Govt Schools: సర్కారీ పాఠశాలల్లో తగ్గిన ప్రవేశాలు
ABN , Publish Date - Jan 31 , 2025 | 03:36 AM
ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాలు, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా వేల కోట్లు వెచ్చిస్తున్నా.. విద్యలో నాణ్యత మాత్రం పెరగడం లేదు. రెండేళ్లతో పోలిస్తే ఈ సారి విద్యార్థుల సంఖ్య 12శాతం వరకు తగ్గింది. ఇప్పటికీ వేలాది మంది చిన్నారులు బడికి దూరంగా ఉన్నారు.

విద్యార్థుల సంఖ్యలో 12శాతం తగ్గుదల
8వ తరగతి విద్యార్థుల్లో సగం మందికి తీసివేతలు రావు
కొందరు 2వ తరగతి పుస్తకాలు చదవలేని వైనం
డిజిటల్ అక్షరాస్యతలో మాత్రం రాష్ట్రం ముందంజ
ప్రథమ్ ఫౌండేషన్ వార్షిక విద్యా నివేదిక-24 వెల్లడి
హైదరాబాద్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాలు, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా వేల కోట్లు వెచ్చిస్తున్నా.. విద్యలో నాణ్యత మాత్రం పెరగడం లేదు. రెండేళ్లతో పోలిస్తే ఈ సారి విద్యార్థుల సంఖ్య 12శాతం వరకు తగ్గింది. ఇప్పటికీ వేలాది మంది చిన్నారులు బడికి దూరంగా ఉన్నారు. ప్రథమ్ ఫౌండేషన్ వార్షిక విద్యా నివేదిక (అసర్)-2024లో ఈ మేరకు వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విద్యా పరిస్థితులపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. తెలంగాణలో ఈ సంస్థ అధ్యయనంలో తేలిన వివరాలిలా ఉన్నాయి. బడుల కు వెళ్లే వయస్సు రాష్ట్రంలో మూడేళ్లకే ప్రారంభమవుతుండగా.. ప్రైవేట్‌తో పోలిస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ఎక్కువ మంది పలక, బలపం పడుతున్నారు. 2022తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తఅడ్మిషన్లతోపాటు విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. 2022లో 1-5వ తరగతి వరకు చదువుతున్న మొత్తం విద్యార్థు(బాలురు)ల్లో 63.8శాతం సర్కారు బడుల్లో ఉండగా.. ఈ ఏడాది అది 53శాతానికి తగ్గింది. బాలికల సంఖ్య 70నుంచి 60 శాతానికి క్షీణించింది.
అలాగే 6-8 తరగతుల్లో బాలుర ప్రవేశా లు 75.8 నుంచి 63.6శాతానికి.. బాలికల ప్రవేశాలు 76.6 నుంచి 68శాతానికి తగ్గాయి. రాష్ట్రంలో 6-14 ఏళ్ల మధ్య చిన్నారుల్లో 60శాతం మంది ప్రభుత్వ బడుల్లో చదవుతుండగా.. 39.2 శాతం ప్రైవేటు బడులకు వెళ్తున్నారు. 0.5 శాతం విద్యార్థులు బడులకు దూరంగా ఉంటున్నారు. ఉన్నత పాఠశాల విద్యకు సంబంధించి 67.9 శాతం మంది ప్రభుత్వ బడులకు వెళ్తుండగా.. 28.9 శాతం ప్రైవేటుకు వెళ్తున్నారు. 2.5 శాతం బడులకు దూరంగా ఉంటున్నారు. గతంతో పోలిస్తే విద్యా సామర్థ్యాలు పెద్దగా మెరుగుపడలేదు. 8వ తరగతి విద్యార్థుల్లో 56.4శాతం మంది కనీసం 2వ తరగతి పుస్తకాలు చదవలేకపోతున్నారు. 22.7 శాతం మంది ఒకటో తరగతి పుస్తకాలు చదవడంలో విఫలమవుతున్నారు. 19.6శాతం మంది వంద వరకు అంకెలు కూడా చదవలేని స్థితిలో ఉన్నారు. 38శాతం మందికి తీసివేతలు, భాగాహారాలు చేసే సామర్థ్యం లేదు.
పాఠ్య పుస్తకాల చదువుల్లో విద్యార్థులు వెనుకంజలో ఉన్నా.. డిజిటల్ అక్షరాస్యతలో మాత్రం మెరుగ్గా ఉన్నారు. 14-16 ఏళ్ల విద్యార్థుల్లో గూగుల్ శోధనలో 85శాతం మంది, యూట్యూబ్ వీడియోల శోధనలో 98శాతం మంది అత్యంత క్రియాశీలకంగా ఉన్నారు. 15.8శాతం ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. 31.1శాతం బడుల్లో ఉన్నా వినియోగంలో లేవు. 53.2 శాతం పాఠశాలల్లోనే మరుగుదొడ్లు ఉన్నాయి. 13.9శాతం బడుల్లో గ్రంథాలయాలు లేవు. 29.3శాతం బడుల్లో ఉన్నా వినియోగించడం లేదు. 91.1శాతం పాఠశాలల్లో కంప్యూటర్లు లేవు. రాష్ట్రంలోని 83.7శాతం బడులకు మైదానాలు ఉన్నాయి.
ఇదీ చదవండి:
నాలుగో టీ20.. టీమిండియాకు సూపర్ న్యూస్.. మహాబలుడు వచ్చేస్తున్నాడు
కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..
ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి