CPI: ప్రశ్నార్థకంగా ఓటు హక్కు
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:00 AM
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రశ్నార్థకంగా మారిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులందరికి ఓటు హక్కు కల్పించడంలో భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థగా పని చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగ సంస్థగా పని చేయని ఈసీ
ఉప రాష్ట్రపతిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి గెలిస్తే రాజకీయాలపై సానుకూల ప్రభావం
లౌకిక పార్టీలన్నీ ఆయనకే మద్దతివ్వాలి
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు ప్రారంభం
హైదరాబాద్, గాజులరామారం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రశ్నార్థకంగా మారిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులందరికి ఓటు హక్కు కల్పించడంలో భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థగా పని చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలంటే కేంద్రంలో బీజేపీని, ప్రధాని మోదీని అధికారం నుంచి దించివేయాల్సిందేనన్నారు. ఇందుకోసం లౌకిక, ప్రజాతంత్ర పార్టీలన్నీ ఒకే వేదిక మీదకు వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా గాజుల రామారం (కామ్రేడ్ పొట్లూరి నాగేశ్వరరావునగర్)లోని మహారాజా గార్డెన్స్‌లో సీపీఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. . మూడు రోజుల పాటు జరిగే మహాసభల్లో తొలి రోజు సభలో రాజా మాట్లాడుతూ.. దేశం ప్రస్తుతం సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగంపై దాడి పెరిగిందని ఆరోపించారు. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో తమకు నచ్చని ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించే కార్యక్రమం చేపడుతున్నారని మండిపడ్డారు. అర్హులందరికి ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల సంఘానికి రాజ్యాంగపరమైన అధికారాలున్నా.. ప్రస్తుతం రాజ్యాంగబద్ధ సంస్థగా అది పనిచేయడం లేదన్నారు. ఇండియా కూటమిలో పరస్పర సహకారం, సర్దుబాటు అవసరమన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు దేశ చరిత్రలో ఎంతో కీలకమని, ఈ ఎన్నిక రాజకీయ యుద్ధం అని ఆయన చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి సీపీఐ మద్దతు ప్రకటించిందన్నారు. లౌకిక పార్టీలన్నీ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని, ఆయన గెలిస్తే దేశ భవిష్యత్తు రాజకీయాలపై సానుకూల ప్రభావం చూపుతుందన్నారు.
ఇది గడ్డుకాలం: రామకృష్ణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో సీపీఐ తెలంగాణకు మద్దతివ్వడం ద్వారా లబ్ధి పొందుతామనుకున్నా ఆశించిన ఫలితాలు రాలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. తెలంగాణకు మద్దతివ్వడం వల్ల ఏపీలోనూ పార్టీకి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని.. ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రజల మద్దతు లభిస్తోందన్నారు. వామపక్షాలకు ఇది గడ్డు కాలమన్నారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. 140 కోట్ల మంది ప్రజలను అవమానించే రీతిలో బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మతోన్మాద బీజేపీని అడ్డుకునే శక్తి వామపక్ష పార్టీలకే ఉందని, ఇందుకు అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకంకావాలని సీపీఐ సీనియర్ నాయకుడు కందిమళ్ల ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్
హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి
Read latest Telangana News And Telugu News