Share News

Indiramma Houses: కోడ్‌ ముగిశాకే.. కొత్త ఇళ్లు

ABN , Publish Date - Feb 10 , 2025 | 04:05 AM

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో ఆటంకం ఏర్పడింది. కోడ్‌ ముగిసిన తరువాతే మళ్లీ కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయి.

Indiramma Houses: కోడ్‌ ముగిశాకే.. కొత్త ఇళ్లు

  • ఎమ్మెల్సీ ఎన్నికలతో ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్‌

  • ఇప్పటికే మంజూరైన వాటికి ఇబ్బంది లేదు

  • లబ్ధిదార్ల జాబితా విడుదల చేస్తున్న కలెక్టర్లు

  • గత ప్రభుత్వ హయాంలో ‘గృహలక్ష్మి’ కింద

  • ఇళ్లు మంజూరైన వారి వివరాల సేకరణ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో ఆటంకం ఏర్పడింది. కోడ్‌ ముగిసిన తరువాతే మళ్లీ కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయి. దీని ప్రకారం కొత్తగా ఖరారు చేసిన లబ్ధిదారులకు మార్చిలో ఇళ్లు మంజూరవుతాయని తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న ప్రారంభించిన నాలుగు పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 71,500 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందించింది. ఆ పత్రాలు అందుకున్న వారు ఇంటిని నిర్మించుకునేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. దరఖాస్తుదారుల్లో మళ్లీ కొత్తగా అర్హులను తేల్చి, వారికి మంజూరు పత్రాలను ఇవ్వడానికి మాత్రమే కోడ్‌ వల్ల ఇబ్బంది తలెత్తిందని, అందువల్లే కొత్త ఇళ్ల మంజూరును చేపట్టడం లేదని తెలిసింది. కొత్త లబ్ధిదారులను ఖరారు చేసిన తర్వాత వారికి అందించే మంజూరు పత్రాల కోసం మళ్లీ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని.. కోడ్‌ నిబంధనల ప్రకారం కొత్తగా ఉత్తుర్వులు ఇచ్చేందుకు అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినపుడు సాధారణంగా ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు అవకాశం ఉండదని అధికార వర్గాలు అంటున్నాయి. ఏదైనా పథకాన్ని అప్పటికే అమలు చేస్తున్నట్టయితే దాని వివరాలను తెలుపుతూ, అమలుకు అవకాశం ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. దానిని పరిశీలించిన తర్వాత ఏం చేయాలో ఎన్నికల కమిషన్‌ స్పష్టతనిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని తెలుపుతూ, పథకం అమలుకు అవకాశం ఇవ్వాలని అధికారులు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసే అంశంపై స్పష్టతరావాల్సి ఉంది.


క్షేత్రస్థాయి నుంచి వస్తున్న జాబితాలు

డిసెంబరు 2023లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి కోసం గ్రామీణ ప్రాంతాల్లో 69,83,895 దరఖాస్తులు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 10,70,659 దరఖాస్తులు కలిపి మొత్తం 80.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని మూడు విభాగాలుగా విభజించారు. ఇప్పటికే ఈ దరఖాస్తుల పరిశీలన ఒకదఫా పూర్తయినప్పటికీ పథకంలో అనర్హులకు అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో జిల్లాల్లో మరోసారి దరఖాస్తుల పునఃపరిశీలన చేపట్టారు. అందులో అర్హులుగా తేలిన వారి జాబితాలు జిల్లా కలెక్టర్ల నుంచి గృహ నిర్మాణ శాఖకు ఒక్కొక్కటిగా అందుతున్నాయి. ఈ జాబితాలన్నీ అందగానే అర్హులైన వారందరికీ ఇళ్లను మంజూరు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


గృహలక్ష్మి లబ్ధిదారులు ఎంత మంది..?

అసెంబ్లీ ఎన్నికల ముందు 2023లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గృహలక్ష్మి పేరుతో ఇళ్లను మంజూరు చేసింది. ఈ పథకం కింద అర్హులుగా తేలినవారికి ఇంటిని నిర్మించుకునేందుకు రూ.3లక్షలు అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ఆ పథకాన్ని రద్దు చేసి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే గత ప్రభుత్వ హయాంలో అమలైన గృహలక్ష్మి పథకం కింద ఎంత మంది కి ఇళ్ల పట్టాలు అందాయనేదానిపై గృహ నిర్మాణశాఖ దృష్టి సారించింది. అప్పుడు ఇళ్ల పట్టాలు పొందిన వారి వివరాలను పంపాలంటూ జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్‌ పంపినట్టు సమాచారం. ఆ వివరాలు వచ్చిన తర్వాత, గతంలో ఇళ్ల పట్టాలు పొందిన వారు ఇందిరమ్మ ఇళ్లకు కూడా దరఖాస్తు చేసుకున్నారా..? అనే వివరాలను పరిశీలించనున్నారు. అనంతరం వారికి ఇళ్లను అందించే అంశంపై ప్రభుత్వానికి ఒక లేఖను రాయనున్నట్టు తెలిసింది. కాగా, గతంలో గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,000 మందికి లోపే ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చినట్టు సమాచారం.


ఇవి కూడా చదవండి..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 10 , 2025 | 04:05 AM