Share News

Dasarathi Sahitya Puraskaram: ట్యాంక్‌బండ్‌పై దాశరథి విగ్రహం

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:13 AM

నిజాం నిరంకుశత్వాన్ని ధిక్కరించిన యోధుడిగా, తెలుగు సాహిత్యంలో కలకాలం ..

Dasarathi Sahitya Puraskaram: ట్యాంక్‌బండ్‌పై దాశరథి విగ్రహం
Dasarathi Sahitya Puraskaram

  • ఏర్పాటు కోసం కసరత్తు ప్రారంభం

  • మహాకవి పేరు శాశ్వతంగా నిలిచేలా మరిన్ని కార్యక్రమాలు

  • అన్ని పంచాయతీల్లో దాశరథి సాహిత్యం

  • సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి వెల్లడి

  • రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దాశరథి శత జయంతి ఉత్సవాలు

  • అన్నవరం దేవేందర్‌కు పురస్కారం ప్రదానం

హైదరాబాద్‌ సిటీ, జూలై 22(ఆంధ్రజ్యోతి): నిజాం నిరంకుశత్వాన్ని ధిక్కరించిన యోధుడిగా, తెలుగు సాహిత్యంలో కలకాలం నిలిచే సాహిత్యాన్ని సృజించిన మహా కవిగా జననీరాజనాలు అందుకున్న దాశరథి కృష్ణమాచార్య విగ్రహాన్ని ట్యాంక్‌ బండ్‌పై నెలకొల్పనున్నట్లు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. నాలుగేళ్ల క్రితం అప్పటి సీఎం కేసీఆర్‌ ఓ సభలో ఇదే హామీ ఇచ్చారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ట్యాంక్‌ బండ్‌ మీద లేదా నగరంలోని ఏదైనా ప్రధాన కూడలిలో దాశరథి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కుమార్తె ఇందిర ‘ఆంధ్రజ్యోతి’ ద్వారా పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై దాశరథి విగ్రహం ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ కూడా ప్రారంభించామని మంత్రి వెల్లడించడంతో సభలో హర్షాతిరేకాలు మిన్నంటాయి. విగ్రహ ఏర్పాటు కార్యాచరణలో భాగంగా హెచ్‌ఎండీఏకు లేఖ కూడా రాసినట్లు జూపల్లి వెల్లడించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్ర భారతిలో దాశరథి శత జయంతి ఉత్సవ సభ జరిగింది. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి, పొన్నం పాల్గొని తొలుత దాశరథి చిత్రపటానికి పుష్పాలతో నివాళులర్పించారు. అనంతరం ప్రముఖ కవి అన్నవరం దేవేందర్‌కు దాశరథి సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆయనకు శాలువా, జ్ఞాపికతో సన్మానించి, రూ.1,0116 నగదును అందజేశారు. అనంతరం జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణలోని పన్నెండు వేల పైచిలుకు గ్రామ పంచాయతీల్లో దాశరథి సాహిత్యాన్ని అందుబాటులో ఉంచుతామని చెప్పారు.


దాశరథి పేరు శాశ్వతంగా నిలిచేలా ఇంకా పలు కార్యక్రమాలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఈ విషయంలో మేధావులు, కవులు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేగా ఏడాదికి తనకు వచ్చే రూ.5 కోట్ల నిధుల్లో రూ.2 కోట్లను గ్రంథాలయాలు, క్రీడాభివృద్ధికి ఖర్చు పెడుతున్నట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు. పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ... పార్లమెంట్‌ వేదికగా తెలంగాణ సాధన కోసం పోరాడుతున్న రోజుల్లో దాశరథి కవిత్వం తనకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. అవార్డు గ్రహీత అన్నవరం దేవేందర్‌ సాహిత్య కృషిని పొన్నం ప్రశంసించారు. కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, దాశరథి అవార్డు ఎంపిక కమిటీ సభ్యులు కవి యాకూబ్‌, ప్రజాకవి జయరాజ్‌, లోక కవి అందెశ్రీ, దాశరథి కుమార్తె ఇందిర, కుమారుడు లక్ష్మణ్‌, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి తదితరులు పాల్గొన్నారు. అవార్డు గ్రహీత అన్నవరం దేవేందర్‌ మాట్లాడుతూ దాశరథి పురస్కారం అందుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. ఈ అవార్డు.. కవిగా తన బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన దాశరథి సాహిత్య పరిమళాలు వ్యాస సంకలనాన్ని, అలాగే బుధవారం నుంచి 29వ తేదీ వరకు ప్రభుత్వం నిర్వహిస్తున్న దాశరథి సాహిత్య సప్తాహం ఆహ్వాన పత్రికను వక్తలు ఆవిష్కరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 05:13 AM