KTR: విదేశీ కరెన్సీలో ఎందుకు చెల్లించారు?
ABN , Publish Date - Jan 17 , 2025 | 03:09 AM
‘విదేశీ సంస్థ అయిన ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో)కు రూ.45.71 కోట్లకు సమానమైన మొత్తాన్ని విదేశీ కరెన్సీలో ఎందుకు చెల్లించారు? రిజర్వ్‌బ్యాంకు అనుమతి తీసుకున్నారా?

రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకున్నారా?
మంత్రిగా నిబంధనలు ఎలా ఉల్లంఘించారు?
మీ ఆదేశాలనే పాటించామని హెచ్‌ఎండీఏ
మాజీ చీఫ్ ఇంజనీర్ చెప్పారు కదా?
ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌పై ఈడీ ప్రశ్నలు
అడిగిన వాటికే జవాబివ్వాలని స్పష్టీకరణ
అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి వాంగ్మూలం
ఆధారంగా ప్రశ్నలు.. స్టేట్‌మెంట్ రికార్డు
అంతా అధికారులే చూసుకున్నారన్న కేటీఆర్
7.30 గంటల విచారణ.. ఈడీకి 2 డాక్యుమెంట్లు
హైదరాబాద్, హిమాయత్‌నగర్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ‘విదేశీ సంస్థ అయిన ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో)కు రూ.45.71 కోట్లకు సమానమైన మొత్తాన్ని విదేశీ కరెన్సీలో ఎందుకు చెల్లించారు? రిజర్వ్‌బ్యాంకు అనుమతి తీసుకున్నారా? విదేశీ కరెన్సీ నిధుల చెల్లింపులో పాటించాల్సిన నిబంధనలను మీరు ఎందుకు అనుసరించలేదు?’ అంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నాడు పురపాలకశాఖ మంత్రి హోదాలో మీరు చెబితేనే హెచ్‌ఏండీఏ నుంచి ఎఫ్‌ఈఓకు డబ్బు విడుదల చేశామని అధికారులంటున్నారు. మరీ మీరు ఆ విధమైన ఆదేశాలు ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఫార్ములా-ఈ రేసు కేసుకు సంబంధించి కేటీఆర్‌ను ఈడీ అధికారులు గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు.. దాదాపు ఏడున్నర గంటలు విచారించారు. మధ్యలో కొద్దిసేపు విరామం ఇచ్చారు. ఈడీలోని జాయింట్ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణ కొనసాగింది. ఎక్కువగా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కేటీఆర్‌ను ప్రశ్నించారని, దాదాపు 40 ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది.
కొత్త ఆదేశాలు ఎందుకు ఇచ్చారు?
‘2022 అక్టోబరు 25న జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం ప్రమోటర్ కంపెనీ అయిన ఏస్ నెక్ట్స్‌జెన్.. అన్ని సీజన్లకు ఫీజు చెల్లించాల్సి ఉండగా, మీరెందుకు 2023లో కొత్త ఆదేశాలు ఇచ్చారు? హెచ్‌ఎండీఏ జనరల్ నిధుల నుంచి రెండు ఇన్వాయి్‌సలకు సంబంధించిన మొత్తాన్ని క్లియర్ చేస్తూ ప్రొసీడింగ్ ఇచ్చిన నాటి చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి.. మీ ఆదేశాలనే అమలు చేశానని చెప్పారు కదా?’ అని ఈడీ అధికారులు ప్రశ్నించగా.. అదంతా అధికారులే చూసుకున్నారని కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. నాటి లావాదేవీలకు సంబంధించిన సొమ్ము ఎక్కడికీ పోలేదని, ఎఫ్‌ఈఓ వద్ద భద్రంగా ఉందని.. ప్రభుత్వం ఆ సొమ్ము తీసుకోకుండా, కక్షసాధింపు కోసమే కేసు పెట్టిందని కేటీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. ఇది తప్పుడు కేసు, ఇందులో పైసా అవినీతి జరగలేదని కేటీఆర్ పలుమార్లు అన్నప్పుడు.. అడిగిన ప్రశ్నకు మాత్రమే జవాబు ఇవ్వండని ఓ దశలో ఈడీ అధికారులు అన్నట్టు సమాచారం. పుర పాలక శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, హెచ్‌ఏండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్‌ను ఈడీ అఽధికారులు ప్రశ్నించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. నిధుల బదిలీకి సంబంధించి మంత్రి హోదాలో కేటీఆర్ ఇచ్చిన ఉత్తర్వులను చూపించి మరీ ప్రశ్నించినట్లు తెలిసింది.
ఈడీకి డాక్యుమెంట్లు ఇచ్చిన కేటీఆర్
ఈడీ విచారణకు హజరైన కేటీఆర్ అక్కడి అధికారులకు రెండు డాక్యుమెంట్లను ఇచ్చి రసీదు తీసుకున్నట్లు సమాచారం. ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించి నీల్సన్ సంస్థ రూపొందించిన నివేదికతోపాటు తెలంగాణ ఈవీ పాలసీ-2020కి సంబంధించిన డాక్యుమెంట్లను ఈడీ అధికారులకు కేటీఆర్ అందజేసినట్లు తెలిసింది. కాగా, వ్యక్తిగత బ్యాంకు ఖాతా, ఆస్తుల వివరాలను ఈడీ అధికారులు అడగ్గా, త్వరలోనే వాటిని ఇస్తానని కేటీఆర్ చెప్పారని సమాచారం.
