Damodara: ‘మహబూబ్‌నగర్’లో సూపర్ స్పెషాలిటీ సేవలు
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:26 AM
మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిని కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

త్వరలో ఎంఆర్‌ఐ స్కానింగ్ ఏర్పాటు: మంత్రి దామోదర
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిని కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. త్వరలోనే కార్డియాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. రూ.10 కోట్లతో ఎంఆర్‌ఐ స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసి, ఉగాది నుంచి సేవలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆస్పత్రుల పనితీరు, వైద్య ఆరోగ్య సేవలపై శుక్రవారం ఇక్కడి కోఠిలోని తెలంగాణ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో వైద్యం కోసం రోగులు హైదరాబాద్‌కు రావాల్సి వస్తుందని సమీక్షలో జిల్లా ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు. మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో కార్డియాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ వీలైనంత తొందరగా సూపర్ స్పెషాలిటీ సేవల విభాగాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.