CM Revanth Reddy: పడవకు చిల్లు పడితే.. అందరమూ మునుగుతాం
ABN , Publish Date - Feb 07 , 2025 | 03:22 AM
‘‘పడవకు రంధ్రం పడితే దాన్ని నడిపేవాడే కాదు.. ఆ పడవలో కూర్చున్న అందరూ మునుగుతారు. అలాగే పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వమూ బలంగా ఉంటుంది. అందరం కలిసికట్టుగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది’’ అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

పార్టీ లైన్ దాటొద్దు.. ఐక్యంగా ఉంటేనే బలం
ఏవైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి
కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మకం
ఈ విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి
నిధుల కొరత ఉన్నా చాలా సాధించాం
చేసింది ప్రజలకు చెప్పుకోలేక పోతున్నాం
మండలాల వారీగా కార్యక్రమాలు చేపట్టాలి
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం నిర్దేశం
కుల గణనపై సూర్యాపేటలో బహిరంగ సభ
వర్గీకరణపై గజ్వేల్ లేదా నర్సాపూర్‌లో!
రాహుల్, ఖర్గేను పిలిచేందుకు ఢిల్లీకి సీఎం
మరో 3 రోజుల్లో పీసీసీ కార్యవర్గం: మహేశ్
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘‘పడవకు రంధ్రం పడితే దాన్ని నడిపేవాడే కాదు.. ఆ పడవలో కూర్చున్న అందరూ మునుగుతారు. అలాగే పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వమూ బలంగా ఉంటుంది. అందరం కలిసికట్టుగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది’’ అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎవరూ పార్టీ లైన్ దాటొద్దని, క్రమశిక్షణతో మెలగాలని.. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో హెచ్చరించారు. ‘‘రాజకీయాల్లో నమ్మకమే ప్రధానం. నమ్మకంతో పనిచేస్తేనే ప్రజలు విశ్వసిస్తారు. ఫలితమూ దక్కుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడూ నాయకుని ఆలోచనా విధానం గురించి తెలుసుకుని పనిచేయాలని.. రాహుల్‌గాంధీ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకునే రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను తీసుకున్నామని రేవంత్ గుర్తుచేశారు. ఈ నిర్ణయాలతో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇక మీదట తరచుగా కలుస్తూ ఉందామని, సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. అలాగే ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలపై క్యాబినెట్ అనుమతి లేకుండా ఎవరూ అడ్డగోలు ప్రకటనలు చేయవద్దని హెచ్చరించారు. అలాంటినిర్ణయాలను.. మంత్రివర్గం నిర్దేశించినవారు మాత్రమే ప్రకటించాలన్నారు. సమగ్ర కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మక నిర్ణయాలని.. దేశంలోనే మొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం వాటిని చేపట్టిందని సీఎం ఈ భేటీలో పేర్కొన్నారు. నిధులకు కొరత ఉన్నా.. రైతు రుణమాఫీ అమలు, సన్న వడ్లకు బోనస్, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు, రూ.500కే వంట గ్యాస్, రైతు భరోసా తదితర పథకాలనూ అమలు చేస్తూ వస్తున్నామన్నారు. ‘‘ఏడాది పాలనలో మనం సాధించింది తక్కువేం కాదు. అయితే.. చేసింది ప్రజలకు చెప్పుకోలేక పోతున్నాం. చేసింది చెప్పుకోవడానికి మొహమాట పడాల్సిన అవసరం లేదు. దూకుడుగా ముందుకు వెళదాం’’ అన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలతో పాటు ఏడాదిలో అమలు చేసిన కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ఇందుకోసం మండలాలస్థాయిలో అంబేడ్కర్ విగ్రహాల నుంచి పెద్ద ఎత్తున ర్యాలీలు తీయాలని సూచించారు. కొత్త ఎమ్మెల్యేలు మొదటిసారి గెలవడం తేలికేనని, ప్రజలతో మమేకమైతేనే రెండోసారి గెలుస్తారని పేర్కొన్నారు.
సభలు పెట్టి చెబుదాం..
కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలపై నెలాఖరులోగా రాష్ట్రంలో రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కులగణన సర్వేపై సూర్యాపేటలో లక్షలాది మందితో.. ఎస్సీ వర్గీకరణపై గజ్వేల్ (లేదా) నర్సాపూర్‌లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ సభలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళుతున్నామన్నారు. దేశంలోనే తొలిసారి కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసిన తీరు గురించి రాహుల్‌కు, ఖర్గేకు వివరించనున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేల్లో పలువురు.. తీన్మార్ మల్లన్న వ్యవహారశైలిని తప్పుబట్టారు. పార్టీ లైన్ దాటి మాట్లాడిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇక.. రైతు రుణమాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నా వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోతున్నామని పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు ఆవేదన వెలిబుచ్చారు. స్థానిక ఎన్నికల్లో బలహీన వర్గాలకు 42 శాతం టిక్కెట్లు ఇస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన హర్షణీయమని.. దీనివల్ల ఆ వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లభిస్తుందని జీవన్‌రెడ్డి అన్నారు. రైతు భరోసా సహా వివిధ కార్యక్రమాలకు, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు త్వరిత గతిన నిధులు విడుదల చేస్తామని పార్టీ ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో.. సర్కారు చేసిన పనులన్నింటినీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. శాస్త్రీయంగా కులగణన సర్వే జరిగిన తీరు గురించి మంత్రి ఉత్తమ్ వివరించగా.. ఎస్సీ వర్గీకరణ జరిగిన తీరు గురించి మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే దాని అమలుకు సంబంధించి శాసనసభలో ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. వర్గీకరణ అమల్లోకి వచ్చిన తర్వాతనే రిక్రూట్‌మెంట్లూ చేపడతామని చెప్పారని గుర్తుచేశారు.
ఆ నలుగురు తప్ప..
స్పీకర్ ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, వాకాటి శ్రీహరి, దొంతి మాధవరెడ్డి మినహా ఈ సమావేశానికి అందరు ఎమ్మెల్యేలూ హాజరయ్యారు. రాని వారు వ్యక్తిగత కారణాలతోనే హాజరు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పదిమంది హాజరు కాలేదు. కులగణన సర్వేకు సంబంధించి ప్రభుత్వంపై విమర్శలు చేసిన తీన్మార్ మల్లన్న కూడా రాలేదు. కాగా.. ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ తదితరులూ వెళ్లారు. రాహుల్‌ను, ఖర్గేను కలిసి కులగణన, ఎస్సీ వర్గీకరణ సభలకు రావాలని ఆహ్వానించనున్నారు.
మరో మూడు రోజుల్లో పీసీసీ కార్యవర్గం: మహేశ్‌కుమార్ గౌడ్
మరో మూడు రోజుల్లో టీపీసీసీకి నూతన కార్యవర్గం ఏర్పాటు కానున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. కార్యవర్గం కూర్పునకు సంబంధించి.. గురువారంనాటి సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించే కార్యాచరణనూ సూచించామన్నారు. కులగణన శాస్త్రీయంగా జరిగినా బీసీ సంఘాలను ప్రతిపక్షం తప్పుదోవ పట్టిస్తోందని.. ఈ నేపథ్యంలో వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిందిగా సూచించామని తెలిపారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారి నోళ్లు మూయించేలా ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. బీజేపీతో బీఆర్‌ఎ్‌సకున్న లోపాయికారీ ఒప్పందాన్ని బలోపేతం చేసుకునేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లినట్లు తమకు అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News