Bhu Bharati Act: భూ భారతితో సమస్యలు తీరేనా
ABN , Publish Date - May 03 , 2025 | 03:48 AM
భూములకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేస్తారా ధరణి రికార్డే భూ భారతిలో ఉంది కదా ఇది కొత్త రికార్డు ఎలా అవుతుంది ధరణి కింద ఇచ్చిన పాస్ పుస్తకాలు చెల్లుబాటు అవుతాయా పాస్‌పుస్తకాలు, ఇతర సమస్యలపై గతంలో పెట్టిన దరఖాస్తులు చెల్లుతాయా.. రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో రైతులకున్న కొన్ని సందేహాలివి.
విధివిధానాలపై వివరంగా చెప్పేవారేరి?
అవగాహనా సదస్సుల్లో భూ సమస్యలపై అనేక సందేహాలు వెలిబుచ్చిన రైతులు
నివృత్తి చేయలేకపోతున్న తహసీల్దార్లు
ఆ సందేహాలకు భూ నిపుణుడు సునీల్ సమాధానాలు.. ‘ఆంధ్రజ్యోతి’తో సంభాషణ
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): ‘‘భూములకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేస్తారా? ధరణి రికార్డే భూ భారతిలో ఉంది కదా? ఇది కొత్త రికార్డు ఎలా అవుతుంది? ధరణి కింద ఇచ్చిన పాస్ పుస్తకాలు చెల్లుబాటు అవుతాయా? పాస్‌పుస్తకాలు, ఇతర సమస్యలపై గతంలో పెట్టిన దరఖాస్తులు చెల్లుతాయా?’’.. రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో రైతులకున్న కొన్ని సందేహాలివి. భూ భారతి చట్టంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహనా సదస్సులు నిర్వహించగా.. రైతుల నుంచి వచ్చిన ఉమ్మడి సందేహాలు ఇలాంటివి పది ఉన్నాయి. వాటిపై కొత్త చట్టంలోని నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఎంత వరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది? అనేదానిపై తహసీల్దార్ స్థాయిలో స్పష్టత ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. మరికొంత మంది తమ సమస్యలకు పరిష్కారం ఉందా, లేదా? అనేది తెలుసుకునేందుకు నేరుగా కార్యాలయాలకు వెళ్తుంటే.. ‘అసలు చట్టం అమల్లో లేదు. నాలుగు మండలాల్లోనే ఉంది. అమల్లోకి వచ్చాక రండి’ అంటూ అధికారులు కసురుకుంటున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. అధికారులకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో ప్రజల సందేహాలకు జవాబు చెప్పలేకపోతున్నారు. విధివిధానాల్లో నెలకొన్న గందరగోళంతో కీలక విషయాలపై రైతుల సందేహాలను నివృత్తి చేయలేకపోతున్నామని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది రైతులు అడిగిన సందేహాలు.. వాటికి చట్టంలో ఉన్న వెసులుబాటుపై భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.
భూములకు సర్వే మ్యాప్
తప్పనిసరి చేస్తారా? భూమికి,
రికార్డుకు వ్యత్యాసం ఉంటే పరిస్థితి ఏంటి?
సమాధానం: కొత్త ఆర్వోఆర్ నిబంధనల్లో సర్వే మ్యాప్ విషయమై దశలవారీ (ఇంక్రిమెంటల్) సర్వే విధానం అమలు చేయనున్నట్లు చెప్పారు. కొనేవారు, అమ్మేవారు అంగీకారానికి వచ్చి లావాదేవీలకు సిద్ధమైతే.. అలాంటి వారికి సర్వే మ్యాప్ ఇచ్చేందుకు నిబంధనల్లో వెసులుబాటు కల్పించారు. ఇక, గట్టు వివాదం ఉన్న సమయంలో సర్వేకు అభ్యంతరాలు వస్తే ఎలా? అనే దానిపై నిబంధనల్లో స్పష్టత లేదు. గ్రామమంతా సర్వే చేస్తారా? లేక కోర్టు ఉత్తర్వులతో సర్వే చేస్తారా? అనుభవంలో ఉన్న విస్తీర్ణం వరకే పరిమితమై సర్వే చేస్తారా? అనే సందేహాలను అధికారులే నివృత్తి చేయాలి. ఆ మేరకు నిబంధనల్లోనూ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ధరణి రికార్డే భూ భారతిలో ఉంది కదా?
