POLYCET: పాలిసెట్ కౌన్సెలింగ్‌లో గందరగోళం
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:11 AM
పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ర్యాంకులు పొందిన విద్యార్థులకు సీట్ల కేటాయింపులో అధికారులు ఎడతెగని జాప్యం చేస్తున్నారు.
సీట్ల కేటాయింపులో ఎడతెగని జాప్యం
అభ్యర్థులు, తల్లిదండ్రుల ఆందోళన
హైదరాబాద్ సిటీ, జూలై 14 (ఆంధ్రజ్యోతి): పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ర్యాంకులు పొందిన విద్యార్థులకు సీట్ల కేటాయింపులో అధికారులు ఎడతెగని జాప్యం చేస్తున్నారు. ఇప్పటికే అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య ప్రతియేటా తగ్గుముఖం పడుతుండగా, అధికారుల నిర్లక్ష్యంతో ఆసక్తి కలిగిన అభ్యర్థులు కూడా ఇంటర్మీడియట్ బాట పడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 4లోపు తొలివిడత, 15 లోపు తుదివిడత సీట్ల కేటాయింపులను పూర్తిచేసి, సీట్లు పొందిన విద్యార్థులకు 17 నుంచి అకాడమిక్ సెషన్ ప్రారంభించాల్సి ఉంది. అయితే మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియనే పూర్తిచేయని సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు రెండోవిడత కౌన్సెలింగ్ ఎన్నటికి ముగిస్తారోనని అభ్యర్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. అకాడమిక్ సెషన్, క్లాస్‌వర్క్ ప్రారంభించే విషయమై అధికారులు స్పష్టమైన తేదీలను ప్రకటించాలని, తొలివిడత సీట్ల కేటాయింపు వివరాలను తక్షణం వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
పెరిగిన ఫీజుల చెల్లింపుపై స్పష్టత కరువు...
పెరిగిన ఫీజుల్లో ఎంతమేర రీయింబర్స్‌మెంట్ చెల్లించాలనే అంశంపై అధికారులకు స్పష్టత రాకపోవడంతోనే తొలివిడత సీట్ల కేటాయింపులో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు కళాశాలల్లో వార్షిక ట్యూషన్ ఫీజు గతేడాది వరకు రూ.15,500 ఉండగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో 14,900 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ ఏడాది నుంచి ఫీజును రూ.39వేలకు పెంచడంతో దానిలో రీయింబర్స్‌మెంట్ ఎంత చెల్లించాలనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కరువైంది. ఈ విషయమై కౌన్సెలింగ్ క్యాంపు ఆఫీసరు శ్రీనివాస్ స్పందిస్తూ ఫీజుల చెల్లింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఉందని, ఉత్తర్వులు జారీ కాగానే సీట్ల కేటాయింపు వివరాలు ప్రకటిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి
నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు '
తిరుపతి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి