Suravaram Sudhakar Reddy: సురవరం ఇక లేరు
ABN , Publish Date - Aug 23 , 2025 | 05:04 AM
రాజకీయాల్లో అజాతశత్రువు... తాడిత, పీడితవర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన తెలంగాణ మట్టి బిడ్డ... భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మాజీ ప్రధాన కార్యదర్శి.. సురవరం సుధాకర్ రెడ్డి (84) ఇక లేరు.
సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి కన్నుమూత
అనారోగ్యంతో హైదరాబాద్‌లో తుదిశ్వాస
ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం
మగ్దూంభవన్‌కు సుధాకర్ రెడ్డి భౌతికకాయం
వైద్య పరిశోధనల కోసం గాంధీ ఆస్పత్రికి ఆయన
పార్థివ దేహం.. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి నేత్రదానం
ఏఐఎ్‌సఎఫ్ సభ్యుడి నుంచి సీపీఐ జాతీయ ప్రధాన
కార్యదర్శి దాకాఎదిగిన కమ్యూనిస్ట్ దిగ్గజం
హైదరాబాద్ సిటీ, హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో అజాతశత్రువు... తాడిత, పీడితవర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన తెలంగాణ మట్టి బిడ్డ... భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మాజీ ప్రధాన కార్యదర్శి.. సురవరం సుధాకర్ రెడ్డి (84) ఇక లేరు. కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 10.20 గంటల సమయంలో సుధాకర్ రెడ్డి తుదిశ్వాస విడిచినట్లు సీపీఐ అధికారికంగా ప్రకటించింది. కొన్నాళ్లుగా ఆయన ప్రాణవాయువును అందించే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌ను వినియోగిస్తున్నారు. సురవరం సుధాకర్ రెడ్డికి భార్య విజయలక్ష్మి, కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు. అమెరికాలో ఉన్న పెద్ద కుమారుడు నిఖిల్ ఆదివారం ఉదయానికి భారత్ చేరుకుంటారని సమాచారం. అప్పటివరకు సుధాకర్‌రెడ్డి భౌతికకాయాన్ని గచ్చిబౌలి కేర్ మార్చురీలో ఉంచుతామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం హిమాయత్‌నగర్‌లోని మగ్దూం భవన్‌లో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ భౌతికకాయాన్ని ఉంచనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గాంధీ వైద్యకళాశాలకు సుధాకర్‌రెడ్డి భౌతికకాయాన్ని అప్పగిస్తామని నారాయణ వెల్లడించారు. కాగా.. సురవరం నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి ఇచ్చారు.
చిన్నప్పటి నుంచే..
తెలంగాణ వైతాళికుడు, గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడు సురవరం ప్రతాపరెడ్డి తమ్ముడు వెంకటరామిరెడ్డి కుమారుడు సుధాకర్‌రెడ్డి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942, మార్చి 25న జన్మించారు. ఉన్నత, కళాశాల విద్య కర్నూలులో పూర్తిచేసి... హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం(ఎల్‌ఎల్‌బీ) చదివారు. ఒకవైపు పెదనాన్న సాంస్కృతిక ఉద్యమ ఆదర్శాలను, మరోవైపు తండ్రి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న సుధాకర్‌రెడ్డి... చిన్నవయసులోనే సమస్యలపై పోరుబాట పట్టారు. కర్నూలులో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సమయంలో బ్లాక్‌బోర్డు, చాక్‌పీస్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంపై నిరసన చేపట్టారు. అది ఉద్యమంగా రూపుదిద్దుకొని నగరంలోని మిగతా విద్యాలయాలకు వ్యాపించింది. విద్యార్థి దశలోనే సమస్యలపై శంఖారావం పూరించిన సురవరం... తర్వాత ఏఐఎ్‌సఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా, తర్వాత జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం విజయవాడ విశాలాంధ్ర పత్రికలో చేరారు. అందులో విలేకరిగా పనిచేస్తున్న సమయంలో.. పార్టీ ఆదేశానుసారం హైదరాబాద్‌లో విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు 1965లో ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీలో చేరారు. ఆ మరుసటి ఏడాది ఏఐఎ్‌సఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
18 ఏళ్లకే ఓటు హక్కు కావాలని...
