Share News

CM Revanth Reddy at Osmania University: ఫామ్‌హౌస్‌లో మానవ మృగాలు

ABN , Publish Date - Aug 26 , 2025 | 03:34 AM

సెంట్రల్‌ యూనివర్సిటీలో ఏనుగులు, సింహాలు ఉన్నాయంటూ ఏఐ టెక్నాలజీతో వీడియో క్రియేట్‌ చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వాటిని ప్రభుత్వం చంపుతున్నట్లు ప్రచారం చేశారని మండిపడ్డారు......

CM Revanth Reddy at Osmania University:  ఫామ్‌హౌస్‌లో మానవ మృగాలు

  • హెచ్‌సీయూలో ఏనుగులు, సింహాలు లేవు.. ఏఐ టెక్నాలజీతో సృష్టించారు

  • కోదండరాంను 15 రోజుల్లో తిరిగి చట్టసభకు పంపుతాం.. ఎవరు అడ్డొస్తారో చూస్తాం

  • ప్రపంచంతో పోటీపడేలా ఓయూ అభివృద్ధి.. వెయ్యి కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధం

  • వచ్చే ఆరు నెలల్లో 40 వేల ఉద్యోగాలు.. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాల భర్తీ లక్ష్యం

  • డిసెంబరులో మళ్లీ ఓయూకి వస్తా.. ఆర్ట్స్‌ కాలేజీ ముందు సభ పెడతా: సీఎం రేవంత్‌

  • ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పలు భవనాల ప్రారంభం.. శంకుస్థాపన

  • అడిగినవన్నీ ఇస్తున్నా.. ఆందోళన ఏంటి?.. మనకు, ఉద్యోగులకు మధ్య దూరమేంటి?

  • చక్కదిద్దండి.. భట్టికి సూచించిన సీఎం.. ఉద్యోగ నేతలతో చర్చించిన ఉపముఖ్యమంత్రి

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): సెంట్రల్‌ యూనివర్సిటీలో ఏనుగులు, సింహాలు ఉన్నాయంటూ ఏఐ టెక్నాలజీతో వీడియో క్రియేట్‌ చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వాటిని ప్రభుత్వం చంపుతున్నట్లు ప్రచారం చేశారని మండిపడ్డారు. కానీ, తెలంగాణలో ఏనుగులు, సింహాలు లేవని, మానవ రూపంలో మృగాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. అవి ఫాంహౌ్‌సలో ఉన్నాయని, వాటిని పట్టుకొని బంధించాలని అన్నారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను తమ ప్రభుత్వం ఎమ్మెల్సీని చేస్తే.. కొందరు కోర్టుకు వెళ్లి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి మరీ తొలగించారని తెలిపారు. ఆయనను మళ్లీ ఎమ్మెల్సీని చేస్తామని, 15 రోజుల్లో చట్టసభకు పంపుతామని ప్రకటించారు. ఎవరు అడ్డొస్తారో చూస్తానని సవాల్‌ చేశారు. ‘మీ ఇంట్లో అందరికీ పదవులు ఉండొచ్చు కానీ, తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌గా ఉన్న కోదండరామ్‌ సార్‌కు ఒక్క పదవి ఉండొద్దా?’ అని మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల కోసం రెండు నూతన హాస్టల్‌ భవనాలు, డిజిటల్‌ లైబ్రరీ రీడింగ్‌ రూమ్‌ నిర్మాణాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. దీంతోపాటు రూ.80 కోట్లతో కొత్తగా నిర్మించిన దుందుభి, భీమ హాస్టల్‌ భవనాలను ప్రారంభించారు. అనంతరం వర్సిటీలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో సీఎం మాట్లాడారు. ఓయూను ప్రపంచంతో పోటీపడేలా స్టాన్‌ఫర్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీల స్థాయిలో అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఇందుకోసం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఓయూను ఒక అద్భుతమైన వర్సిటీగా తీర్చిదిద్దడానికి ఇంజనీరింగ్‌, విద్యాశాఖ నిపుణలతో కమిటీని నియమించి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.


XF B.jpg

తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఓయూ..

తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ అని సీఎం రేవంత్‌ అన్నారు. ఓయూ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదన్నారు. 1948 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఓయూ అని, దేశఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్‌ పాటిల్‌, పీవీ నర్సింహారావు, జైపాల్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జార్జిరెడ్డి ఈ యూనివర్సిటీ నుంచి వచ్చినవారేనని గుర్తు చేశారు. తెలంగాణలో ఏ సమస్య వచ్చినా మొదట చర్చ జరిగేది ఓయూలోనేనన్నారు. చదువుతోపాటు పోరాటాన్ని నేర్పించే గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం చేతులెత్తేసినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది, మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారిది ఉస్మానియా యూనివర్సిటీయేనని అన్నారు. యాదయ్య, ఇషాన్‌రెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి రాష్ట్ర సాధనలో సమిధలయ్యారని గుర్తు చేశారు.

వీసీల నియమాకంలో సామాజిక న్యాయం..

