CM Revanth Reddy Support for Sudarshan Reddy: నక్సలిజం ఓ ఫిలాసఫీ
ABN , Publish Date - Sep 02 , 2025 | 02:20 AM
నక్సలిజం అనేది ఒక భావజాల(ఫిలాసఫీ)మని, అది నచ్చనప్పుడు వాదించి గెలవాలే తప్ప దాడి చేసి, అంతం చేస్తానంటే కుదరదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియా కూటమి తరఫున బరిలో ఉన్న ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నక్సలైట్ అంటూ...
ఆ భావజాలం నచ్చకపోతే వాదించి గెలవాలి కానీ.. దాడి చేసి అంతం చేస్తామంటే కుదరదు
ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తెలుగు బిడ్డ
ఆయన విజయం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలు కృషి చేయాలి
సుదర్శన్‌రెడ్డి అభినందన కార్యక్రమంలో సీఎం రేవంత్
హైదరాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): నక్సలిజం అనేది ఒక భావజాల(ఫిలాసఫీ)మని, అది నచ్చనప్పుడు వాదించి గెలవాలే తప్ప దాడి చేసి, అంతం చేస్తానంటే కుదరదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియా కూటమి తరఫున బరిలో ఉన్న ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నక్సలైట్ అంటూ ఓ జాతీయ నాయకుడు మాట్లాడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీపీఐ అగ్రనేత నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నీలం సంజీవరెడ్డి , వీవీ గిరి, పీవీ నరసింహరావు, జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు, ఎన్‌టీ రామారావు లాంటి తెలుగు నేతలు గతంలో జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రస్తుతం తెలుగు నాయకులు జాతీయ రాజకీయాల్లో అంత కీలకంగా లేరన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి అవకాశం వచ్చిందని, తెలుగువారి గౌరవం పెరిగేలా అంతా ఒక తాటిపైకి వచ్చి ఆయనకు అండగా నిలవాలని కోరారు. ఎంపీలు ఆత్మప్రభోధానుసారం ఓటు వేసి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని గెలిపించాలని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల అధ్యక్షులు చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్, వైఎస్ జగన్, కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీలను, ఇరు రాష్ట్రాలకు చెందిన చెందిన 42 మంది లోక్‌సభ, 18 మంది రాజ్యసభ సభ్యులకు వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారు. ‘‘జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వివిధ హోదాల్లో రాజ్యాంగ స్పూర్తితో పనిచేశారు. ఆయన ఏ రాజకీయ పార్టీకీ సంబంధించిన వ్యక్తి కాదు. ఆయనకు అందరూ మద్దతు ఇవ్వాలి’’ అని కోరారు. ఆత్మప్రభోధానుసారం తనకు ఓటేయాలంటూ దేశంలోని ఎంపీలకు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రాసిన లేఖను సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు ఆవిష్కరించారు.

ఎన్నికను వదిలేసి పోతాననుకున్నారు
ఇదే కార్యక్రమంతోపాటు.. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్-ద-ప్రె్‌స’లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘నేను సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఇచ్చిన తీర్పులపై విమర్శలు చేస్తే ఎందుకు వచ్చిన బాధ అనుకుని ఈ ఎన్నికను వదిలేసి పోతాననుకున్నారు. కానీ నేను ఆ సవాలును స్వీకరించాలని నిర్ణయించుకున్నాను’’ అని అమిత్‌షాను ఉద్దేశించి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పులో తాను ఎక్కడైనా నక్సలిజాన్ని సమర్థించినట్లుగా ఉంటే.. శిరసు వంచుకుంటానన్నారు. సుప్రీంకోర్టు తీర్పును విరమ్శించేప్పుడు ఆ తీర్పును చదివి మాట్లాడాలన్నారు. తనకంటే ముందు.. తర్వాత 11 మంది న్యాయమూర్తులు సల్వాజుడుంపై కేసును విచారించారని తెలిపారు. మరోవైపు, ఉపరాష్ట్రపతి ఎన్నికలో తన ప్రత్యర్థి ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదని, ఎక్కడా కనపడట్లేదని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. తాను కాంగ్రెస్ అభ్యర్థిని కాదని, విపక్షాల అభ్యర్థినని.. ఓటు వేసే ముందు ఎంపీలు.. ఆలోచిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును వీలైతే కలిసి మద్దతు కోరతానని చెప్పారు. పార్లమెంట్‌తోపాటు.. మీడియాపైనా అధికార పార్టీ హుకుం చలాయిస్తోందని, లోక్‌సభలో ప్రశ్నిస్తే.. ‘‘బైఠో.. బొహుత్ హోగయా’’అని హుంకరిస్తున్నారని, మీడియాను తాము చెప్పిందే రాసుకోవాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఎన్నికల సంఘం ‘స్వేచ్ఛగా.. సజావుగా’ వ్యవహరించేదని, నేడు అధికార పక్షానికి అనుకూలంగా మారిందని మండిపడ్డారు. బ్రిటి్‌షకాలంలో అన్నివర్గాలకు ఓటుహక్కు ఉండేది కాదని, ఇప్పుడు ఓట్ల తొలగింపుతో లబ్ధిపొందాలనిచూస్తున్నారని మండిపడ్డారు. ‘‘అలాంటప్పుడు బ్రిటీష్ సామ్రాజ్యంలో ఉంటే ఏమిటి? స్వతంత్ర దేశంలో ఉంటే ఏంటి?’’ అని ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News