Share News

మహారాష్ట్ర టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఇంట్లో నగల గుట్ట, కరెన్సీ కట్టలు!

ABN , Publish Date - May 16 , 2025 | 03:50 AM

మహారాష్ట్రలోని వాసయి విరార్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (వీవీఎంసీ) టౌన్‌ ప్లానింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వైఎస్‌ రెడ్డికి చెందిన నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు కళ్లు చెదిరే స్వర్ణ, వజ్రాభరణాలు, భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్ర టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఇంట్లో నగల గుట్ట, కరెన్సీ కట్టలు!

  • రూ.23.25 కోట్ల విలువైన స్వర్ణ, వజ్రాభరణాల స్వాధీనం

  • రూ.9.04 కోట్ల నగదు కూడా

  • హైదరాబాద్‌, ముంబైతో పాటు 13 ప్రాంతాల్లో ఈడీ సోదాలు

  • 2016లో ఓ లంచం కేసులో అరెస్టు అయిన వైఎస్‌ రెడ్డి

  • ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా?

హైదరాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని వాసయి విరార్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (వీవీఎంసీ) టౌన్‌ ప్లానింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వైఎస్‌ రెడ్డికి చెందిన నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు కళ్లు చెదిరే స్వర్ణ, వజ్రాభరణాలు, భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ముంబై, హైదరాబాద్‌, ఏపీలోని కర్నూలుతో పాటు 13 చోట్ల వైఎస్‌ రెడ్డికి చెందిన నివాసాల్లో జరిగిన సోదాల్లో రూ.9.04 కోట్ల నగదు, రూ.23.25 కోట్ల బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మహారాష్ట్రలోని మిరబయందర్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులు.. సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, డంపింగ్‌యార్డు కోసం కేటాయించిన స్ధలాల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి కోట్లాది రూపాయలు సంపాదించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా వైఎస్‌ రెడ్డికి చెందిన బంధువులు, సన్నిహితులపై నిఘాపెట్టారు. ఈ క్రమంలో తాజాగా ఈడీ దాడులు నిర్వహించి స్వర్ణ, వజ్రాభరణాలు, భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.


వివిఎంసీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్ధలంలో 41 భవనాలు అక్రమంగా నిర్మించారని ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో ఈ భవనాలను కూల్చివేయాలని ముంబై హైకోర్టు గతేడాది ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో బిల్డర్లు సవాలు చేశారు. అయితే, సుప్రీంకోర్టు వీరికి ఎలాంటి ఊరట ఇవ్వకుండా పిటీషన్‌ను డిస్మిస్‌ చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20న వివిఎంసీ అధికారులు 41 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. 2009 నుంచి ప్రారంభమైన ఈ అక్రమ నిర్మాణాలు సీతారాం గుప్తా, అరుణ్‌గుప్తా ఆధ్వర్యంలో జరిగాయని, నాటి వివిఎంసీ అధికారులు వీరికి సహకరించారని ఈడీ విచారణలో వెల్లడైంది. కాగా, వైఎస్‌ రెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి అయినట్లు సమాచారం. ఆయన హైదరాబాద్‌లో ఎక్కువగా ఆస్తులను కూడబెట్టినట్లు ఈడీ అధికారుల విచారణలో వెల్లడైంది.


వైఎస్‌ రెడ్డిపై గతంలోనే థానే ఏసీబీ కేసు..

వీవీఎంసీలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వైఎస్‌ రెడ్డి శివసేన కార్పొరేటర్‌ ధనుంజయ గౌడ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా 2016లో ఽథానే అవినీతి నిరోధక శాఖాధికారులు అరెస్టు చేశారు. అప్పట్లో హైదరాబాద్‌లో వైఎస్‌ రెడ్డికి చెందిన ఆస్తులకు సంబంధించి ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో 11 అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, 9 వ్యవసాయ భూములను గుర్తించారు. అప్పట్లో వీటి విలువ రూ.80 లక్షలు ఉండొచ్చని థానే ఏసీబీ అధికారులు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు

For Telangana News And Telugu News

Updated Date - May 16 , 2025 | 03:50 AM