Share News

High Court: నకిలీ తీర్పు కాపీలతో 100 ఎకరాలు స్వాహా

ABN , Publish Date - Apr 12 , 2025 | 04:51 AM

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ)కి కొంత మంది ప్రైవేటు వ్యక్తులకు మధ్య నడుస్తున్న వంద ఎకరాల భూ వివాదంలో కోర్టు నకిలీ తీర్పు కాపీలు కలకలం సృష్టించాయి.

High Court: నకిలీ తీర్పు కాపీలతో 100 ఎకరాలు స్వాహా

  • శంషాబాద్‌ పైగా విలేజ్‌ కేసులో ట్విస్ట్‌

  • మోసం చేసిన వ్యక్తులపై హైకోర్టు ఆగ్రహం

  • నకిలీ తీర్పు కాపీలపై సిట్‌ దర్యాప్తునకు ఆదేశం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ)కి కొంత మంది ప్రైవేటు వ్యక్తులకు మధ్య నడుస్తున్న వంద ఎకరాల భూ వివాదంలో కోర్టు నకిలీ తీర్పు కాపీలు కలకలం సృష్టించాయి. ఈ భూమి తమదేనని అంటున్న ప్రైవేటు వ్యక్తులు హైకోర్టుకు ఇచ్చింది నకిలీ తీర్పు కాపీలని ధర్మాసనం ప్రాథమికంగా గుర్తించింది. ఆ తీర్పు కాపీలపై పోలీసు దర్యాప్తునకు ఆదేశాలు జారీచేసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శంషాబాద్‌ పైగా విలేజ్‌లోని 661, 662, 663, 664, 720, 721, 724, 725, 727, 729, 730, 731, 732, 775 తదితర సర్వే నంబర్లలో రూ.వందల కోట్ల విలువ చేసే దాదాపు 100 ఎకరాల భూ వివాదంలో సివిల్‌ కోర్టు హైదరాబాద్‌ జహానుమాకు చెందిన మహమ్మద్‌ తాహెర్‌ఖాన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హెచ్‌ఎండీఏ హైకోర్టులో అప్పీల్‌ చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌, జస్టిస్‌ పి.శ్రీసుధ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్నవి హైకోర్టు నకిలీ తీర్పు కాపీలని ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది.


ఆ తీర్పు కాపీల ఆధారంగా వారు యాజమాన్య హక్కులను కోరుతున్నారని సంశయించింది. సదరు తీర్పునకు సంబంధించి అసలు హైకోర్టులో పిటిషన్‌ నమోదైందా..? అన్నదానిపై విచారణ చేయాలని జ్యుడీషియల్‌ రిజిస్ట్రార్‌ను ధర్మాసనం గతంలో ఆదేశించింది. రిజిస్ట్రార్‌ సీల్డ్‌ కవర్‌లో సమర్పించిన నివేదికను ధర్మాసనం శుక్రవారం కోర్టులో తెరిచింది. ఆ నివేదిక ప్రకారం.. ప్రైవేటు వ్యక్తులు సమర్పించిన తీర్పు కాపీ 1988 ఏప్రిల్‌ 29న జస్టిస్‌ ఎన్‌డీ పట్నాయక్‌ ఇచ్చినట్లు ఉంది. అయితే పట్నాయక్‌ 1988 డిసెంబర్‌ 28న జడ్జిగా ఎంపికయ్యారని ధర్మాసనం గుర్తించింది. దాంతోపాటు సదరు తీర్పు కాపీలో ఉన్న రిట్‌ పిటిషన్‌ నంబరు రిజిస్టర్‌ అయినట్లు హైకోర్టు రికార్డుల్లో ఎక్కడా లేదని తెలిసింది. దీంతో ఇది నకిలీ తీర్పు కాపీల ద్వారా కోర్టును మోసం చేయడమేనని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై జ్యుడీషియల్‌ రిజిస్ట్రార్‌.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే చార్మినార్‌ పోలీ్‌సస్టేషన్‌లో నమోదై ఉన్న ఇలాంటి మరో రెండు ఎఫ్‌ఐఆర్‌లతో కలిపి ప్రస్తుత ఫిర్యాదును దర్యాప్తు చేయడానికి సిట్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. సదరు వివాదాస్పద భూమి వ్యవహారంలో ఇరుపక్షాలు యథాతథ స్థితి(స్టేటస్‌ కో) కొనసాగించాలని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి:

అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..

షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..

దారుణం.. తండ్రి శవ పేటిక కింద ఇరుక్కుపోయిన తనయుడు

Read Latest and Viral News

Updated Date - Apr 12 , 2025 | 04:51 AM