POCSO Act: నిత్యపెళ్లికొడుకుపై పోక్సో కేసు
ABN , Publish Date - Aug 24 , 2025 | 03:34 AM
13 ఏళ్ల బాలికను పెళ్లాడిన సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీ్‌సస్టేషన్ కానిస్టేబుల్, నిత్య పెళ్లికొడుకుగా పేరొందిన బానోతు కృష్ణంరాజు 40 పై పోక్సో కేసు నమోదైంది...
13 ఏళ్ల బాలికను పెళ్లాడిన కానిస్టేబుల్
గతంలో ముగ్గురితో వివాహం, విడాకులు
రెండేళ్ల క్రితం బాలికతో మనువు
10 రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించిన ఆమె తల్లిదండ్రులు
బాలల సంక్షేమ అధికారుల చొరవతో కేసు
సూర్యాపేట రూరల్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): 13 ఏళ్ల బాలికను పెళ్లాడిన సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీ్‌సస్టేషన్ కానిస్టేబుల్, నిత్య పెళ్లికొడుకుగా పేరొందిన బానోతు కృష్ణంరాజు(40)పై పోక్సో కేసు నమోదైంది. బాలల సంక్షేమ అధికారుల ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యాపేట రూరల్ ఎస్సై బాలునాయక్ వివరాల మేరకు.. సూర్యాపేట మండలం సపావత్‌తండాకు చెందిన ఓ బాలికను చివ్వెంల మండలం తుల్జారావుపేటకు చెందిన బానోతు కృష్ణంరాజు 2023 డిసెంబరులో పెళ్లి చేసుకున్నాడు. వివాహ సమయంలో బాలిక వయస్సు 13 ఏళ్లు. దీని కంటే ముందు కృష్ణంరాజుకు మూడు పెళ్లిళ్లు జరిగాయి. ఆ ముగ్గురితోనూ విడాకులయ్యాయి. దీంతో కృష్ణంరాజు నిత్య పెళ్లికొడుకుగా పేరొందాడు. కృష్ణంరాజు చరిత్రను బాలిక తల్లిదండ్రులు ఆలస్యంగా తెలుసుకున్నారు. గతంలో జరిగిన మూడు పెళ్లిళ్ల సంగతి చెప్పకుండా కృష్ణంరాజు తమ కుమార్తెను పెళ్లి చేసుకుని మోసగించాడని బాధిత బాలిక తల్లిదండ్రులు 10 రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించారు. దీనిపై ‘ఈ కానిస్టేబుల్ నిత్య పెళ్లికొడుకు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ఓ కథనం కూడా ప్రచురితమైంది. దాంతో స్పందించిన అధికారులు 2012 బ్యాచ్‌కు చెందిన కృష్ణంరాజును విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే, బాలల సంక్షేమ అధికారులు జోక్యం చేసుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కృష్ణంరాజుపై చైల్డ్, మ్యారేజ్ ప్రొవిజన్ చట్టం కింద అత్యాచారం, పోక్సో కేసు నమోదు చేశారు. కృష్ణంరాజు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News