ఇది కొత్త రికార్డు ఎలా అవుతుంది?
భూ భారతి పోర్టల్‌లో ప్రస్తుతం ఉన్న ధరణి రికార్డు తాత్కాలికంగా కొన్ని రోజులు ఉంటుంది. దశలవారీగా జరిగే సర్వేతో రికార్డుల సవరణ జరుగుతుంది. దాని ఆధారంగా కొత్త ఆర్‌ఎ్‌సఆర్ తయారవుతుంది. రెవెన్యూ సదస్సులు పెట్టి రైతుల అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరించి.. వారి సమస్యలను పరిష్కరించడం, రికార్డులకు ఎక్కని భూములను ఎక్కించడం ద్వారా కొత్త రికార్డు అందుబాటులోకి వస్తుంది. సవరణలు చేశాక, తాత్కాలిక భూధార్ కార్జులు జారీ చేస్తారు. ప్రస్తుతం గత చట్టంపై కోర్టులో ఉన్న పిటిషన్ మీద తీర్పు రావాల్సి ఉంది. ఆ తీర్పులో ధరణి రికార్డుల్లో జరిగిన మార్పులు, చేర్పులు చెల్లవని చెబితే నాలుగేళ్లపాటు రెవెన్యూ రికార్డుల్లో చోటుచేసుకున్న మార్పులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇలాంటి సాంకేతిక ఇబ్బందులకు తావు లేకుండా కొత్త చట్టంలో సవరణకు చట్టబద్ధత కల్పించేలా ప్రభుత్వం భూ భారతిని తీసుకొచ్చింది. కొత్త చట్టం ప్రకారం రెవెన్యూ రికార్డుల పూర్తి సవరణలతో గత చట్టం బంగాళాఖాతంలో కలవనుంది.
పాస్‌పుస్తకాలు, ఇతర సమస్యలపై గతంలో పెట్టిన
దరఖాస్తు చెల్లుతుందా?
ఇప్పటికే దరఖాస్తు చేసుకుని, ఆ సమస్య అపరిష్కృతంగా ఉంటే మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరంలేదు. పాత దరఖాస్తు ప్రకారమే పరిష్కారం చూపుతారు. ఒకవేళ సమస్య పరిష్కరించకుండా దరఖాస్తును తిరస్కరించి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఏదో ఒక ఆధారం చూపాలి. తండ్రికి పాస్ పుస్తకం ఉండి, కుమారుడికి లేకపోతే.. తండ్రి పాస్ పుస్తకం ఆధారంగా వారసత్వ హక్కుల కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు.
ధరణి కింద ఇచ్చిన పాస్‌పుస్తకాలు
చెల్లుబాటు అవుతాయా? లేక కొత్తవి ఇస్తారా?
ధరణి కింద ఇచ్చిన పాస్‌పుస్తకాలు చెల్లుబాటవుతాయి. కొత్త పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు పెట్టుకోవాల్సిన పని లేదు. ప్రస్తుతం ఉన్న పాస్‌పుస్తకంలో విస్తీర్ణం, పేర్లు తప్పులు ఉంటే సవరణ కోసం సెక్షన్ 4(5) ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. పాస్ పుస్తకం ఉండి.. తమ భూమిని రికార్డుల్లో పూర్తిగా ఎక్కించలేదనే వారు సెక్షన్ 4(6) ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండు సెక్షన్లపై తీసుకునే నిర్ణయాలు కీలకమైనందున సెక్షన్(6)ను లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి రికార్డుల్లో ఎక్కలేదనే సాకుతో ప్రభుత్వ భూములను పొరపాటున నమోదు చేయడానికి వీల్లేకుండా ఈ సెక్షన్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీసీఎల్‌ఏ భావిస్తోంది.
ఆర్డీవో, కలెక్టర్ చుట్టూ మళ్లీ తిరగాల్సిందేనా?
కొత్త చట్టం ప్రకారం అధికారాల వికేంద్రీకరణ చేపట్టారు. 1971 ఆర్వోఆర్ ప్రకారం సాదాబైనామాపై తహసీల్దార్‌కు నిర్ణయం తీసుకునే అధికారం ఉండేది. భూ భారతిలో ఆర్డీవోకు అప్పగించారు. తహసీల్దార్, ఆర్డీవో మధ్య అధికారాల విభజన చేసింది.
