Share News

Urea Crisis: అదును దాటాక చల్లినా దండగే!

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:01 AM

రైతులకు సరిపడా యూరియా దొరకడం లేదు. క్యూ లైన్లలో అదేపనిగా నిలబడాల్సి రావడంతో అలసటా తప్పడం లేదు. యవుసం పనులు మానుకొని, క్యూలో నిలబడటానికే రోజంతా సరిపోతోందని..

Urea Crisis: అదును దాటాక చల్లినా దండగే!

యూరియా దొరక్క రైతుల్లో నిర్వేదం.. ముందురోజు రాత్రి చేరుకుని జాగారం

  • క్యూలో నీరసించి పడిపోతుతున్న వైనం

  • ఎరువుల కేంద్రాల వద్ద అవే చెప్పుల వరుసలు

  • ఆగ్రహంతో రైతుల ఆందోళనలు.. రాస్తారోకోలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రైతులకు సరిపడా యూరియా దొరకడం లేదు. క్యూ లైన్లలో అదేపనిగా నిలబడాల్సి రావడంతో అలసటా తప్పడం లేదు. యవుసం పనులు మానుకొని, క్యూలో నిలబడటానికే రోజంతా సరిపోతోందని.. అదును దాటాక యూరియా దొరికినా ఉపయోగం ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం కూడా ఎరువుల కేంద్రాల వద్ద రైతులు బారులుతీరారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మహిళా రైతు కూరాకుల మల్లమ్మ క్యూలో సొమ్మసిల్లి పడిపోయింది. ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండలంలో హై వేపై రైతులు రాస్తారోకో చేశారు. వరంగల్‌ జిల్లా నెక్కొండలో మంగళవారం యూరియా ఇస్తున్నారని తెలియడంతో రైతులు సొమవారం రాత్రి 10 గంటలకే చేరుకొని క్యూలో నిల్చున్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో, కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌లో, మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం రాయులాపూర్‌లో, సిద్దిపేట జిల్లా రాయ్‌పోల్‌లో రైతులు క్యూలో చెప్పులు, చెట్ల కొమ్మలు పెట్టారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మహ్మదాబాద్‌ మండలం వెంకట్‌రెడ్డిపల్లి స్టేజీ మహబూబ్‌నగర్‌-చించోళి రహదారిపై రైతులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. మిడ్జిల్‌, మాసాపేట, హన్వాడ మండలాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాబాద్‌లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. రంగారెడ్డి జిల్లాలో చౌదరిగూడ, యాలాల మండలాల్లో రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. తాండూరు మండలం ఎల్మకన్నె ప్యాక్స్‌ వద్దకు ఉదయం 6గంటలకే 300 మంది రైతులు చేరుకున్నారు. 10 గంటలకు అధికారులు ఒక్కో బస్తా చొప్పున టోకెన్లు రాసిచ్చారు. ఆ టోకెన్ల ప్రకారం యూరియా అందజేశారు.


రైతులకు ఇబ్బందుల్లేకుండా యూరియా పంపిణీ

  • అందుకు తగినచర్యలు తీసుకోండి

  • అధికారులకు తుమ్మల ఆదేశాలు

యూరియా పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్లతో పాటు రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీ చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 500 రైతు వేదికల వద్ద యూరియా అమ్మకాలు జరిపేందుకు వీలుగా రెండు రోజుల వ్యవధిలో 500 ఈ-పాస్‌ యంత్రాలు తెప్పించి, సిబ్బందికి శిక్షణ ఇప్పించి యూరియా అమ్మకాలు చేపడుతున్నట్లు తుమ్మల తెలిపారు. రైతులకు ముందస్తుగా టోకెన్లు జారీచేయటం ద్వారా క్యూలైన్లు, తోపు లాటలు లేకుండా పంపిణీ జరుగుతున్నదని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు స్వార్ధంతో యూరియా పంపిణీ కేంద్రాల వద్ద కావాలని ఆందోళనలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని, రైతులు అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వాస్తవాలు చెబితే.. తప్పు పట్టిన బీఆర్ఎస్

ఆలయాల అభివృ‌ద్ధిపై సమీక్ష.. సీఎం కీలక ఆదేశాలు

For More TG News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 04:01 AM