Tire Recycling: కాటేపల్లి టైర్ల రీసైక్లింగ్ పరిశ్రమలు మూసివేయాలి
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:32 AM
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి, దాని పరిసర గ్రామాలలో కాలుష్యాన్ని వేదజల్లుతున్న టైర్ల రీసైక్లింగ్ పరిశ్రమలను మూసివేయాలని వక్తలు డిమాండ్ చేశారు.
కాలుష్యంతో అనారోగ్యాల బారిన స్థానికులు
మూసివేయకపోతే ఆందోళనలు చేపడతాం
అఖిలపక్ష సమావేశంలో వక్తలు
పంజాగుట్ట, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి, దాని పరిసర గ్రామాలలో కాలుష్యాన్ని వేదజల్లుతున్న టైర్ల రీసైక్లింగ్ పరిశ్రమలను మూసివేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు, వ్యవసాయ భూములను కాపాడాలని కోరారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కాటేపల్లి, పొరుగు పల్లెలను కాష్టంలో కాలుస్తున్న టైర్ల రీసైక్లింగ్ పరిశ్రమల కాలుష్యంపై అఖిలపక్ష సమావేశం జరిగింది. తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జస్టిస్ బి.చంద్ర కుమార్, బీఆర్‌ఎస్ నాయకురాలు తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే వి.శ్రీరాములు, శాస్త్రవేత్త ప్రొఫెసర్ బాబూరావు, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి తదితరులు పాల్గొని మాట్లాడారు. పర్యావరణ నిబంధనల ప్రకారం ఇటువంటి పరిశ్రమలను పారిశ్రామిక వాడలలో ఏర్పాటు చేయాలని, కానీ చట్టాలకు విరుద్ధంగా వ్యవసాయ భూములలో స్థాపించారని వారు తెలిపారు.
అక్రమ పద్ధతుల్లో కాలుష్య నియంత్రణ మండలి నుంచి సర్టిఫికెట్లు పొంది ఈ పరిశ్రమలను నడిపిస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమల నుంచి వచ్చే దట్టమైన పొగ, నల్లటి బూడిద, భరించలేని దుర్వాసన వల్ల స్థానికులు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లటి బూడిద వల్ల పంటలు, కూరగాయలు, పండ్ల తోటలు దెబ్బతిని మార్కెట్లో వాటికి సరైన ధర లభించడం లేదని రైతులు తెలిపారు. పరిశ్రమల నిర్మాణ సమయంలోనే వాటిని అడ్డుకున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోలేదని గ్రామ ప్రజలు ఆరోపించారు. ఎనిమిది నెలలుగా ఈ సమస్యతో బాధపడుతున్నా ఎవరూ స్పందించడం లేదని వారు వాపోయారు. కాలుష్యం వేదజల్లుతున్న ఈ పరిశ్రమలను వెంటనే మూసి వేయకపోతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News