Hyderabad: మార్వాడీల నోట్లు కావాలా.. ప్రజల ఓట్లు కావాలా..
ABN , Publish Date - Aug 19 , 2025 | 08:42 AM
మార్వాడీ కమ్యూనిటీ ప్రతినిధులు తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని కించపరిచేలా మాట్లాడటం తగదని ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. వాళ్ల పెద్ద పెట్టుబడుల ధాటికి తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా చిరు వ్యాపారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
- స్థానికుల వ్యాపారాల రక్షణకు చట్టం తేవాలి
- తెలంగాణేతరులు ఇక్కడ భూమి కొనడానికి వీల్లేదు
- ‘మార్వాడీ సమస్య - పరిష్కారాలు’ సదస్సులో వక్తల డిమాండ్
- గుజరాత్, రాజస్థాన్ వ్యాపారుల దుకాణాల్లో కొనుగోళ్లు చేయవద్దని తీర్మానం
హైదరాబాద్ సిటీ: మార్వాడీ కమ్యూనిటీ ప్రతినిధులు తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని కించపరిచేలా మాట్లాడటం తగదని ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్(Professor Haragopal) పేర్కొన్నారు. వాళ్ల పెద్ద పెట్టుబడుల ధాటికి తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా చిరు వ్యాపారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ‘మా వ్యాపారాలు మాకే’ అన్న నినాదం రాలేదని, ఆలస్యంగానైనా దీని మీద చర్చ మొదలవడం అవసరమని చెప్పారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘మార్వాడీ సమస్య - పరిష్కారాలు’ అంశంపై జరిగిన సదస్సులో హరగోపాల్ మాట్లాడారు.
తెలంగాణలోని స్థానిక చిరు వ్యాపారులు, చేతివృత్తుల వారికి భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మార్వాడీలు తెలంగాణ పల్లెల్లోకి చొరబడి తమ ఉపాధిని ధ్వంసం చేస్తున్నారని ఆర్యవైశ్య, విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘాల ప్రతినిధులు సదస్సులో ఆందోళన వ్యక్తం చేశారు. మార్వాడీల నోట్లు కావాలా? తెలంగాణ ప్రజల ఓట్లు కావాలా? రాజకీయ నాయకులు తేల్చుకోవాలని డిమాండ్ చేశారు.
మార్వాడీల వల్ల తెలంగాణ జీడీపీ పెరిగిందని బండి సంజయ్(Bandi Sanjay) అంటున్నారని, జీఎస్టీ ఎగవేసే వాళ్లతో జీడీపీ ఎలా పెరిగిందో చెప్పాలని ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధి సముద్రాల శ్రీకాంత్ ప్రశ్నించారు. తెలంగాణ పండగల స్ఫూర్తిని మార్వాడీలు దెబ్బతీస్తున్నారని ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ మండిపడ్డారు. ఆహార ఉత్పత్తులు, సరుకుల కల్తీ దందాలో 97 శాతం మార్వాడీలే ఉన్నారని ఆరోపించారు. ఆభరణాల తయారీలో మార్వాడీలు మోసపూరితంగా వ్యవహరిస్తారని తెలంగాణ విశ్వకర్మ ప్రతినిధి పరిపూర్ణాచారి ఆరోపించారు. ఐదు లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో తెలంగాణేతర వ్యక్తుల వ్యాపారాలను అనుమతించకుండా ప్రభుత్వం నిబంధనలు తీసుకురావాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి డిమాండ్ చేశారు.

మార్వాడీలు ఇచ్చే చందాల కోసమే రాజకీయ పార్టీల నేతలు వాళ్ల దారుణాలపై పల్లెత్తు మాట అనడం లేదని ప్రముఖ కవి నందిని సిధారెడ్డి విమర్శించారు. కాగా, తెలంగాణలో స్థానికుల వ్యాపారాల రక్షణ కోసం, తెలంగాణేతరులు ఇక్కడ భూములు కొనకుండా ప్రభుత్వం చట్టాలు తేవాలని సదస్సులో తీర్మానించారు. రాష్ట్రంలో నెలకొల్పే ప్రతి సంస్థలో స్థానికులకే 80శాతం ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధన తీసుకురావాలని డిమాండ్ చేశారు. గుజరాత్, రాజస్థాన్ వ్యాపారుల వద్ద కొనుగోళ్లు చేయవద్దని పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకుల మృతి
Read Latest Telangana News and National News