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రెండు దశాబ్దాల పాటు 21 ఏళ్లు నిండిన వారికే ఓటు హక్కు ఉండేది. మరో యువజన నేత కేరళకు చెందిన చంద్రప్పన్‌తో కలసి సురవరం... 18ఏళ్లకే ఓటు హక్కు కల్పించాలని పెద్ద ఉద్యమాన్ని లేవదీశారు. వారి పోరాట ఫలితంగానే ఓటు హక్కు వయసు 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతారు. రాజకీయ, సామాజిక, చారిత్రక విషయాలను విశ్లేషణాత్మకంగా వివరిస్తూ ఉపన్యసించడం ఆయన ప్రత్యేకత. ఆ వాగ్ధాటితో ఎంతోమందిని ప్రభావితం చేశారు. యువజన ఉద్యమంలో ఉన్న సమయంలోనే ప్రత్యేక శిక్షణ తరగతులకు రష్యా వెళ్లిన సమయంలో.. తమ పార్టీకి చెందిన విజయలక్ష్మితో పరిచయం ఏర్పడింది. అలా కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థలలో పనిచేస్తున్న ఇరువురు 1974 ఫిబ్రవరి 19న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. సుధాకర్‌రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలోనే.. తన ఇద్దరు కుమారులకూ సాదాసీదాగా ఒకే రోజు, ఒకే పెళ్లి పందిరిలో ఒకే ముహూర్తానికి వివాహాలు జరిపించారు.
అంచెలంచెలుగా..
సీపీఐలో క్రియాశీల కార్యకర్తగా చేరిన సురవరం సుధాకర్‌రెడ్డి.. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1971లో జాతీయ సమితి సభ్యునిగా పనిచేశారు. మూడేళ్లపాటు ఢిల్లీలో ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి ఇక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1985, 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. తొలిసారి 1998 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అదే ఏడాది సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆతర్వాత 2004లో ఎంపీగా ఎన్నికయ్యాక.. కార్మికశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేయటంతోపాటు అనేక పార్లమెంటరీ కమిటీలకు ఛైర్మన్‌గా పనిచేశారు. 2012 మార్చి 31న జరిగిన 21వ పార్టీ కాంగ్రె్‌సలో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2012 నుంచి 2019 వరకు ఆ పదవిలో మూడు పర్యాయాలు సేవలందించారు. చండ్ర రాజేశ్వరరావు తర్వాత సీపీఐ పగ్గాలు చేపట్టిన తెలుగు నేత సురవరం సుధాకర్‌రెడ్డి కావడం విశేషం.
ఎంపీగా..
సురవరం సుధాకర్ రెడ్డి 1998లో.. 12వ లోక్‌సభకు నల్లగొండ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీగా.. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య శాశ్వత పరిష్కారానికి విశేషంగా కృషి చేశారు. జిల్లాలో సాగునీటి పథకాల పూర్తికి, కేంద్రం నుంచి అవసరమైన అనుమతి సాధించేందుకు కృషి చేశారు. జిల్లాలో కరువు, సాగునీటి ఎద్దడిపై ఆయన పోరాటం చేశారు. ఒకప్పుడు విశాలాంధ్ర ఉద్యమానికి ఊనికగా నిలిచిన భారత కమ్యూనిస్టు పార్టీ.. మలిదశ తెలంగాణ పోరాటంలో తన పంథా మార్చుకోడానికి ప్రధాన కారణం సురవరం సుధాకర్‌రెడ్డి వ్యూహాత్మక నిర్ణయమని ఆ పార్టీ నేతలు చెబుతారు.
చక్రాల కుర్చీలో..
వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నా, అనారోగ్యంతో ఉన్నా... సుధాకర్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలకు హాజరుకాకుండా ఎప్పుడూ ఉండలేదు. ప్రతి కార్యక్రమంలో, పోరాటంలో చురుగ్గా పాల్గొనేవారు. చివరిసారిగా గత ఏడాది డిసెంబరు నెలలో నల్లగొండలో జరిగిన సీపీఐ బహిరంగసభకు హాజరయ్యారు. జిల్లాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకునే సందర్భం కాబట్టే, అనారోగ్యంతో ఉన్నా ఆ సభకు వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా.. తెలంగాణ నాలుగో రాష్ట్ర మహాసభ దిగ్విజయమైందన్న సంతోషంతో పార్టీ నేతలు, సభ్యులంతా సభాస్థలి నుంచి ఇంటికి తిరుగు ముఖం పట్టిన సమయంలో సురవరం మరణవార్త విని విషాదంలో మునిగిపోయారు. తామంతా అభిమానించే నేత ఇక లేరని కన్నీటి పర్యంతరమయ్యారు. నారాయణ, కూనంనేని ఆస్పత్రికి చేరుకుని ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
గొప్ప నేతను కోల్పోయాం
దేశ రాజకీయాల్లో సురవరం ముద్ర: సీఎం రేవంత్
సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకుడిని కోల్పోయామన్నారు. సురవరం నల్లగొండ నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగారని.. వామపక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ మట్టి బిడ్డ సురవరం పీడిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవిత కాలం పనిచేశారని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సురవరంతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సురవరం మృతి పట్ల మంత్రులు, వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. దేశ రాజకీయాల్లో సురవరం చెరగని ముద్ర వేశారంటూ మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. సురవరం మరణం తెలంగాణ రాజకీయాలకు తీరని లోటని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సురవరం ప్రజా సేవ, ఉద్యమ పంథా చిరస్మరణీయమని మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
లైసెన్సు తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉంచొద్దు... హైకోర్టు కీలక ఆదేశాలు
Read Latest Telangana News and National News