Hyderabad: ఫ్యూచర్ సిటీ ఓ పెద్ద స్కామ్..
ABN , Publish Date - Dec 03 , 2025 | 10:15 AM
ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన ఫ్యూచర్ సిటీ.. ఒక పెద్ద స్కాం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. దీని వెనుక చాలా మతలబు ఉందని, పారిశ్రామికీకరణ జరిగినంత మాత్రాన మానవ అభివృద్థి జరగదని పేర్కొంటున్నారు.
- ఏ అభివృద్ధి అయినా విధ్వంసం లేకుండా జరగడం లేదు
- ప్రభుత్వానికి ఇండస్ర్టీ పాలసీ మీద స్పష్టత లేదు
- రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు
హైదరాబాద్: పారిశ్రామికీకరణ వల్ల దెబ్బతిన్న దేశాలు చాలా ఉన్నాయని, మానవీయ కోణం లేకుండా ఏ అభివృద్థి అయినా విధ్వంసానికి దారి తీస్తుందని పలువురు వక్తలు అన్నారు. ఫ్యూచర్ సిటీ(Future City) అనేది పెద్ద స్కామ్ అని, రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్ పాలసీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిగ్నల్ టీవీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో హిల్ట్ పాలసీ స్కీమా.. స్కామా అనే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ శివారెడ్డి అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. పారిశ్రామికీకరణ జరిగినంత మాత్రాన మానవ అభివృద్థి జరగదని, ఇలాంటి అభివృద్థితో ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు.
మానవ విలువలు, జీవన ప్రమాణాలు మెరుగు పడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వానికి ఇండస్ర్టీ పాలసీ మీద స్పష్టత లేదని, పాశ్చాత్య అభివృద్థి నమునాపై జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టూ 9 వేల ఎకరాలు హిల్డ్ పాలసీలో భాగంగా ఇతర అవసరాల కోసం కేటాయించారని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో ఓ శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. చండీగఢ్‌పై జరిగిన కుట్ర మాదిరిగా కేంద్ర ప్రభుత్వం ఇతర నగరాలపై కూడా కన్నేసిందని ఆరోపించారు.
రాజకీయ నాయకుల స్వార్థంతో హైదరాబాద్ నగరం పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి దాపురించిందని, బీజేపీ కూడా దీనికి సహకరిస్తున్నట్లు తెలుస్తున్నదని అన్నారు. పర్యావరణ వేత్త పాపారావు మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీ అనేది పెద్ద స్కామ్ అని, సెంట్రల్ యూనివర్సిటీ భూములను కూడా సేకరించాలని చూశారని, సుప్రీంకోర్టు చీవాట్లు పెడితే ఊరుకున్నారని తెలిపారు. కాలుష్యంపై అవగాహన లేకుండా భూములు సేకరించాలని చూస్తున్నారని చెప్పారు. ఎంఎ్‌సఎంఈ జేఏసీ చైర్మన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు భూముల అవసరమని, భూములు విక్రయిస్తారా? లీజుకు ఇస్తారా? అనేది ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలన్నారు. సీనియర్ జర్నలిస్ట్ శైలేష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రాజకీయాలన్నీ భూముల చుట్టే తిరుగుతున్నాయన్నారు.

హిల్ట్ పాలసీ పెద్ద భూ దోపిడీ అని విమర్శించారు. బక్క జడ్సన్ మాట్లాడుతూ కాంగ్రెస్ తెచ్చిన ప్రతి పాలసీ దోపిడీ కోసమే, రేవంత్‌రెడ్డి ఆలోచనలన్నీ లాక్కోవడానికేనని అన్నారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ మాట్లాడుతూ నగరం రూపురేఖలు మార్చే హిల్ట్ పాలసీపై తొందర ఎందుకని, దీనిపై విస్తృత చర్చ జరగాలని అన్నారు. ఇన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతం చేస్తుంటే ఎవరూ చూస్తూ ఊరుకోరని తెలిపారు. విస్తృత చర్చ లేకుండా ఈ పాలసీ ఎలా తెచ్చారని బీఆర్‌ఎస్ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు ప్రకాష్ రెడ్డి, మర్రి ప్రభాకర్, రమణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టుబట్టి.. మంజూరు చేయించి...
Read Latest Telangana News and National News