గతంలో కళకళలాడిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం కళాహీనంగా మారిందని సీఎం రేవంత్‌ అన్నారు. గత పాలకులు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేయాలని చూశారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే యూనివర్సిటీకి పూర్వ వైభవం కల్పించాలని నిర్ణయించామన్నారు. ‘‘రాష్ట్రంలోని యూనివర్సిటీలన్నింటినీ చదువులకే కాకుండా.. సామాజిక చైతన్య వేదికలుగా మార్చాలన్న ఆలోచనతో నిర్ణయాలు తీసుకున్నాం. ఉస్మానియా వర్సిటీ 108 ఏళ్ల చరిత్రలో దళితుడు వైస్‌ చాన్స్‌లర్‌ కాలేదు. ప్రస్తుత వీసీ కుమార్‌లోని నైపుణ్యాన్ని గుర్తించి వీసీగా నియమించాం. మిగతా యూనివర్సిటీలు, విద్యా కమిషన్‌కు అలాగే నియమించాం. సామాజిక న్యాయాన్ని పాటించాం. దేశానికి యువ నాయకత్వం అవసరం. దేశంలో 65 శాతం జనాభా 35 ఏళ్ల లోపువారు. ఇది మన దేశ సంపద. 21 ఏళ్ల వయసులో ఐఏఎ్‌సలుగా, ఐపీఎ్‌సలుగా దేశానికి సేవలందిస్తున్నప్పుడు.. 21 ఏళ్ల యువకులు శాసనసభలో ఎందుకు అడుగు పెట్టకూడదు? శాసనసభకు పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయసు పరిమితిని 21 ఏళ్లకు ఎందుకు తగ్గించ కూడదో ఆలోచించాలి’’ అని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. యూనివర్సిటీలు చదువులకు మాత్రమే పరిమితం కాకుండా పరిశోధనలకు వేదిక కావాలన్నారు. సైద్ధాంతికపరమైన భిన్నాభిప్రాయాలపై చర్చలు, సాంకేతిక పరమైన చర్చలు జరగాలన్నారు. వర్సిటీలు, విద్యాలయాల్లో సిద్థాంతపరమైన పోరాటాలు, సామాజిక చైతన్య ఉద్యమాలు లేని కారణంగా చిన్న చిన్న కాలేజీల్లో కూడా విద్యార్థులు గంజాయి లాంటి వ్యసనాల బారిన పడేందుకు దారితీస్తోందని పేర్కొన్నారు.


నాణ్యమైన విద్య మాత్రమే ఇవ్వగలం..

విద్యార్థులకు తాను ఇవ్వగలిగింది చదువు ఒక్కటేనని, పంచడానికి భూముల్లేవని సీఎం రేవంత్‌ అన్నారు. ‘‘నాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం పీవీ సంస్కరణలతో అర్బన్‌ సీలింగ్‌ పెట్టి పేదలకు 25 లక్షల ఎకరాల భూములను పంచింది. గిరిజనులకు 10 లక్షల ఎకరాల పోడు భూములను ఇచ్చింది. ప్రస్తుతం పంచడానికి నా దగ్గర భూములు లేవు. అగ్రికల్చర్‌ సీలింగ్‌ యాక్ట్‌ పెట్టి గుంజుకోవడానికీ లేవు. ధనవంతులను చేయడానికి ఖజానా లేదు. మీకు ఇవ్వగలిగింది విద్య ఒక్కటే. చదువే మిమ్మల్ని ధనవంతుల్ని, గుణవంతుల్ని చేస్తుంది. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం’’ అని సీఎం రేవంత్‌ అన్నారు. విద్యా రంగానికి ఈ ఏడాది రూ.40 వేల కోట్లు ఖర్చు పెట్టామని, ఓయూ కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయడానికి ఇబ్బందేమీ లేదని తెలిపారు.

అడ్డుకుంటే అభివృద్ధి ఎలా?

విద్యార్థులు తమకు ఇబ్బంది కలిగించిన వారి పట్ల నిరసన తెలపాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారిని అడ్డుకుంటే అభివృద్ధి ఎలా జరుగుతుందో ఆలోచించుకోవాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, 55 రోజుల్లో 11 వేల మంది టీచర్లను నియమించామని తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో ఇంకో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్ల కాలం నాటికి లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ప్రైవేటు రంగంలో రూ.వేల కోట్ల పెట్టుబడులు తేవడమే కాకుండా 1.5 లక్షల ఉద్యోగాలనూ కల్పించామని చెప్పారు.

డిసెంబరులో ఆర్ట్స్‌ కాలేజీ ముందు మీటింగ్‌..

‘‘డిసెంబరులో ఆర్ట్స్‌ కాలేజీ ముందు మీటింగ్‌ పెట్టండి. నేను కూడా వస్తాను. విద్యార్థుల సమస్యలు తీర్చాలనుకుంటున్నాను. నేను ఓయూకు ఎందుకు రావద్దు? మీ సమస్యలు ఏమున్నా చెప్పండి. తీరుస్తాను. ఒక్క పోలీసుకూ పెట్టకండి.. డీజీపీ ఇదే నా ఆదేశం. మళ్లీ యూనివర్సిటీకి వచ్చి నిధులు మంజూరు చేస్తాను. అప్పటికప్పుడు మీకు జీవోలు ఇస్తాను. ఆరోజు ఒక్క పోలీసు కూడా క్యాంప్‌సలో ఉండడు. అప్పుడు విద్యార్థులు నిరసనలు తెలిపినా నేను ఏమీ అనను. నిరసనలు తెలిపే స్వేచ్ఛ ఉంటుంది. విద్యార్థులు అడిగే ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకు ఉంది’’ అని రేవంత్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వీరేశం, సామేల్‌, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్‌, అద్దంకి దయాకర్‌, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన, ఓయూ వీసీ కుమార్‌ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ

ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం

For More National News

Updated Date - Aug 26 , 2025 | 06:10 AM