Share News

Etela Rajender: రాష్ట్రాభివృద్ధికి బీజేపీ ఎంపీల సహకారం

ABN , Publish Date - Aug 24 , 2025 | 02:25 AM

తెలంగాణ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర బీజేపీ ఎంపీల సహకారం ఉంటుందని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు...

Etela Rajender: రాష్ట్రాభివృద్ధికి బీజేపీ ఎంపీల సహకారం

  • యూరియా కొరతపై రాజకీయం వద్దు

  • రూ.5లక్షల్లో ఇంటి నిర్మాణం సాధ్యంకాదు

  • నిబంధనలను సడలించి సాయం అందించాలి: ఈటల

  • సచివాలయంలో మంత్రి పొంగులేటితో భేటీ

హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర బీజేపీ ఎంపీల సహకారం ఉంటుందని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. యూరియా కొరతపై రాజకీయం చేయొద్దని, బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల సమస్యలపై శనివారం ఈటల సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సమావేశమై, వినతిపత్రాలు అందించారు. అనంతరం మీడియా పాయింట్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏ సీజన్‌కు ఎంతమేర ఎరువులు అవసరమవుతాయి? అందులో యూరియా ఎంత కావాలనేది రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి కేంద్రానికి ఇండెంట్‌ పెట్టుకుని ముందుగానే స్టాక్‌ తెప్పించి నిల్వలు ఉంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఈ రకమైన ప్రణాళిక ఎక్కడ కొరవడిందోనని అన్నారు. యూరియా విషయంలో రాజకీయం కాకుండా రైతులకు దానిని ఎలా అందించాలనే అంశంపై ఆలోచన చేయాలని, కేంద్రంపై నెపం నెట్టడం మంచిదికాదన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ నిర్వహణ బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదేనని చెప్పారు. రాష్ట్రాల వారీగా కేంద్రం ఇళ్లను మంజూరు చేస్తుందని, అర్హుల వారీగా నిబంధనలను పరిశీలించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఇళ్ల మంజూరు విషయంలో కఠిన నిబంధనలు ఉంటే వాటిని సులభతరం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగాయని, రూ.5 లక్షలతో ఇంటి నిర్మాణం సాధ్యం కాదన్నారు. కొన్ని నిబంధనలు సడలించి ఇల్లు నిర్మించుకునే వారికి సాయం అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోలేదని, అర్హులకు కొన్నిచోట్ల ఇళ్లు మంజూరు కాలేదని, దీనికి సంబంధించిన జాబితాను కూడా మంత్రికి అందజేసినట్టు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు

అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 02:25 AM