CM Revanth Reddy Vows to Secure Telangana Funds: నిధులడిగే ఓపిక ఉంది!
ABN , Publish Date - Dec 06 , 2025 | 06:12 AM
రాష్ట్ర ప్రజలు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీకొట్టడానికి వెనుకాడనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం ఒకటికి వంద సార్లు ఢిల్లీకి వెళ్లి అడుగుతానని, ముఖ్యమంత్రిగా ప్రధాని దగ్గరకు, కేంద్ర మంత్రుల దగ్గరకు.....
కాదంటే కేంద్రాన్ని ఢీకొట్టే దమ్ముంది
వంద సార్లయినా ఢిల్లీ వెళ్లి నిధులడుగుతా.. రాష్ట్ర ప్రజలు అండగా నిలిస్తే చాలు
రెఫరెండం అన్నోడిని బండకేసి కొట్టారు.. సిగ్గు లేకుండా నెల రోజులకే తిరుగుతుండు
గడీలోళ్ల కరెంటు పీకేందుకే కాంగ్రెస్ వచ్చింది.. ఉచిత కరెంట్ పేటెంట్ హక్కులు కాంగ్రె్‌సవే
మంత్రితో పని చేయించుకొనే వాళ్లను ఎన్నుకోండి.. త్వరలో 40 వేల ఉద్యోగాల ప్రకటన
మార్చిలో 35 లక్షల ఇందిరమ్మ చీరల పంపిణీ.. నర్సంపేట బహిరంగ సభలో సీఎం రేవంత్
వరంగల్, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రజలు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీకొట్టడానికి వెనుకాడనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం ఒకటికి వంద సార్లు ఢిల్లీకి వెళ్లి అడుగుతానని, ముఖ్యమంత్రిగా ప్రధాని దగ్గరకు, కేంద్ర మంత్రుల దగ్గరకు వెళ్లడం తన బాధ్యతని చెప్పారు. తనకు ఓపిక, వయసు, విషయాన్ని వివరించే పరిజ్ఞానం ఉన్నాయని ప్రస్తావించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తానని, అదే సమయంలో రాకపోతే ఎంత దూరం అయినా వెళ్లి కొట్లాడతానని అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో రూ.532 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణపై కేంద్ర వివక్ష చూపుతోందని, రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిదుల్ని ఇవ్వడం లేదని ఆరోపించారు. బీఆర్‌ఎ్‌సకు రెండు సార్లు అధికారం ఇస్తే సొంత ఆస్తులు సంపాదించుకున్నరని, ఫామ్‌హౌ్‌సలు కట్టుకొని, విమానాలు కొనుక్కున్నరని, టీవీ చానళ్లు, పత్రికలు పెట్టుకున్నరని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు మాత్రం మారలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని, ఒక్క గింజ కొనేది లేదు దిక్కున్న చోట చెప్పుకొండని అన్నారని రేవంత్ ప్రస్తావించారు. తమ ప్రభుత్వం చివరి గింజ వరకు కొంటోందని చెప్పారు. సన్న వడ్లు పండిస్తే రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి నిలబెట్టుకున్నామని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబందు బంద్ అవుతుందని, రుణమాఫీ అబద్దమని, కరెంట్ ఉండదని తప్పుడు ప్రచారం చేశారన్నారు. తెలంగాణను దోచుకున్నోళ్లకే కరెంట్ పోయిందని, గడీలోళ్ల కరెంటు పీకేందుకే కాంగ్రెస్ వచ్చిందని వ్యాఖ్యానించారు. దుక్కిదున్నే రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదని, 2004లో దేశంలోనే రైతాంగానికి ఉచిత విద్యుత్‌పై రాజశేఖర్‌రెడ్డి తొలి సంతకం చేశారని ప్రస్తావించారు. దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌కు రెండింతల ధాన్యం పండిస్తున్నట్లు గుర్తు చేశారు. 