Congress: బీసీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వరకు పోరాడుతాం
ABN , Publish Date - Aug 05 , 2025 | 04:48 AM
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు.
ఢిల్లీలో బీసీల ధర్నాను విజయవంతం చేయాలి
కాంగ్రెస్ శ్రేణులకు మీనాక్షి పిలుపు
ముస్లింల పేరుతో మోకాలడ్డుతున్న బీజేపీ
మహేశ్ కుమార్ గౌడ్
ప్రత్యేక రైలులో ఢిల్లీకి తరలివెళ్లిన నేతలు
హైదరాబాద్, కుషాయిగూడ, యాదాద్రి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. సోమవారం చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, బీసీ నాయకులతో కలిసి ఆమె ఢిల్లీ బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలను పురస్కరించుకుని ఈనెల 6న ఢిల్లీలో చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. బీసీల ఆత్మగౌరవం, రాజకీయ అవకాశాల్లో బీసీలకు న్యాయమైన వాటా కోసం కాంగ్రెస్ చేస్తున్న ఈ పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతివ్వాలని కోరారు. కాగా ముస్లిం ల పేరుతో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై బీజేపీ మోకాలడ్డుతోందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రైలులో వెళ్తూ ఆలేరులో ఆయన మీడియాతో మాట్లాడారు. 6న జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపడతామని, 7న రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లోనూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించగా లేనిది తెలంగాణలో ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు కల్పించాల్సి వస్తుందన్న నెపంతో బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని, ఈ బిల్లు అమలుకు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించని పక్షంలో సహకరిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వ్యాఖ్యానిస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకలా, తెలంగాణలో మరోలా ఆలోచిస్తున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. మహేశ్‌కుమార్ వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఉన్నారు. ఈ రైల్లో జిల్లాకు పాతిక మంది చొప్పున కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ తదితర బీసీ నాయకులు.. మొత్తం వెయ్యికి మందికిపైగా నాయ కులు బయలుదేరారు. మీనాక్షి నటరాజన్.. నాగ్‌పూర్ వరకు, మహేశ్ కుమార్‌గౌడ్, పొన్నం, వాకిటి శ్రీహరి.. ఆలేరు వరకు ప్రయాణం చేశారు. మంగళవారం సాయంత్రానికి ఈ రైలు ఢిల్లీకి చేరుకుంటుంది.
అడ్డుకునేందుకు కిషన్‌రెడ్డి యత్నం...
అసెంబ్లీలో బీసీ బిల్లులకు మద్దతు ఇచ్చిన బీజేపీ ప్రజా ప్రతినిధులు.. ఎందుకు యూటర్న్ తీసుకున్నారని మహేశ్ కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బీసీ బిల్లులపై విషం కక్కుతుంటే ఆ పార్టీ బీసీ నేతలు ఎందుకు నోరు మెదపట్లేదని నిలదీశారు. మైనార్టీల పేరు చెప్పి బీసీ బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న కిషన్‌రెడ్డి.. బీసీల ఓట్లు లేకుండా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయగలరా అన్నారు. బీసీ ఉద్యమానికి ఎవరు మద్దతిచ్చినా స్వాగతిస్తామన్నారు. బీసీ ఉద్యమంలో కవిత పాత్ర ఏముందని నిలదీశారు. జనహిత పాదయాత్రను విడతలవారీగా నిర్వహిస్తామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం
Read latest Telangana News And Telugu News