Share News

CM Revanth Reddy: గో సంరక్షణకు.. ఎంత ఖర్చైనా వెనుకాడం

ABN , Publish Date - Jun 18 , 2025 | 04:35 AM

తెలంగాణలో గోవుల సంరక్షణకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనుకాడబోదని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. గోవుల సంరక్షణకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

CM Revanth Reddy: గో సంరక్షణకు.. ఎంత ఖర్చైనా వెనుకాడం

  • గోవుల సంరక్షణపై సమగ్ర విధానం రూపొందిస్తాం

  • ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ నియామకం

  • ముందుగా వేములవాడ, యాదగిరి గుట్ట, ఎనికేపల్లి,

  • పశుసంవర్ధక శాఖ వర్సిటీ సమీపంలో పెద్ద గోశాలలు

  • వేములవాడలో 100 ఎకరాలకు తగ్గకుండా నిర్మాణం

  • గోసంరక్షణపై అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గోవుల సంరక్షణకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనుకాడబోదని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. గోవుల సంరక్షణకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించారు. గోవుల సంరక్షణ కోసం వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని ఈ కమిటీని కోరారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఈ కమిటీలో ఉన్నారు. గో సంరక్షణపై రేవంత్‌ రెడ్డి మంగళవారం సాయంత్రం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలకు భక్తులు పెద్ద సంఖ్యలో గోవులను దానం చేస్తున్నారని, కానీ వాటి సంరక్షణకు తగినంత స్థలం లేకపోవడం, ఇతర సమస్యలతో అవి ఎక్కువ సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలో తొలుత నాలుగు ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సీఎం ఆదేశించారు.


వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్‌ నగర సమీపంలోని ఎనికేపల్లి, పశుసంవర్ధక శాఖ విశ్వవిద్యాలయం సమీపంలోని విశాల ప్రదేశాల్లో తొలుత గోశాలలు నిర్మించాలన్నారు. వేములవాడలో కోడెల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబర్చాలని సీఎం సూచించారు. వేములవాడ సమీపంలో వంద ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలన్నారు. అనంతరం రాష్ట్రంలో గోశాలల నిర్వహణకు సంబంధించిన విధానపత్రాన్ని అధికారులు సీఎంకు అందజేశారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సీఎంవో ముఖ్య కార్యదర్శులు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ గోపి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.


సీఎంను కలిసిన మంత్రి వివేక్‌

సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రి వివేక్‌ వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. కుటుంబ సమేతంగా సీఎంను కలిసిన ఆయన.. తనను మంత్రిని చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.


ఇవి కూడా చదవండి

సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం

ఇది హేయమైన చర్య.. కేటీఆర్ సిగ్గుతో తలదించుకో: మహేష్ కుమార్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 18 , 2025 | 04:35 AM