Khammam Crime: భార్యపై కత్తిపోటు
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:41 AM
కున్న భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య ఆరు నెలల గర్భిణి అని కూడా చూడకుండా కత్తితో దాడి చేసి హతమార్చబోయాడు.
6 నెలల గర్భవతిపై భర్త హత్యాయత్నం
అనుమానంతో గొడవలు. మద్యం మత్తులో కత్తితో దాడి
ఖమ్మం జిల్లాలో ఘటన
మధిర రూరల్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య ఆరు నెలల గర్భిణి అని కూడా చూడకుండా కత్తితో దాడి చేసి హతమార్చబోయాడు. అదృష్టవసాత్తు భర్త నుంచి తప్పించుకున్న ఆమె ప్రాణాలతో బయటపడగా.. ఆ భర్త పరారయ్యాడు. ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరు గ్రామంలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. విజయవాడలో లారీ డ్రైవర్‌గా పని చేసే మాటూరు గ్రామానికి చెందిన చిల్లా సూర్యనారాయణ.. ఏపీలోని మంగళగిరికి చెందిన సాయి నాగలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడు, నాలుగేళ్ల వయస్సు ఉన్న ఇద్దరు కుమారులు ఉండగా నాగలక్ష్మి ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. వీరి కాపురం కొంతకాలం సజావుగా సాగగా.. సూర్యనారాయణ తన భార్య నాగలక్ష్మిపై అనుమానం పెంచుకోవడంతో ఇరువురి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. సూర్యనారాయణ మద్యానికి బానిసై పనికి కూడా సరిగా వెళ్లడం లేదు.
ఈ క్రమంలో విధులు ముగించుకుని శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి తిరిగొచ్చిన సూర్యనారాయణ.. వచ్చేటప్పుడు ఓ కత్తిని తెచ్చుకున్నాడు. పిల్లలు ఇద్దరూ నిద్రలో ఉండగా భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా.. అర్ధరాత్రి 12 గంటల సమయంలో సూర్యనారాయణ తన భార్య నాగలక్ష్మి మెడపై కత్తితో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నాగలక్ష్మి ఇంటి నుంచి బయటికి పరుగు తీసింది. తీవ్ర రక్తస్రావంతో ఉన్న నాగలక్ష్మిని గమనించిన స్థానికులు ఆమెను అంబులెన్స్‌లో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నాగలక్ష్మి ప్రస్తుతం మధిరలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భార్యపై దాడి చేసిన అనంతరం సూర్యనారాయణ పరారయ్యాడు. నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మధిర రూరల్ పోలీసులు ఆదివారం మాటూరు గ్రామానికి వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. పరారీలో ఉన్న సూర్యనారాయణ కోసం గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News