Share News

Heart Attacks: ప్రాణాలు పోస్తూనే.. ఆగుతున్న ఊపిరి!

ABN , Publish Date - Aug 31 , 2025 | 04:46 AM

ప్రాణాలు పోసే వైద్యులు వారు.. రాత్రిపగలు తేడా లేకుండా.. నిద్రాహారాలనూ సరిగా పట్టించుకోకుండా.. రోగుల బాగోగులు చూసే ప్రాణదాతలు వారు.. కానీ అలా ప్రాణం పోస్తూనే ఊపిరి వదులుతున్నారు.

Heart Attacks: ప్రాణాలు పోస్తూనే.. ఆగుతున్న ఊపిరి!

విధుల్లో తీవ్ర ఒత్తిడితో కుప్పకూలిపోతున్న వైద్యులు

  • రాత్రీ, పగలూ తీరికలేని పనివేళలు

  • పూర్తిస్థాయిలో నిద్ర కూడా కరువే!

  • యువ వైద్యులకూ గుండెపోటు

  • కొన్నిరోజుల క్రితం భోజనం చేస్తూనే కన్నుమూసిన హైదరాబాద్‌ వైద్యుడు

  • తాజాగా చెన్నైలో రోగులను చూస్తూనే గుండెపోటుతో కార్డియాక్‌ సర్జన్‌ మృతి

  • వైద్యుల సగటు జీవితకాలం 59 ఏళ్లే

  • ప్రజల సగటు ఆయుర్దాయం 69 నుంచి 72 ఏళ్లు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ప్రాణాలు పోసే వైద్యులు వారు.. రాత్రిపగలు తేడా లేకుండా.. నిద్రాహారాలనూ సరిగా పట్టించుకోకుండా.. రోగుల బాగోగులు చూసే ప్రాణదాతలు వారు.. కానీ అలా ప్రాణం పోస్తూనే ఊపిరి వదులుతున్నారు. తీవ్ర ఒత్తిళ్ల మధ్య అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నారు. గుండెపోటు వంటివాటితో ప్రాణాలు వదులుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి చెందిన సీనియర్‌ వైద్యుడు.. డ్యూటీ చేసి వెళ్లాక ఇంట్లో భోజనం చేస్తూనే కుప్పకూలిపోయారు. అంతకు రెండుమూడు రోజుల ముందే ఆయన ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా అంతా సాధారణంగానే ఉన్నట్టు తేలింది. కానీ తీవ్ర ఒత్తిడితో గుండెపోటుతో కన్నుమూశారు. తాజాగా తమిళనాడులోని చెన్నైలో కార్డియాక్‌ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ గ్రాడ్లిన్‌ రాయ్‌.. ఆస్పత్రి వార్డులో రోగులను పరిశీలిస్తూనే గుండె పోటుతో ప్రాణాలు వదిలారు. మన దేశంలో ప్రజల సగటు ఆయుర్దాయం 69 ఏళ్ల నుంచి 72 ఏళ్లుకాగా.. వైద్యుల సగటు జీవితకాలం 59 ఏళ్లలోపేనని భారత వైద్య అసోసియేషన్‌ (ఐఎంఏ) అధ్యయనంలో వెల్లడికావడం ఆందోళనకరం.


తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవితం

వైద్యులు తీవ్ర ఒత్తిడితో నలిగిపోతున్నారు. ఉదయం 8 గంటలకు ఆస్పత్రికి వస్తే రాత్రి 10 గంటల వరకు సేవల్లోనే ఉంటున్నారు. ఉదయం, సాయంత్రం ఔట్‌ పేషెంట్లను చూడటం, వార్డుల్లో రోగులతో మాట్లాడటం, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడంతోనే గడిచిపోతుంది. ఏవైనా శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటే తెల్లవారుజాము నుంచే ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటికి వచ్చినా.. రోగుల పరిస్థితిపై నర్సులు, ఆస్పత్రి సిబ్బంది నుంచి వచ్చే ఫోన్లు మాట్లాడటం, తగిన సూచనలు చేయడం తప్పదు. ఇక ఏదైనా ఎమర్జెన్సీ కేసు వచ్చినా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి పరిస్థితితో తేడా వచ్చినా రాత్రిపగలు తేడా లేకుండా పరుగెత్తుకు రావాల్సిందే. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్నారు. సరైన సమయంలో నిద్రాహారాలు లేక నీరసించిపోతున్నారు. ఇక కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ఓపీ రోగుల సంఖ్య, ఆపరేషన్లు, ల్యాబ్‌ పరీక్షలపై వైద్యులకు టార్గెట్లు పెడుతుంటాయని.. పైగా ప్రతినెలా దీనిపై రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఇది వైద్యుల్లో ఆందోళనకు దారితీస్తోందని అంటున్నాయి. మరోవైపు సొంతంగా ఆస్పత్రులు ఉన్నవారి పరిస్థితీ ఇంతే. కేవలం రోగుల వ్యవహారాలే కాకుండా ఆస్పత్రుల నిర్వహణ పనులూ చూసుకోవాలి. దానికితోడు మంచి వైద్యులుగా గుర్తింపు పొందాలన్న ఉద్దేశంతోనూ ఒత్తిడికి లోనవుతున్నారు.


