Lose Lives to Electric Shock: విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకుల మృతి
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:23 AM
మొక్కజొన్న పంటకు రక్షణగా విద్యుత్తు తీగ ఏర్పాటు చేస్తుండగా.. పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆ తీగ తగలడంతో విద్యుదాఘాతంతో తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతిచెందారు. ..
చిన్నకోడూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న పంటకు రక్షణగా విద్యుత్తు తీగ ఏర్పాటు చేస్తుండగా.. పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆ తీగ తగలడంతో విద్యుదాఘాతంతో తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతిచెందారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ శివారులో సోమవారం ఈ ఘటన జరిగింది. చంద్లాపూర్‌కు చెందిన మూర్తి గజేందర్ రెడ్డి (52) రైతు. అతడికి భార్య పద్మ, కుమారుడు రాజిరెడ్డి (25) కూతురు సంతోషి ఉన్నారు. రాజిరెడ్డి సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి శివారులోని ఓ కంపెనీలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. గజేందర్‌రెడ్డి అతడి కుమారుడు రాజిరెడ్డి సోమవారం గంగాపూర్ శివారులోని చేను వద్దకు వెళ్లారు. అక్కడ మొక్కజొన్న పంటకు అడవి పందుల నుంచి రక్షణ కోసం వైర్‌ను ఏర్పాటు చేసే పనిలో మునిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆ తీగ పక్కనే ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి షాక్ కొట్టడంతో గజేందర్, రాజిరెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. ఈనెల 14న సంతోషి వివాహం జరిగింది. పెళ్లి జరిగిన ఇంట్లో ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకోవడంతో బంధువులు దిగ్ర్భాంతికి గురయ్యారు.