N Ramchander Rao: త్వరలోనే బీఆర్‌ఎస్ ఖాళీ
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:19 AM
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదివారం బీజేపీలో చేరబోతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు ప్రకటించారు.
పలువురు గులాబీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాతో టచ్‌లో ఉన్నారు
రేపు బీజేపీలోకి గువ్వల బాలరాజు
అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేతలు సమయం కోసం ఎదురుచూస్తున్నారు
బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్/నాగర్‌కర్నూల్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదివారం బీజేపీలో చేరబోతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు ప్రకటించారు. గులాబీ పార్టీ త్వరలోనే ఖాళీ కాబోతోందని, బాలరాజు చేరికనే అందుకు సంకేతమని తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకత్వంపై ఆ పార్టీ నేతలు నమ్మకం కోల్పోయారని చెప్పారు. శుక్రవారం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. కారు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోడ్డున పడుతున్నాయని, ఈ పరిస్థితిలో వారికి బీజేపీయే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని వివరించారు. కాంగ్రె్‌సలో కొంత మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారంతా సమయం కోసం చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలకు చెందిన కొందరు రాజకీయ ప్రముఖులకు బీజేపీ వేదిక కాబోతోందని వెల్లడించారు.
వీరితో పాటు యువత, మేధావులు, విద్యావేత్తలను కూడా బీజేపీలో చేరాలని ఆహ్వానిస్తున్నట్లు రాంచందర్‌రావు చెప్పారు. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో బీజేపీలోకి వెళ్లాలనుకున్న మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల చేరిక పలు కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలిసింది. కమలం అధిష్ఠానంతో చర్చలు సఫలీకృతమైతే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహాం కూడా బీజేపీ గూటికి వెళతారనే ప్రచారం బలంగా జరుగుతోంది. ఫామ్‌హౌ్‌సలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న మరో మాజీ ఎమ్మెల్యే కూడా కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News