PM Modi: ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ABN , Publish Date - Aug 25 , 2025 | 09:08 PM
వాషింగ్టన్ నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లతో ప్రమేయం లేకుండా ఇందుకు అవసరమైన మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తుందని మోదీ భరోసా ఇచ్చారు. అహ్మదాబాద్ సోమవారం నాడు పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.
అహ్మదాబాద్: ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతుల ప్రయోజనాలకు భంగం కలగనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) స్పష్టం చేశారు. చిన్న వ్యాపారులు, రైతులకు ప్రభుత్వం ఎలాంటి హాని జరక్కుండా చూస్తుందని పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ (Donald Trump) విధించిన టారిఫ్‌లను ప్రస్తావిస్తూ ప్రధాని భరోసా ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంగా భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్‌లు ఈనెల 27 నుంచి అమల్లోకి రానున్నారు. ఈక్రమంలో వాషింగ్టన్ నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లతో ప్రమేయం లేకుండా ఇందుకు అవసరమైన మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోందని మోదీ భరోసా ఇచ్చారు. అహ్మదాబాద్ సోమవారం నాడు పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌తో గుజరాత్ ఎంతో శక్తిని సాధించిందని, దీనికి వెనుక రెండు దశాబ్దాల కఠోర శ్రమ ఉందని చెప్పారు. 'ఈరోజు ప్రపంచంలో ఆర్థిక స్వార్థం ఆధారంగా విధానాలు రూపొందిస్తున్నారు. వాటి నుంచి రక్షించుకునే చర్యలకు భారత్ కట్టుబడి ఉంది. పౌరుల ప్రయోజనాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది' అని మోదీ స్పష్టం చేశారు. దుకాణదారులు, రైతులు, పశువుల పెంపకందారుల ప్రయోజనాలకు ఎలాంటి హామీ జరగనీయమని గాంధీ పుట్టిన నేల నుంచి తాము భరోసా ఇస్తున్నామని చెప్పారు.
ఆపరేషన్ సింధూర్‌తో విక్టరీ
పహల్గాం ఉగ్రదాడి అనంతరం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' విజయం కావడంపై మాట్లాడుతూ.. ఉగ్రవాదులు, వారి వెనుక ఉన్న శక్తులు ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టేదే లేదని హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడులకు ఆపరేషన్ సిందూర్‌తో ఎలా ప్రతీకారం తీర్చుకున్నామో యావత్ ప్రపంచం చూసిందని చెప్పారు. కేవలం 22 నిమిషాల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టామని, వందలాది కిలోమీటర్లు లోపలకు చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాద కేంద్రాలను నేలమట్టం చేశామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ మన సైనిక శక్తికి ప్రతీకని అన్నారు. గుజరాత్ గడ్డపై ఇద్దరు మోహనులు ఉన్నారని, ఒకరు సుదర్శన చక్రాన్ని ధరించిన శ్రీకృష్ణుడు, మరొకరు చరఖాను తిప్పిన పూజ్యబాపూ అని చెప్పారు. వారి మార్గంలో భారత్ నిరంతరం శక్తివంతమవుతోందన్నారు. స్వచ్ఛత, స్వదేశీ మార్గంలో దూసుకువెళ్తున్నామని చెప్పారు. ప్రధాని అహ్మదాబాద్ పర్యటనలో రూ.5,400 కోట్ల విలువ చేసే రైల్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్, ఇంధనం, గ్రీన్ మెబిలిటీ, అర్బన్ డవలప్‌మెంట్ వంటి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకింతం చేశారు.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
ప్రధాని విద్యా రికార్డును బహిర్గతం చేయరు: ఢిల్లీ హైకోర్టు తీర్పు
For More National News