పట్టాదార్ పాస్‌పుస్తకంలో మ్యాప్
కావాలనుకుంటే ఎవరిని సంప్రదించాలి?
ప్రస్తుతం పాస్‌పుస్తకం ఉండి.. ఎవరైనా రైతు తనకు సర్వే మ్యాప్ కావాలనుకుంటే.. త్వరలో ప్రభుత్వం మండలానికి ఐదుగురి చొప్పున లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించనుంది. ఈ సర్వేయర్లు మ్యాప్ తయారు చేసి, మండలంలో ఉండే రెగ్యులర్ సర్వేయర్ దాన్ని నిర్ధారించాక.. మ్యాప్ జత చేసి, తహసీల్దారు కొత్త పాస్ పుస్తకాన్ని జారీ చేస్తారు.
సాదాబైనామా ద్వారా భూమిని
అమ్మిన వ్యక్తి, దాన్నే మరొకరికి రిజిస్టర్
డాక్యుమెంట్‌తో విక్రయించి ఉంటే ఎలా?
దరఖాస్తు పెట్టుకోకపోతే క్రమబద్ధీకరిస్తారా? ఫీజులు ఎలా ఉంటాయి?
సాదాబైనామా దరఖాస్తుల విషయంలో విక్రయదారు ఒక వ్యక్తికి అమ్మిన భూమిని మరో వ్యక్తికి రిజిస్టర్ చేస్తే.. సివిల్ కోర్టులో కేసు వేసుకొని హక్కులు తెచ్చుకోవాలి. దీనికి భూ భారతి నిబంధనల్లో పరిష్కారం లేదు. సాదాబైనామా కింద ఉన్న భూమిని క్రమబద్ధీకరణ చేయించుకుంటే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న స్టాంప్ డ్యూటీ ప్రకారమే రుసుములు చెల్లించాలి. సాదాబైనామా ద్వారా కొని, దరఖాస్తు పెట్టుకోని వారు.. భూమిని విక్రయించిన వ్యక్తి అంగీకారంతో క్రమబద్ధీకరణ చేసుకునే వెసులుబాటు ఉంది.
గ్రామ రికార్డులను ఎలా రాస్తారు?
పాత విధానమా, డిజిటల్ రూపంలోనా?
కొత్త చట్టంలో గ్రామ రికార్డులను డిజిటల్ రూపంలోనే భద్రపరుస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏడాదికి ఒకసారి ఈ రికార్డును ప్రింట్ తీస్తారు. ఎన్ని కాలమ్స్ ఉండాలి? ధరణికి ముందు ఉన్న విధానంలోనే గ్రామ రికార్డులను కొనసాగించాలా? ఎలాంటి నమూనాలో ఉండాలి? అనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. త్వరలో స్పష్టత ఇవ్వనుంది. డిజిటల్ రికార్డులను పోర్టల్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
భూధార్ కార్డు..
పాస్‌పుస్తకాలకు ప్రత్యామ్నాయమా?
క్రయవిక్రయాల సమయంలో సర్వే మ్యాప్ వచ్చిన వారికి తాత్కాలిక భూధార్ కార్డు ఇస్తారు. ఇది పాస్ పుస్తకానికి ప్రత్యామ్నాయం కాదు. గతంలో నకిలీ పాస్‌పుస్తకాలను నిలువరించేందుకు విశిష్ట సంఖ్యను ఇచ్చినట్లుగానే ఇప్పుడు భూధార్ కార్డును ఇస్తారు.
అసైన్డ్ భూములు కొన్న పేదలకు
క్రమబద్ధీకరించి, లావుణి పట్టాలు ఇస్తారా?
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు 5 ఎకరాల్లోపు ప్రభుత్వ భూములు కొని ఉండి, చట్ట ప్రకారం అర్హులైతే లావుణి పట్టా ఇస్తారు. 2017కి ముందు కొనుగోలు చేసిన భూములకే ఇది వర్తిస్తుంది. వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు మాత్రమే దీన్ని వర్తింపజేస్తారు. భూమి కొన్న వ్యక్తి ఇంట్లో ఉద్యోగస్థులు ఉండకూడదు. భూ భారతి చట్టం సెక్షన్ 8 ప్రకారం దీనిపై నిర్ణయం తీసుకుంటారు. పేదల ముసుగులో భూములు పెద్దల చేతుల్లోకి పోకుండా అడ్డుకునేలా నిబంధనల్లో మార్పు చేయాల్సిన అవసరం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News