Bank Fraud: 6 బ్యాంకు ఖాతాల్లో 2 నెలల్లో రూ.155.90 కోట్ల లావాదేవీలు
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:02 AM
సైబర్ నేరగాళ్లకు ఇతరుల బ్యాంకు ఖాతాలను అందిస్తూ.. రూ.కోట్లలో అక్రమ లావాదేవీలు చేస్తున్న..
611 మంది బాధితుల ఖాతాలు ఖాళీ
సైబర్ నేరగాళ్లకు కేటుగాడి ద్వారా ఖాతాలు
నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్న ఎస్‌సీబీ
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్లకు ఇతరుల బ్యాంకు ఖాతాలను అందిస్తూ.. రూ.కోట్లలో అక్రమ లావాదేవీలు చేస్తున్న కేటుగాడు వడ్డేవల్లి లలిత్ శరణ్ కుమార్‌ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్‌బీ) అధికారులు నేపాల్ సరిహద్దుల్లో అరెస్టు చేశారు. విజయవాడ వాసి శరణ్ కుమార్ దుబాయ్ కేంద్రంగా సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను సమకూరుస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైందని సీఎ్‌సబీ డైరక్టర్ షికా గోయల్ ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది శరణ్ కుమార్ హైదరాబాద్ షంషీర్‌గంజ్‌లోని ఎస్‌బీఐ బ్యాంకులో కరెంట్ ఖాతాలు నిర్వహిస్తున్న ఆరుగురు వ్యక్తులను సంప్రదించి.. సైబర్ నేరగాళ్లకు సహకరించడానికి ఒప్పించాడని, గతేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో 6 ఖాతాల్లో రూ.155.90కోట్ల మేర లావాదేవీలు జరిగాయని ఆమె వివరించారు. సైబర్ నేరాల్లో బాధితులైన 611 మంది ఖాతాల నుంచి కొల్లగొట్టిన డబ్బును శరణ్ కుమార్ మళ్లించి, ఆ తర్వాత సైబర్ కేటుగాళ్లకు పంపాడని చెప్పారు. అప్పట్లో ఈ కేసుకు సంబంధించి ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్‌తో పాటు ఆరుగురిని అరెస్టు చేసినట్లు గుర్తుచేశారు. నాటి నుంచి దుబాయ్‌కి పరారైన శ్రవణ్‌పై లుకౌట్ నోటీసు జారీ చేశామని షికా గోయల్ తెలిపారు. దుబాయ్ నుంచి నేపాల్ మీదుగా దేశం లోకి రావడానికి ప్రయత్నిస్తున్న శరణ్‌ను సునాలీ చెక్‌పోస్టు వద్ద అరెస్టు చేశామని చెప్పారు. త్వరలో కోర్టు అనుమతితో శరణ్‌ను విచారిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News