Mallu Ravi: సీఎంపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు.. స్పందించిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ
ABN , Publish Date - Aug 06 , 2025 | 07:10 PM
సీఎం రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి విమర్శించడంపై ఉన్న కారణం ఏంటో తెలుసుంటామని మల్లు రవి తెలిపారు. రేపు రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి వివరాలు తీసుకుంటామని చెప్పారు.
ఢిల్లీ: సీఎం రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే.. తాజాగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి స్పందించారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) విమర్శించడంపై ఉన్న కారణం ఏంటో తెలుసుంటామని మల్లు రవి తెలిపారు. రేపు రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి వివరాలు తీసుకుంటామని చెప్పారు. రాజగోపాల్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం ఉటుందని స్పష్టం చేశారు. అన్ని విషయాలపై రాజగోపాల్ రెడ్డి నుంచి త్వరలోనే వివరణ తీసుకుంటామని పేర్కొన్నారు. రెండు రోజులగా బీసీ ధర్నా ఏర్పాట్లలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలను ఎవరు పట్టించుకోకపోయినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని మల్లు రవి తేల్చి చెప్పారు.
మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్‌లోకి వచ్చా అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీలో జూనియర్లకు మంత్రిపదవి ఇచ్చి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని తెలిపారు. ఇకపై తాను ఎంత దూరమైనా వెళ్తానని తేల్చి చెప్పారు. మనసు చంపుకుని బతకడం తన వల్ల కాదన్నారు. ప్రజల కోసం మరోసారి పదవీ త్యాగానికైనా రెడీ అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.