Congress Targets KCR: కాంగ్రెస్ అమ్ములపొదిలో కాళేశ్వరాస్త్రం!
ABN , Publish Date - Aug 05 , 2025 | 03:40 AM
అధికార కాంగ్రెస్ పార్టీ అమ్ములపొదిలో ‘కాళేశ్వర’ అస్త్రం చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అధికారపక్షానికి సరికొత్త ఆయుధంగా మారింది.
కేసీఆరే లక్ష్యంగా సంధించేందుకు సిద్ధం
పంద్రాగస్టు తర్వాత జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో దాడికి సన్నద్ధం
అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న బీఆర్‌ఎ్‌సకు నివేదికతో కొత్త తలనొప్పి
వివరణకు అసెంబ్లీకి కేసీఆర్ రావాల్సిందే!
రాకుంటే కాంగ్రెస్ చేతికి ఆయుధం ఇచ్చినట్లే
ఇప్పటికే ‘కారు’ దిగిపోతున్న నేతలు
అరెస్టులు మొదలైతే మరిన్ని ఫిరాయింపులు
భవితపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో ఆందోళన!
హైదరాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): అధికార కాంగ్రెస్ పార్టీ అమ్ములపొదిలో ‘కాళేశ్వర’ అస్త్రం చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అధికారపక్షానికి సరికొత్త ఆయుధంగా మారింది. మాజీ సీఎం కేసీఆరే లక్ష్యంగా ఈ అస్త్రాన్ని సంధించేందుకు కాంగ్రెస్ సర్కారు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్‌ఎస్ పార్టీని అసెంబ్లీ వేదికగా తూర్పారపట్టేందుకు సిద్ధమవుతోంది. పంద్రాగస్టు తర్వాత జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీని గుక్కతిప్పుకోనివ్వకుండా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి ముందుకెళ్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కొద్ది రోజుల్లో జరగనున్న వర్షాకాల సమావేశాలు రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తాయా? అన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా నడుస్తోంది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం సెప్టెంబరు 26లోపు వర్షాకాల సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. దీంతో పంద్రాగస్టు తర్వాత సమావేశాలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం వైఫల్యానికి అప్పటి సీఎం కేసీఆరే ప్రధాన కారకుడని కమిషన్ తేల్చడంతో కాంగ్రెస్ సహజంగా ఆయనే టార్గెట్ కానున్నారు. అయితే, అసెంబ్లీలో జరుగుతున్న చర్చల్లో పాల్గొనాలంటూ కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి గతంలో పలుమార్లు కోరినా ఆయ న సభకు రాలేదు. తాజాగా కమిషన్ నివేదికపై జరి గే చర్చలో పాల్గొని సమాధానం చెప్పక తప్పని పరిస్థితి కేసీఆర్‌కు ఏర్పడింది. ఆయన సమాధానం చెప్పకుంటే ప్రజల్లోకి కచ్చితంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు.
అసలే సమస్యలు.. ఆపై నివేదిక..
ఎమ్మెల్సీ కవిత వ్యవహారం సహా పలు అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న బీఆర్‌ఎస్‌కు కాళేశ్వరం నివేదిక రూపంలో కొత్త తలనొప్పి వచ్చినట్లయింది. ఈ నివేదిక ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని ఆ పార్టీ నేతలు గుబులు పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కొద్ది నెలల్లోనే పది మంది బీఆర్‌ఎ్‌స ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటూ రాలేదు. సిటింగ్ స్థానమైన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతాలో చేరింది. ఎమ్మెల్సీ కవిత తరచూ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీలో అంతర్గత సమస్యలను ఎత్తిచూపుతున్నాయి. ఈ తరుణంలో జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆ పార్టీపై తీవ్ర ప్రభావమే చూపుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో కమిషన్ నివేదికపై చర్చ అనంతరం.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలోనూ ప్రభుత్వం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే పార్టీ ముఖ్యనాయకుల అరెస్టులూ జరిగే అవకాశం ఉం టుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలు గులాబీ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు బీజేపీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందన్న అభిప్రాయా లూ వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎ్‌సలో ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల వల్లే మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కొండబాల కోటేశ్వర్‌రావు వంటి వారు ‘కారు’ దిగేశారని.. కాళేశ్వరం వైఫల్యంపై చట్టపరమైన చర్యలు ప్రారంభమైతే మరికొందరు నాయకులు ఇదే బాటలో నడుస్తారంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేల్లో రాజకీయ భవిష్యత్తు పట్ల అభద్రతాభావం ఏర్పడితే మరిన్ని ఫిరాయింపులు ఉండొచ్చని పేర్కొంటున్నారు.
స్థానిక ఎన్నికలపైనా..!
ఎన్నికల్లో వైఫల్యాలతో సతమతమవుతున్న బీఆర్‌ఎస్.. స్థానిక ఎన్నికలపైనే ఆశలు పెట్టుకుని ఉంది. వాటిలోనూ విఫలమైతే ఆ పార్టీ మనుగడపైనే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సహజంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకే మొగ్గు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం అవకతవకలపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే బీఆర్‌ఎస్‌లో ఏర్పడే గందరగోళం.. స్థానిక ఎన్నికలపై మరింత ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం
Read latest Telangana News And Telugu News