CM Revanth Reddy: నకిలీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం
ABN , Publish Date - May 17 , 2025 | 03:14 AM
వానాకాలం సాగుకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని, విత్తనాలు, ఎరువులు సరిపడా అందుబాటులో ఉంచాలని, నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేసే కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించారు.

పీడీ యాక్ట్ పెట్టండి
పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీ చేయాలి
వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సాగుకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని, విత్తనాలు, ఎరువులు సరిపడా అందుబాటులో ఉంచాలని, నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేసే కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని, అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పీడీ యాక్టు నమోదు చేయాలని ఆదేశించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా వ్యవసాయ శాఖ, పోలీస్ విభాగం సంయుక్తంగా టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించాలని, సరిహద్దుల్లో టాస్క్‌ఫోర్స్ నిఘా ముమ్మరం చేయాలని సూచించారు.
ఎవరెవరు కల్తీ విత్తనాలు విక్రయిస్తున్నారు? ఎక్కడ నిల్వలున్నాయి? ఎక్కడి నుంచి రవాణా అవుతున్నాయనే వివరాలకు సంబంధించి అధికారులకు సమాచారం ఉందని, ఎవరినీ ఉపేక్షించకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. విత్తనాలు, ఎరువులకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మాట్లాడాలని సీఎస్ రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఇప్పటికే సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఈ సీజన్లో వరి, పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందని, రైతుల నుంచి డిమాండ్ ఉన్న అన్ని కంపెనీల విత్తనాలు మార్కెట్లో ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. దాంతో, ఎరువులు, విత్తనాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈసారి రుతుపవనాలు ముందే వస్తుండటంతో, రాష్ట్రంలోనూ వానలు ముందుగానే కురిసే అవకాశముందంటూ వాతావరణ శాఖ చేసిన సూచనలను రైతులు గమనించాలన్నారు. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని రైతులను అప్రమత్తం చేశారు. ప్యాక్ చేసిన విత్తనాలు తప్ప విడిగా విక్రయించే విత్తనాలు కొనుగోలు చేయవద్దని, విత్తన ప్యాకెట్లు కొనేటప్పుడు బిల్లు తీసుకుని పంట కాలం ముగిసే వరకూ భద్రపరుచుకోవాలని సూచించారు. కల్తీ విత్తనాల బారిన పడి రైతులు మోసపోకుండా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News