EPS: రాసిపెట్టుకోండి.. 210 స్థానాల్లో గెలుపు మాదే..
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:45 AM
రాష్ట్రప్రజల అండదండలతో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 210 స్థానాల్లో ఘన విజయం సాధించి అధికారం చేపడతామని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధీమా వ్యక్తం చేశారు.
- ధర్మపురి రోడ్‌షోలో ఈపీఎస్
చెన్నై: రాష్ట్రప్రజల అండదండలతో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 210 స్థానాల్లో ఘన విజయం సాధించి అధికారం చేపడతామని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధీమా వ్యక్తం చేశారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో ఈపీఎస్ చేపట్టిన ప్రచారయాత్ర శుక్రవారం ధర్మపురి(Dharmapuri) నియోజకవర్గానికి చేరుకుంది.
ఈపీఎ్‌సకు రోడ్డు పొడవునా ఎన్డీయే కూటమి తరుఫున స్వాగతం పలుకుతూ, ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలు ఏర్పాటు చేశారు. ఇందులో విశేషమేమిటంటే పాలక్కోడు ప్రాంతంలో ఈపీఎ్‌సను స్వాగతిస్తూ టీవీకే యువజన విభాగం కారిమంగళం ఆర్గనైజర్ టి.సెల్వం ఏర్పాటు చేసిన బ్యానర్ అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఆయన రోడ్‌షోలో పాల్గొని కరూర్ మృతులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించి అంజలి ఘటించారు.

అనంతరం మాట్లాడుతూ, డీఎంకే ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని, ప్రతిపక్షాల బహిరంగ సభలు, రోడ్‌షోలు, ఊరేగింపు, ర్యాలీ తదితర కార్యక్రమాలకు పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని, అయితే కరూర్‌లో భద్రతా ఏర్పాట్లు అంతంత మాత్రమే కావడంతో తొక్కిసలాటకు దారితీసి, 41 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. అధికారాన్ని తమ చేతుల్లో ఉంచుకున్న డీఎంకే ఇతరులపై నిందమోపడం సరికాదని, ఇకనైనా బహిరంగ సభలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇటీవల కాలంగా బాటిల్‌కు రూ.10 పాట వింటుంటే మాజీమంత్రి సెంథిల్‌బాలాజీ ఎందుకు ఆందోళనకు గురవుతున్నారో అర్థంకావడం లేదని, కరూర్ ఘటన తర్వాత ఆయన మాటల్లో స్పష్టతలేదన్నారు. డీఎంకే కూటమిలో భాగస్వామ్యం వహిస్తున్న పార్టీలు కరూర్ ఘటనపై అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, డీపీఐ నేత తిరుమావళవన్ మనస్సాక్షిలేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డీఎంకేకు రెండుసార్లు కరూర్ సమీపంలో ఉన్న రౌంటానాలో బహిరంగ సభ జరుపుకునేందుకు అనుమతులిచ్చామని, ఆ స్థలాన్ని ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల సభలకు కేటాయించడంలేదని మండిపడ్డారు. ధర్మపురి జిల్లాలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు, శేషంపట్టి నుంచి ధర్మపురి వరకు అవుటర్ రింగురోడ్డు ఏర్పాటు చేశామని, అయితే ఈ నాలుగున్నరేళ్ల డీఎంకే పాలనలో జిల్లాకు చెప్పుదగ్గస్థాయిలో పథకాలు తీసుకురాకపోగా, అన్నాడీఎంకే పథకాలను పక్కనబెట్టారని ఈపీఎస్ ధ్వజమెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయ్ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం.. అనుకున్నదే జరిగింది
పెరిగిన ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు.. ఏ సేవకి ఎంత చెల్లించాలంటే
Read Latest Telangana News and National News