ప్రజల కంటే పదేళ్లు తక్కువ బతుకుతున్నాం..

ప్రజల సగటు జీవితకాలం 69-72 ఏళ్లు ఉంటే.. వైద్యులు సగటున 59ఏళ్లకే కన్నుమూస్తున్నారు. సాధారణ ప్రజల జీవితకాలంతో పోలిస్తే పదేళ్లు తక్కువ జీవిస్తున్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యయనం ప్రకారం.. చాలా మంది వైద్యులు 50-55 ఏళ్ల వయసులోనే చనిపోతున్నారు. అమెరికాలో వైద్యులు రోజుకు 8 గంటలే పనిచేస్తారు. యూకేలో వారమంతా కలిపి 36 పని గంటలే ఉంటాయి. కానీ మన వద్ద రాత్రి పగలు పరుగులు పెట్టాల్సిందే. రోగులు మాపై భరోసాతో, నమ్మకంతో వస్తారు. ఎవరినీ కాదనలేం. సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా భోజనం చేయలేని పరిస్థితి ఉంటుంది.

- డాక్టర్‌ రమేష్‌ గూడపాటి, సీనియర్‌ కార్డియాలజిస్టు, జాయింట్‌ ఎండీ, స్టార్‌ ఆస్పత్రి

ఒత్తిడి మధ్యే జీవితం గడుపుతున్నాం

వైద్య వృత్తి తీవ్ర ఒత్తిడితో కూడికుని ఉంటుంది. ఉదయం నుంచి అర్థరాత్రి దాకా తీరిక ఉండదు. ఇంటికి వచ్చినా రోగుల ఫాలో అప్‌ తప్పదు. ఎవరైన రోగి పరిస్థితి సీరియ్‌సగా ఉంటే ఆస్పత్రిలోనే ఉండాలి. చాలా మంది యువ వైద్యులు తమ ఆరో గ్యం గురించి పట్టించుకోకుండా వృత్తిపై ఎక్కువ ధ్యాస పెడుతున్నారు. మంచి పేరు తెచ్చుకోవాలనే తపనతో తెలియకుండానే ఒత్తిళ్లకు లోనవుతున్నారు. వారిలో కొందరు జన్యుపరమైన కారణాలతో ఒత్తిడి తట్టుకోలేక చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. ఆస్పత్రుల్లో కూడా ఒకరోజు వైద్యుల కోసమే కేటాయించి ఆరోగ్య పరీక్షలు చేయాల్సిన అవసరముంది.

- డాక్టర్‌ హయగ్రీవరావు, సీనియర్‌ కార్డియాలజిస్టు, కిమ్స్‌ ఆస్పత్రి

ఆరోగ్యంపై దృష్టిపెట్టాల్సి ఉంది

విదేశాల్లో అయితే వైద్యులు వారానికి ఐదు రోజులే పనిచేస్తారు. మిగతా రెండు రోజులు విశ్రాంతి, కుటుంబ సభ్యులతో గడపడంతో ఒత్తిడి తగ్గుతుంది. మన దగ్గర ఆరు రోజులు, అదీ ఎక్కువ పనిగంటలు విధులు తప్పవు. కొన్నిసార్లు ఆదివారం కూడా ఆస్పత్రికి రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చాలా మంది వైద్యులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి ఉంది.

- డాక్టర్‌ సుధీర్‌కోగంటి, సీనియర్‌ కార్డియాలజిస్టు, సిటిజన్‌ ఆస్పత్రి


ఇవి కూడా చదవండి:

కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్‌‌పై మాటల యుద్ధం..

15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కేటీఆర్ డిమాండ్

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 31 , 2025 | 04:46 AM