Share News

Hyderabad: అనధికారిక నిర్మాణాలన్నీ కూల్చాల్సిందే!

ABN , Publish Date - Jul 08 , 2025 | 03:48 AM

హైదరాబాద్‌లోని నందగిరి హిల్స్‌లో నెట్‌ నెట్‌ వెంచర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఆకాశ హర్మ్యంలో తీవ్ర ఉల్లంఘనలు జరిగాయని, అనధికారిక కట్టడాలను కూల్చివేయాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాలను సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు సమర్థించింది.

Hyderabad: అనధికారిక నిర్మాణాలన్నీ కూల్చాల్సిందే!

  • ‘నెట్‌ నెట్‌’ భవనంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాలు సబబే

  • అనధికారిక కట్టడాలను తొలగించే దాకా నిర్మాణ పనులు చేయొద్దు

  • జీహెచ్‌ఎంసీ ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలి

  • సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు తీర్పు

  • ఇచ్చుకుంటూ పోతే భవిష్యత్తులో ప్రభుత్వ భూమన్నదే ఉండదు: హైకోర్టు

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని నందగిరి హిల్స్‌లో నెట్‌ నెట్‌ వెంచర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఆకాశ హర్మ్యంలో తీవ్ర ఉల్లంఘనలు జరిగాయని, అనధికారిక కట్టడాలను కూల్చివేయాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాలను సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు సమర్థించింది. జీహెచ్‌ఎంసీ ఇచ్చిన ప్రణాళికకు భిన్నంగా భవన నిర్మాణం చేపట్టారంది. అనధికారిక నిర్మాణాలన్నింటినీ సరిచేయాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. పర్యావరణ సమతుల్యతకు భంగం వాటిల్లేలా నిర్మాణాలు చేపట్టడంతోపాటు అనుమతించిన ప్లాన్‌ ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారంటూ ఈ ఏడాది జనవరి 24న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాలు ఇచ్చారు. ఇదే విషయంపై జనవరి 25న ‘నెట్‌ నెట్‌ భవనాన్ని కూల్చాల్సిందే’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. అయితే, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాలను సవాలు చేస్తూ నెట్‌ నెట్‌ సంస్థ సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టును ఆశ్రయించింది. కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని, నిర్మాణ పనుల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని కోరింది. నెట్‌ నెట్‌ వెంచర్స్‌ ఉల్లంఘనలపై జీహెచ్‌ఎంసీ తన వాదనలను వినిపించింది. ఇచ్చిన ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేపట్టలేదని, సెట్‌ బ్యాక్‌ నిబంధనలు ఉల్లంఘించారని, ర్యాంపు, డ్రైవ్‌ వేలను సెట్‌ బ్యాక్‌ నిర్మించాల్సిన ప్రాంతంలో కట్టారని కోర్టుకు తెలిపింది. రాత్రివేళ అనధికారిక నిర్మాణాలు చేపట్టారని, భవన అంతస్తుల ఎత్తు అనుమతించినదాని కంటే ఎక్కువగా ఉందని వివరించింది. తాము ప్రణాళిక ప్రకారమే నిర్మాణం చేశామని నెట్‌ నెట్‌ వెంచర్‌ కోర్టుకు వివరించింది. అనధికారిక నిర్మాణాలు తొలగించామని, ఇంకా ఉల్లంఘన ఉంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇచ్చే సమయంలో సరిచేసుకోవచ్చని వాదించింది. అనధికారిక నిర్మాణాలు తొలగించినట్లు ఆధారాలు చూపాలని కోర్టు ఆదేశించగా.. సమాచారం ఇవ్వలేదు. జీహెచ్‌ఎంసీ ఇచ్చిన ఆదేశాలను, విజిలెన్స్‌ నివేదికను, భవన చిత్రాలను పరిశీలించిన కోర్టు.. అనధికారిక నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. జీహెచ్‌ఎంసీ ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. అనధికారిక నిర్మాణాలను కూల్చివేసే వరకు తదుపరి నిర్మాణ పనులు చేపట్టవద్దని ఆదేశించింది.


ఇదీ నేపథ్యం..

నందగిరి హిల్స్‌లో హెచ్‌ఎండీఏ నుంచి హుడా వేలంలో అమరేందర్‌రెడ్డికి చెందిన నెట్‌ నెట్‌ వెంచర్స్‌ సంస్థ 4.748ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ స్థలంలో 12 అంతస్తుల(జీ+4, 7 సెల్లార్లు) భవన నిర్మాణం చేపట్టేందుకు 2013లో జీహెచ్‌ఎంసీ అనుమతి పొందింది. 2015లో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 45లో జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలో 865.42 గజాల భూమిని కొనుగోలు చేసింది. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీకి సంబంధించి కొంత వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం 2017లో జీవో 305 ఇచ్చింది. దాని ప్రకారం రోడ్డుకు ఇరువైపులా ఉన్న స్థలాల్లో 30 మీటర్ల వరకు నిర్మాణాలు చేసుకోవచ్చు. కానీ, దాని వెనకే ఉన్న హుడా లేఔట్‌కు ఈ నిబంధనలు వర్తించవు. హౌసింగ్‌ సొసైటీకి ఇచ్చిన వెసులుబాటును అడ్డుపెట్టుకున్న నెట్‌ నెట్‌ వెంచర్స్‌ 30 మీటర్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు సాధించింది. అక్కడితో ఆగక జీ+4 నుంచి జీ+5, తర్వాత జీ+12, చివరకు జీ+13 వరకు అనుమతులు పొందింది. 2,09,620 చదరపు అడుగుల్లో నిర్మాణం చేసుకునేలా అనుమతి పొందింది. నందగిరి హౌసింగ్‌ సొసైటీ సభ్యులు ఈ నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 03:48 AM