Revenue Growth: రాబడుల పెంపునకు కమిటీలు వేయండి
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:10 AM
రాష్ట్ర ఆదాయార్జన శాఖల్లో రాబడులు పెరిగేందుకు అధికారులతో కమిటీలు వేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారులను ఆదేశించారు.
రాబడి మార్గాలపై కర్ణాటక, తమిళనాడులో అధ్యయనం చేయాలి
అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
ప్రాజెక్టుల్లో ఇసుక ఆదాయానికి మార్గం : ఉత్తమ్
హైదరాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆదాయార్జన శాఖల్లో రాబడులు పెరిగేందుకు అధికారులతో కమిటీలు వేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారులను ఆదేశించారు. వనరుల సమీకరణ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం సోమవారం భట్టి అధ్యక్షతన సచివాలయంలో జరిగింది. సమావేశంలో కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖ రాబడిలో 4.7శాతం, గనుల శాఖలో 18.6శాతం రాబడి వృద్ధి కనిపిస్తోందన్నారు. ఇతర రాబడుల శాఖల్లో కాస్త మందగమనం ఉంటోందని, ఇందుకు కారణాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. రాబడుల శాఖల్లో ఆదాయ పెరుగుదలకు అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని, ఈ కమిటీలు కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో రాబడి మార్గాలపై అధ్యయనం చేయాలన్నారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ భారీ నీటి పారుదల ప్రాజెక్టుల్లో పూడికతీత పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, ఇసుక మేట వేస్తుందని తెలిపారు. ఈ ఇసుక ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందన్నారు. మొదట ఒక ప్రాజెక్టులో పూడికతీతను వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక తవ్వకం పనులను పూర్తిగా గిరిజన ఏజెన్సీలకు ఇవ్వాలన్నారు. గిరిజనులకు యంత్ర సామగ్రి అందుబాటులో ఉండదని, ఈ దృష్ట్యా ఐటీడీఏల్లోని ఇంజనీరింగ్ విభాగం యంత్ర సామగ్రిని సమకూర్చాలని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపల ఉన్న కాలుష్య కారక పరిశ్రమల తరలింపునకు మూడు వారాల్లో విధివిధానాలను రూపొందించాలని మంత్రులు సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా పాల్గొన్నారు.
ఆ శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర ఆదాయార్జన శాఖలైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖల్లోని ఉద్యోగులు, అధికారుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయార్జన శాఖల్లో బదిలీలకు గతంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని ఉన్నతాధికారులకు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వాస్తవాలు చెబితే.. తప్పు పట్టిన బీఆర్ఎస్
ఆలయాల అభివృద్ధిపై సమీక్ష.. సీఎం కీలక ఆదేశాలు
For More TG News And Telugu News