Share News

Farmers: పంటతడి.. కంటతడి!

ABN , Publish Date - Mar 11 , 2025 | 04:56 AM

యాసంగి రైతు ఆలోచనల్లో పడ్డాడు. పంట చేతికొచ్చేనా? లేదంటే పెట్టుబడంతా మట్టిపాలేనా? అనే ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. జోరుగా వరినాట్లు వేసి.. కలుపు తీయించి.. ఎరువులు చల్లితే తీరా పొట్టదశకొచ్చాక వరిపైరు వాడుముఖం పడుతోంది. కొన్నిచోట్లయితే పొలం నెర్రలు తేలింది.

Farmers: పంటతడి.. కంటతడి!

  • సాగునీరు లేక పొట్టదశలో ఎండిపోతున్న వరి

  • అడుగంటిన భూగర్భజలాలు.. వట్టిపోయిన బోర్లు

  • ఆయకట్టు రైతులకూ కన్నీరే.. ప్రాజెక్టుల నుంచి నీళ్లేవి?

  • పూడిక, పిచ్చిమొక్కలతో అఽధ్వానంగా మారిన కాల్వలు

  • మరమ్మతులు లేక చివరి భూములకు అందని నీరు

  • ఏమాత్రం ఆశల్లేక వరి పొలాల్లోకి పశువుల వదిలివేత

  • కొన్నిచోట్ల ట్యాంకర్లతో నీరు తెచ్చి పోస్తున్న రైతులు

  • వెంటనే సాగునీరు విడుదల చేయాలంటూ ఎస్సారెస్పీ,

  • నాగార్జున సాగర్‌ ఆయకట్టు రైతుల ఆందోళన

  • యాదాద్రి భువనగిరి జిల్లాలో కౌలురైతు ఆత్మహత్య

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

యాసంగి రైతు ఆలోచనల్లో పడ్డాడు. పంట చేతికొచ్చేనా? లేదంటే పెట్టుబడంతా మట్టిపాలేనా? అనే ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. జోరుగా వరినాట్లు వేసి.. కలుపు తీయించి.. ఎరువులు చల్లితే తీరా పొట్టదశకొచ్చాక వరిపైరు వాడుముఖం పడుతోంది. కొన్నిచోట్లయితే పొలం నెర్రలు తేలింది. ఎండలు మొదలయ్యాయో లేదో రైతులకు సాగునీటి కష్టాలు చుట్టుముట్టాయి. బోరుబావులు వట్టిపోతున్నాయి. మొన్నటిదాకా నిండుగా పోసిన బోర్లు కూడా దండగైపోయాయి. బొట్టు బొట్టుగా నీరు పోసే బోర్లను పొద్దంతా నడిపినా పది గుంటల పొలమైనా తడవడం లేదు. ప్రాజెక్టుల కింద పొలాలదీ ఇదే పరిస్థితి. నీరు వదలకపోవడంతో ఎక్కడికక్కడ పొలాలు ఎండిపోతున్నాయి. కొన్ని ప్రాజెక్టుల్లో భారీగా పూడిక చేరడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. ఫలితంగా నీరు చాలడం లేదు. వదిలిన ఆ నీరు కూడా కాల్వల నిర్వహణ సరిగా లేక వృథా అవుతోంది. కాల్వల్లో పూడిక, ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కల కారణంగా నీళ్లు పొలాలకు చేరడం లేదనే అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా కొన్నిచోట్ల యాసంగిపై ఆశలు వదిలేసుకున్న అన్నదాతలు, మేత కోసం వరి పొలంలోకి పశువులను వదులుతున్నారు. ఆశలు కోల్పోని రైతులు.. వందలు, వేలల్లో కిరాయి వెచ్చించి, ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పొలాన్ని తడుపుతున్నారు.


ఎస్సారెస్పీ కాల్వకు మరమ్మతులెప్పుడు?

ప్రధానంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఫలితంగా హనుమకొండ, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. హనుమకొండ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు 30 ఏళ్ల క్రితం కాల్వ నిర్మించారని. నిర్వహణను పూర్తిగా విస్మరించడంతో కాల్వ ఆధ్వానంగా మారిందని రైతులు అంటున్నారు. ప్రధాన కాల్వలతో పాటు ఉపకాల్వలూ శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లాలో లక్ష ఎకరాలకు నీరు అందివ్వాల్సి ఉండగా 60-70వేల ఎకరాలకే నీరు అందుతోందని, కాల్వలకు మరమ్మతులు చేయకపోవడమే కారణం అని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్నిప్రాంతాల్లో రైతులు డబ్బులు పోగేసుకొని కాల్వలకు మరమ్మతులు చేసుకుంటున్నారు. ఎస్సారెస్పీ కాల్వ ద్వారా సాగునీరు విడుదల చేయాలంటూ ఐనవోలు మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన రైతులు, చింతగట్టు క్యాంపు నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం ధర్మసాగర్‌ నుంచి స్టేషన్‌ ఘన్‌పూర్‌ పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలోని ఎస్పారెస్పీ కాల్వ ద్వారా నీటిని తరలిస్తున్నట్లు.. ఐదురోజుల తర్వాత నీరు అందిస్తామని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా ఆయకట్టు పరిధిలోని లేని రైతులు కూడా ఎస్సారెస్పీపై ఆశలు పెట్టుకొని యాసంగిలో విస్తృతంగా వరిసాగు చేశారు. సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని అన్ని గ్రామాల్లో, మునగాల మండలంలోని రేపాల, నర్సింహులగూడెం, జగన్నాథపురం, విజయరాఘవపురం, సీతానగరం, కలకోవ గ్రామాల్లో భారీగా వరిసాగు చేశారు. వరి పొట్టదశకొచ్చిందని, మరో 2-3 తడులు పెడితే గట్టెక్కుతామని, వెంటనే నీటిని విడుదల చేయాలని ఈ గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని.. ముఖ్యంగా జిల్లాకు చెందిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని కోరుతున్నారు. నిజాంసాగర్‌, పోచారం, కౌలా్‌సనాలా ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గడంతో పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. అందునా.. రెండ్రోజుల క్రితం నిజాంసాగర్‌ ప్రధాన కాల్వ నుంచి నీటి విడుదలను ఆపేశారు. నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ నుంచి నీటి సరఫరా జరుగుతున్నా కొన్నిచోట్ల చివరి ఆయకట్టుకు నీరందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సాగర్‌ ఎడమకాల్వ కింద లక్ష ఎకరాల్లో, వరి, 70వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. కొణిజర్ల, పల్లిపాడు, లాలపురం, దిద్దుపూడి, చిన్న మునగాల తదితర చోట్ల నీరు అందడం లేదని.. ఫలితంగా దిగుబడిపైనే ప్రభావం పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్‌ బోనకల్‌ జోన్‌కు నీరు విడుదల చేస్తుండటంతో ఎగువభూములైన కొణిజర్ల, వైరా, ఎన్కూరు తదితర మండలాలకు నీరే అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరా మేజర్‌ ఆయకట్టు రైతులు ఆదివారం బోనకల్‌ బ్రాంచ్‌ కాల్వ వైరా మేజర్‌కు వెళ్లే తూము వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. ఎండుతున్న తమ పంటలను పట్టించుకోకుండా దిగువకు నీళ్లు ఎలా వదులుతున్నారని ప్రశ్నించారు. కడెం ప్రాజెక్టు కింద పొలాలు ఎండిపోతున్నాయంటూ మంచిర్యాల జిల్లా దండేపల్లిలో అన్నదాతలు రోడ్డెక్కారు. ఎన్నిసార్లు చెప్పినా నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కడెం ఆయకట్టు కింద 24వ డిస్ట్రిబ్యూటరీ కాల్వ ద్వారా సాగునీరు అందక తాము సాగుచేసిన పొలాలన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


