Share News

First Phase of Panchayat Elections: పంచాయతీల్లో పైచేయి

ABN , Publish Date - Dec 12 , 2025 | 05:15 AM

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రె్‌సదే పైచేయి అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలుచుకున్న పట్టును నిలబెట్టుకుంటూ మెజారిటీ సర్పంచ్‌ స్థానాలను కూడా తమ ఖాతాలో వేసుకుంది.......

First Phase of Panchayat Elections: పంచాయతీల్లో పైచేయి

తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యం.. సగానికిపైగా గెలిచిన పార్టీ మద్దతుదారులు

4231 సర్పంచులకుగాను 2367 హస్తం ఖాతాలో

58.5 శాతానికిపైగా కైవసం చేసుకున్న కాంగ్రెస్‌

26 శాతం సీట్లను గెలుచుకున్న బీఆర్‌ఎస్‌

గులాబీ ఖాతాలో 1,055 పంచాయతీలు

సిద్దిపేట జిల్లాలో కాంగ్రె్‌సను మించి సీట్లు

సిరిసిల్లలోనూ హస్తం మద్దతుదారులదే హవా

బీజేపీ నామమాత్రమే.. 186 చోట్లనే గెలుపు

10 శాతం పంచాయతీల్లో ఇతరుల పాగా

రాజకీయంగా ఆధిపత్యం నిలబెట్టుకున్న కాంగ్రెస్‌

నాడు అసెంబ్లీ ఎన్నికల్లో.. నేడు స్థానికంలో..

హైదరాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రె్‌సదే పైచేయి అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలుచుకున్న పట్టును నిలబెట్టుకుంటూ మెజారిటీ సర్పంచ్‌ స్థానాలను కూడా తమ ఖాతాలో వేసుకుంది. తొలివిడతకు సంబంధించి మొత్తం 4,236 పంచాయతీలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా గురువారం 3,836 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలు కలుపుకొని 2,367 చోట్ల కాంగ్రెస్‌ పార్టీ మద్దతిచ్చిన వారు సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మద్దతిచ్చిన అభ్యర్థుల్లో 1,055 మంది సర్పంచులుగా గెలుపొందారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఎన్నికలు జరగగా 30 జిల్లాల్లో అధికార పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్‌ఎస్‌ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తంగా కాంగ్రెస్‌ 58.5 శాతం గెలుపొందగా, బీఆర్‌ఎస్‌ 26 శాతం సీట్లను గెలిచింది. ఇక బీజేపీ ప్రభావం నామమాత్రమే అయింది. తొలి విడత మొత్తంగా ఆ పార్టీకి 186 సర్పంచ్‌ స్థానాలు మాత్రమే దక్కాయి. అత్యధికంగా నిర్మల్‌ జిల్లాలో 24 పంచాయతీల్లో కమలం పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఏకంగా ఐదు జిల్లాల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. కేవలం 4.6 శాతం స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగింది. కమ్యూనిస్టులు, స్వతంత్రులు, ఇతరులు కలిపి 439 పంచాయతీల్లో పంచాయతీల్లో విజయపతాకం ఎగురవేశారు. 10 శాతానికి పైగా పంచాయతీలను వీరు దక్కించుకోవడం గమనార్హం.


సిద్దిపేట మినహా.. బీఆర్‌ఎస్‌ డీలా!

పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమే అయినా.. క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య సార్వత్రిక ఎన్నికలను మించి పోటీ జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల పక్షాన వర్గాలుగా సమీకరణ జరిగి.. పోరు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అభ్యర్థుల ఎంపిక నుంచి నాయకుల మధ్య సయోధ్య కుదర్చడం దాకా మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దగ్గరుండి చూసుకున్నారు. వారి ప్రయత్నం ఫలితాల్లో ప్రతిఫలించింది. సిద్దిపేట మినహా అన్ని జిల్లాల్లోనూ బీఆర్‌ఎస్‌ కంటే ఎక్కువగా కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులే సర్పంచ్‌లుగా గెలిచారు. కేసీఆర్‌, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్‌ఎస్‌ పైచేయి సాధించింది. ఈ జిల్లాలో తొలి విడతలో 163 పంచాయతీలకుగాను 16 ఏకగ్రీవం కాగా, బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు 75 సర్పంచ్‌ సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్‌ మద్దతిచ్చిన వారు 60 సీట్లలో మాత్రమే గెలిచారు. ఇక్కడ బీజేపీకి 11 స్థానాలు దక్కగా, ఇతరులు 17 స్థానాలను దక్కించుకున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నియోజకవర్గం ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం కాంగ్రె్‌సది పైచేయి అయింది. ఆ జిల్లాలో 42 చోట్ల కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తే 30 చోట్ల బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలిచారు. ఇక తొలి విడతలో 395 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవం కాగా, వీటిలో 90 శాతానికి పైగా కాంగ్రె్‌సకే దక్కాయి. సిద్దిపేట మినహా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ ఆధిక్యత సాధించినా.. అన్ని చోట్లా ఆ పార్టీకి పోటీ ఇచ్చింది మాత్రం బీఆర్‌ఎస్సే. క్షేత్రస్థాయిలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా తన హోదాను నిలబెట్టుకుంది.


10 జిల్లాల్లో సగానికిపైగా సీట్లు కాంగ్రె్‌సవే..

దాదాపుగా అన్ని జిల్లాల్లో ఆధిక్యం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ.. 10 జిల్లాల్లో మాత్రం సగానికి పైగా సర్పంచ్‌ స్థానాలు దక్కించుకుంది. వీటిలో ముందు వరుసలో ఖమ్మం జిల్లా ఉంది. ఈ జిల్లాలో తొలి విడత 192 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగగా.. 135 సీట్లు హస్తం పార్టీ మద్దతిచ్చిన వారే దక్కించుకున్నారు. బీఆర్‌ఎస్‌ 33, ఇతరులు మిగిలినవి గెలుచుకున్నారు. ఖమ్మంతోపాటు నల్లగొండ, భూపాలపల్లి, జనగామ, మెదక్‌, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, వికారాబాద్‌, గద్వాల, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో సగానికిపైగా పంచాయతీలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో తొలివిడతలో దక్కిన విజయంతో కాంగ్రె్‌సలో జోష్‌ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలేదని, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని ప్రచారం జరిగినా.. వరుస ఎన్నికల్లో విజయం ద్వారా ప్రజలు కాంగ్రెస్‌ సర్కారుపై విశ్వాసంతోనే ఉన్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఇంతకుముందు కంటోన్మెంట్‌, జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ విజయం సాధించడం, తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తుండడం ఇందుకు నిదర్శనమని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

2.jpg

Updated Date - Dec 12 , 2025 | 05:15 AM