడిది ఏపీలోని ప్రకాశం జిల్లా
భార్యతో గొడవ నేపథ్యంలో పిల్లలతో కలిసి బైక్‌పై నాగర్‌కర్నూల్‌కు..
నాగర్‌కర్నూల్/వెల్దండ/ఉప్పునుంతల/కల్వకుర్తి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): కన్నబంధం మాటున క్రూరత్వం దాగుందని తెలియదా ఆ ముక్కుపచ్చలారని పిల్లలకు! వేలు పట్టి నడిపించే నాన్నే కాలయముడు అవుతాడని ఊహించి ఉండరు ఆ చిన్నారులు! ఓ తండ్రి పేగుబంధాన్ని మరిచి మానవమృగంగా మారి తన ముగ్గురు పిల్లలను పాశవికంగా చంపిన దారుణ ఘటన నాగర్‌కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ముగ్గురు పిల్లలను తనతో బైక్‌పై తీసుకెళ్లిన ఆ తండ్రి రాక్షసుడిగా మారి వారిని మార్గమధ్యంలో పురుగులమందు తాగించి చంపేసి, దహనం చేశాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహం బుధవారమే లభించగా.. ముగ్గురు పిల్లల మృతదేహాలను గురువారం వేర్వేరుచోట్ల కనుగొన్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దబోయపల్లికి చెందిన గుత్త వెంకటేశ్వర్లు (38) మేన మరదలు దీపికను 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి కుమార్తెలు మోక్షిత (8), వర్షిణి(6), కుమారుడు శివధర్మ(4) ఉన్నారు. భార్యతో గొడవపడిన వెంకటేశ్వర్లు గత నెల 30న ముగ్గురు పిల్లలను బైక్‌పై ఎక్కించుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో దీపిక తన భర్త, పిల్లలు అదృశ్యమయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టగా వెంకటేశ్వర్లు 31న శ్రీశైలం మీదుగా నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట సమీపంలోని హాజీపూర్ చౌరస్తా వరకు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. ఆ క్రమంలో పిల్లలు మోక్షిత, వర్షిణి, శివధర్మ ఒక్కొక్కరుగా తండ్రితో పాటు బైక్‌పై కనిపించకపోవడం ఆందోళన రేకెత్తించింది. పోలీసులు వెల్దండ మండలం పెద్దాపూర్ దగ్గర వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గుర్తించారు.
అతను పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. అక్కడే ఉన్న అతని బైక్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దాంతో పిల్లల సంగతి తెలిసి.. వారి జాడ కనుగొనేందుకు కల్వకుర్తి డీఎస్పీ సైరెడ్డి వెంకట్ రెడ్డి, వెల్దండ సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, వెల్దండ ఎస్‌ఐ కురుమూర్తి ఆధ్వర్యంలో సీసీటీవీ ఫుటేజ్‌లను జల్లెడ పట్టారు. చారకొండ మండలం జూపల్లి వచ్చేసరికి వెంకటేశ్వర్లుతో పెద్దకూతురు మోక్షిత ఒక్కతే ఉం ది. ఆ తర్వాత వెంకటేశ్వర్లు ఒంటరిగా కల్వకుర్తి పట్టణానికి చేరుకున్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాంతో ప్రత్యేక బృందాలతో జాతీయ రహదారికి ఇరువైపులా గాలించారు. గురువారం మధ్యాహ్నం ఉప్పునుంతల మండలం సూరాపూర్ తండా వద్ద వర్షిణి, శివధర్మల మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో కన్పించాయి. కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో మోక్షిత మృతదేహం లభ్యమైంది. ఆమె మృతదేహం కూడా కాలిపోయి ఉంది. వెంకటేశ్వర్లు ఒక్కోచోట పిల్లలను హతమారుస్తూ వచ్చినట్లు నిర్ధారణ అయింది. పురుగులమందు తాగించి చంపి, పెట్రోల్ పోసినట్టు దహనం చేశాడని పోలీసులు భావిస్తున్నా రు. ముగ్గురు పిల్లల మృతదేహాలను పోస్టుమార్టంకు కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెల్దండ, ఉప్పునుంతల, కల్వకుర్తి మండలాల పోలీసులు పూర్తిస్థాయి విచారణ ప్రారంభించారు. ప్రకాశం జిల్లా నుంచి ప్రత్యేక పోలీసు బృందం అచ్చంపేట చేరుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
సుగాలి ప్రీతి కేసుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
22 నుంచి దసరా ఉత్సవాలు.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు: మంత్రి ఆనం
Read Latest TG News and National News