జనగామ జిల్లాలో 20శాతం పంటలు ఖతం

కామారెడ్డి జిల్లాలో భూగర్భజలాలు 12.97 మీటర్లకు పడిపోయాయి. జిల్లాలోని దోమకొండ, భిక్కనూరు, మాచారెడ్డి, రామారెడ్డి ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎండిపోయి నీళ్లు లేక పొలాలు వాడుముఖం పట్టాయి. నస్రూల్లాబాద్‌, బీర్కూర్‌, పిట్లం, నిజాంసాగర్‌, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, గాంధారి మండలాల పరిధిలో జొన్న పంట ఎండిపోతోంది. రిజర్వాయర్ల నుంచి నీళ్లు రాకపోవడంతో జనగామ జిల్లా వ్యాప్తంగా సాగైన పంటల్లో 20శాతం మేర ఎండిపోయాయి. జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్‌, అశ్వారావుపల్లి, చీటకోడూరు, నవాబుపేట, గండిరామారం, బొమ్మకూరు, కన్నెబోయినగూడెం రిజర్వాయర్లున్నాయి. వీటి ద్వారా గతంలో చెరువులను నింపేవారు. ఇప్పుడు నీళ్లు లేకపోవడంతో చెరువుల కింద పంటలూ ఎండుతున్నాయి.

ఎండుతున్న పొలాన్ని చూసి తట్టుకోలేక..

సాగునీరు లేక ఎండిపోయిన వరిపొలాన్ని చూసి మనోవేదనకు గురైన ఆ కౌలు రైతు.. పెట్టుబడికి అయిన అప్పు ఎలా తీర్చాలనే రందితో ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన మోట నర్సింహా (50) 14ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. బోర్లు సరిగా పోయకపోవడంతో ఐదెకరాల పొలం పూర్తిగా ఎండిపోయింది. మరికొంత వాడుముఖం పట్టింది. దీనిపైనే గత పదిరోజులుగా నర్సింహా బాధపడుతున్నాడు. సోమవారం పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెట్టుబడుల కోసం, కుటుంబ అవసరాల కోసం నర్సింహా రూ.15 లక్షల దాకా అప్పులు చేశాడని గ్రామస్థులు తెలిపారు. నర్సింహాకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.


ట్యాంకర్‌కు రూ.700 వెచ్చించి..

యాదాద్రి జిల్లా సంస్థాన్‌ నారాయణపురానికి చెందిన కొండ సత్యయ్య ఎకరం పొలంలో వరిసాగు చేశాడు. నెలరోజుల నుంచి బోరు సరిగా పోయడం లేదు. వచ్చే ఆ నీళ్లు సరిపోక పంట ఎండుతుండటంతో సత్యయ్య రెండ్రోజులకోసారి ట్యాంకర్‌ ద్వారా నీళ్లు తెచ్చి పొలానికి పెడుతున్నాడు. ఇందుకు.. ట్యాంకర్‌కు రూ.700 వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ గ్రామానికి చెందిన రైతు గాలయ్య పరిస్థితి అయితే మరీ దారుణం. కొన్నాళ్లు ట్యాంకర్ల నీటితో పొలాన్ని తడిపినా.. డబ్బు వెచ్చించే స్థోమత లేక చివరికి రెండెకరాల పొలంలో పశువులను వదిలాడు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో సత్యయ్య అనే రైతు నాలుగు ఎకరాల్లో వరి వస్తే.. బోరుబావిలోంచి నీరు సరిగా రాకపోవడంతో రెండెకరాల పొలాన్ని విడిచిపెట్టేసి.. మిగతా రెండెకరాల పొలానికి ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పోస్తున్నాడు. మూడు రోజులకోసారి ఐదు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పోస్తున్నానని చెప్పాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం అంబటోనిపల్లి గ్రామానికి చెందిన బసప్ప అనే రైతు బోరుబావి అడుగంటడంతో పొట్టదశకొచ్చిన రెండెకరాల పొలంలో ఒక ఎకరాన్ని వదిలేశాడు.

21.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 11 , 2025 | 04:56 AM