Charapalli Terminal: టెర్మినల్ అప్రోచ్ రోడ్డుపై కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య సంవాదం!
ABN , Publish Date - Jan 07 , 2025 | 03:47 AM
చర్లపల్లి టెర్మినల్‌కు అప్రోచ్ రోడ్డు నిర్మాణం కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య సంవాదానికి దారితీసింది. ఈ రోడ్డు నిర్మాణ బాధ్యత మీదంటే.. మీదే అన్నట్లుగా వాగ్వాదం సాగింది.

గ్రాంటు ఇవ్వండి: మంత్రి శ్రీధర్‌బాబు
మీదే బాధ్యత: కేంద్ర మంత్రి సోమన్న
రాష్ట్రం పనులు చేపట్టాలి: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): చర్లపల్లి టెర్మినల్‌కు అప్రోచ్ రోడ్డు నిర్మాణం కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య సంవాదానికి దారితీసింది. ఈ రోడ్డు నిర్మాణ బాధ్యత మీదంటే.. మీదే అన్నట్లుగా వాగ్వాదం సాగింది. రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్న, ఒకవైపు రాష్ట్రమంత్రి శ్రీధర్‌బాబుకు కేంద్ర వైఖరి స్పష్టం చేస్తూనే మరోవైపు రాష్ట్రం నుంచి కేంద్ర క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కిషన్‌రెడ్డి భుజాలపై భారం పెట్టారు. తొలుత శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, అప్రోచ్‌రోడ్డుకు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ రోడ్డు అభివృద్ధికి కేంద్రం నిధులివ్వాలని కోరారు. సమీకృత ఎయిర్‌పోర్టు తరహాలో టెర్మినల్ రూపొందించినందున అప్రోచ్‌రోడ్డు కూడా ఆ స్థాయిలో ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇందుకుగాను కేంద్రం కొంత గ్రాంటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై, కేంద్ర మంత్రి సోమన్న స్పందిస్తూ, టెర్మినల్ అప్రోచ్ రోడ్డు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పారు.
కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా చేశానని, ఆరుసార్లు మంత్రిగా ఉన్నానని, రాష్ట్ర ప్రభుత్వ పల్స్ ఏమిటో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కూడా విశ్వేశ్వరయ్య టెర్మినల్‌కు సంబంధించి ఇలాంటి పరిస్థితే ఏర్పడితే, తాను సీఎం సిద్దరామయ్యతో భేటీ అయి అప్రోచ్ రోడ్డుపై చర్చించానన్నారు. అప్రోచ్‌రోడ్డు నిర్మాణానికి ఆయన అంగీకరించారని చెప్పారు. ‘పనులు జరుగుతున్నయి.. మీరూ సీఎం రేవంత్‌తో సమావేశమై ఒప్పించండి’ అని మరో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సూచించారు. కిషన్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా రైల్వేశాఖ తదనుగుణంగా పనిచేస్తుందని ప్రకటించారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, సికింద్రాబాద్ స్టేషన్‌తో పాటు చర్లపల్లి టెర్మినల్ అప్రోచ్‌రోడ్డుకు, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. చర్లపల్లి టెర్మినల్‌కు అప్రోచ్‌రోడ్డు కీలకమని, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో పనులు చేయాలన్నారు.