1.10 కోట్ల రేషన్ కార్డుల మీద 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామని ప్రకటించారు. ఏడాదికి రూ.11 వేల కోట్ల భారం అవుతున్నప్పటికీ పేదలకు సన్నబియ్యం ఇవ్వాల్సిందేనని కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించిందని, ధనిక రాష్ట్రం సీఎంగా కేసీఆర్ ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని 65 లక్షల మంది ఆడపడుచులకు చీరలను కానుకగా ఇస్తున్నామని చెప్పారు. ప్రతీ ఆడపడుచుకు చీరె అందేలా కాంగ్రెస్ కార్యకర్తలు చొరవ తీసుకోవాలని కోరారు. మార్చి నెలలో పట్టణ ప్రాంతాల్లో ఉండే 35 లక్షల మంది మహిళలకు చీరెలను అందిస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను రెఫరెండంగా ప్రకటించి, ప్రచారం చేసిన కేటీఆర్‌ను ఓటర్లు బండకేసి కొట్టారని సీఎం అన్నారు. సిగ్గు లేకుండా కనీసం నెల కూడా కాకుండానే మళ్లీ తిరుగుతూ అబద్దాల ప్రచారం చేస్తున్నాడని దుయ్యబట్టారు. నాలుగు సార్లు ఎన్నికల్లో ప్రజలు పండబెట్టి వీపు మీద గుద్ది చెప్పినా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. విద్యార్థులు పంచాయతీ ఎన్నికల మీద దృష్టి పెట్టొద్దని ముఖ్యమంత్రి కోరారు. చదువు ఒక్కటే మీ జీవితాన్ని, తలరాతను మార్చుతుందని చెప్పారు. నాణ్యమైన విద్యను అందించి, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా, ఐపీఎస్, ఐఏఎ్‌సలుగా తీర్చిదిద్దే బాధ్యత తనదని అన్నారు. గొల్లోళ్లు గొర్రెలు పెంచుకోవాలే, బెస్తోళ్లు చేపలు పట్టుకోవాలే, ఎస్సీలు చెప్పులు కుట్టుకోవాలె అన్నట్లుగా కేసీఆర్ పథకాలు తెచ్చిండని, ఆయన పిల్లలు రాజ్యం ఏలాలంటే మీ పిల్లలు గొర్లు, చేపలు పెంచుకోవాలన్నది ఆయన ఉద్దేశమని చెప్పారు. ప్రభుత్వం భూములు ఇస్తుందనో, ఆస్తులు పంచుతుందనో ఆశలు పెట్టుకోవద్దని, 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని, వాటికి కష్టపడండని చెప్పారు.
ప్రభుత్వంతో మంచిగా ఉండేటోడిని ఎన్నుకోండి
గ్రామాల అభివృద్ధికి యువత రాజకీయాల్లోకి రావాలని అన్నారు. ప్రజల మనుసులు గెలిస్తే ఆటోమెటిక్‌గా పదవులు వస్తాయనడానికి తానే ఉదాహరణ అని చెప్పారు. 2006లో జడ్పీటీసీగా ఇండిపెండెంట్‌గా గెలిచానని, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యానని ప్రస్తావించారు. కొనుక్కుంటే పదవులు రావని, వాటికి ఖర్చు పెట్టవద్దని సూచించారు. గ్రామాల్లో సర్పంచులు మంచోళ్లు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని, తీట నోరు పెట్టుకునే మాట్లాడితే ఏం పనీ జరగదని హితవు పలికారు. గ్రామాల్లో రాజకీయ కక్షలకు తావు ఇవ్వొద్దని, తమ ప్రభుత్వంతో కలిసి, మంత్రి దగ్గర కూర్చొని పనులు చేయించుకొనే వాడిని చూసి ఎన్నుకోవాలని సలహా ఇచ్చారు. పంచాయతీ పెట్టుకునే వాడు వస్తే గ్రామానికే నష్టమని హెచ్చరించారు. పథకాలు మంచిగా అందాలంటే మంచోడు సర్పంచికావాలని, ఆఫ్ ఇద్దునా, ఫుల్ ఇద్దునా అనే వాడిని ఎంచుకోవద్దని సూచించారు.


ఇవి కూడా చదవండి
విద్యార్థులను స్టాన్‌ఫోర్డ్ స్థాయికి తీసుకెళ్లాలి: సీఎం చంద్రబాబు
అనుభవాన్ని అంగట్లో కొనుక్కోలేం.. రో-కోతో పెట్టుకోవద్దు: రవిశాస్త్రి