లై డిటెక్టర్ పరీక్షకు రెడీ: కేటీఆర్
రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు సహకరిస్తానని, ఎన్నిసార్లు పిలిచినా వస్తానని.. లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని కేటీఆర్ స్పష్టం చేశారు. విచారణ అనంతరం ఈడీ కార్యాలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో పైసా అవినీతి జరగలేదని ముందు నుంచి తాను చెబుతున్నానని, అయినా విచారణ పేరిట రూ.కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. న్యాయమూర్తుల సమక్షంలో కానీ, రేవంత్ ప్యాల్‌సలో కానీ, మీడియా ముందు అయినా బహిరంగచర్చకు తాను సిద్ధమని, లై డిటెక్టర్ పరీక్షకూ సిద్ధపడతానని తెలిపారు. అలాగే రేవంత్‌రెడ్డి లై డిటెక్టర్ పరీక్షకు రాగలరా ? అని ప్రశ్నించారు. అప్పుడు దొంగ ఎవరో ప్రజలకు తెలుస్తుందన్నారు. రూ.50లక్షలతో దొరికిన రేవంత్ రెడ్డిపై అప్పట్లో ఏసీబీ, ఈడీ కేసులు నమోదయ్యాయని, అవి ఇంకా విచారణలో ఉన్నాయని, తన మీద కేసులున్నాయి కాబట్టే.. నాపైనా ఏసీబీ, ఈడీ కేసులు రేవంత్ రెడ్డి పెట్టించాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీ, ఈడీ.. ఒకే విధమైన ప్రశ్నలను తిప్పితిప్పి అడిగాయని, పైసా అవినీతి లేనపుడు కేసు ఎక్కడని ప్రశ్నించారు. ఏసీబీ వాళ్లు 80 ప్రశ్నలు అడిగారు, ఈడీ వాళ్లు 40 ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానం ఇచ్చానని తెలిపారు. అంతిమంగా న్యాయం, ధర్మం, నిజాయితీ గెలుస్తాయని కేటీఆర్ చెప్పారు. సీఎం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తమ నేతల మీద అక్రమ కేసు పెట్టి దృష్టి మళ్లించే రాజకీయాలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి పగలంతా కాంగ్రె్‌సలో ఉండి రాత్రయితే బీజేపీ పెద్దలతో కలిసిపోతున్నారని ఎద్దేవా చేశారు.
ఇదీ అసలు కేసు..
కేటీఆర్ తదితరులపై ఏసీబీ గత నెలలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో, ఆ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) నమోదు చేశారు. కేటీఆర్ తదితరులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం, విదేశీ మారకద్రవ్యం నిర్వహణ చట్టం (ఫెమా) కింద ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. హెచ్‌ఏండీఏ జనరల్ ఖాతా నుంచి విదేశీ కంపెనీ ఎఫ్‌ఈఓకు రెండు విడతలుగా రూ.45.71 కోట్ల మొత్తాన్ని విదే శీ కరెన్సీ (బ్రిటన్ పౌండ్ల) రూపంలో చెల్లించారు. విదేశీ కరెన్సీలో చెల్లింపులు చేయడం వల్ల ఆదాయపుపన్నుకు అదనంగా రూ.8.1 కోట్లు హెచ్‌ఏండీఎ చెల్లించాల్సి వచ్చింది. ఇతరత్రా వ్యయాలను కూడా పరిగణిస్తే.. మొత్తంగా, కేటీఆర్ తదితరులు తీసుకున్న నిర్ణయం వల్ల హెచ్‌ఎండీఏ నుంచి రూ.56 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని కేసు నమోదైంది.
ఈడీ ఆఫీసుకు బీఆర్‌ఎస్ శ్రేణులు
ఈడీ విచారణకు కేటీఆర్ హాజరైన నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఈడీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వారిలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, దాసోజు శ్రవణ్, క్రిశాంక్ తదితరులున్నారు. శ్రవణ్, క్రిశాంక్ మీడియాతో మాట్లాడున్న సమయంలో.. పోలీసులు క్రిశాంక్‌ను అరెస్టు చేసారు. బీఆర్‌ఎస్ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. సాయంత్రం నుంచిబీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొంత ఆందోళన కనిపించింది. కేటీఆర్‌ను అరెస్టు చేసే అవకాశముందనే పుకార్లు వ్యాపించడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌లో కనిపించారు. సాయంత్రం ఆరున్నర సమయంలో కేటీఆర్ బయటకు రావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈడీ కార్యాలయం గేటు లోపలికి మీడియాను కూడా అనుమతించకుండా పోలీసులు గేట్లు మూసివేశారు.