CM Revanth Reddy: ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతావా?
ABN , Publish Date - May 30 , 2025 | 04:15 AM
యుద్ధం చేయాలంటూ వీర తిలకం దిద్దితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడని యుద్ధం విరమించడం.. బుద్ధిమంతుడికి సద్ది కడితే బొడ్రాయి కాడ భోంచేసి బోర్లబొక్కల పడుకున్న చందంగా ఉంది.
అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు?
భారతీయుల ఆత్మగౌరవం ట్రంప్ దగ్గర తాకట్టు
హైదరాబాద్ తయారీ క్షిపణులే దేశ గౌరవాన్ని నిలిపాయి
మోదీ ఇతర దేశాల్లో కొన్న రాఫెల్స్‌ను పాక్ కూల్చేసింది
ఎన్నికల లబ్ధి కోసమే తిరంగా ర్యాలీ.. మోదీ చెల్లని నాణెం
జైహింద్ ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు
హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల మే 29 (ఆంధ్రజ్యోతి): ‘‘యుద్ధం చేయాలంటూ వీర తిలకం దిద్దితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడని యుద్ధం విరమించడం.. బుద్ధిమంతుడికి సద్ది కడితే బొడ్రాయి కాడ భోంచేసి బోర్లబొక్కల పడుకున్న చందంగా ఉంది’’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘మోదీ కాలం చెల్లిన నాణెం.. రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటోడు. ఆయన వల్ల దేశ గౌరవం నిలబడదు. ఆయన ఈ దేశాన్ని యుద్ధంలో గెలిపించడు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఓవైపు పాక్‌ను మరోవైపు చైనాను ఓడించి ప్రపంచ దేశాల ముందు భారత్‌ను నిలబెడతారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధమైనా.. దేశభద్రత అయినా బీజేపీకి రాజకీయమేనని ఆరోపించిన సీఎం.. ఎన్నికల లబ్ధి కోసమే మోదీ తిరంగా ర్యాలీ పేరుతో బయలుదేరి రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘యుద్ధంలో చనిపోయిన సైనికుల కోసం ఆలోచించారా? పహల్గాం బాధితుల గురించి.. పాకిస్థాన్ దాడిలో కశ్మీర్‌లో చనిపోయిన పౌరుల గురించి ఆలోచించారా? దేనికోసం తిరంగా ర్యాలీ చేస్తున్నారు?’’ అని ఘాటుగా ప్రశ్నించారు. ఏఐసీసీ ఆదేశం మేరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లిలో గురువారం ‘జైహింద్ ర్యాలీ’ నిర్వహించిన సీఎం.. దేశ సైనికుల ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

బాచుపల్లిలో వీఎన్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకూ సాగిన ర్యాలీలో సీఎంతోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. ‘‘దేశభద్రతకు సంబంధించిన అంశాల్లో రాజకీయాలకతీతంగా మనమంతా కలిసి ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు అని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ, ఖర్గే మాకు ఉద్బోధించారు. దేశం మీద, పౌరుల మీద దాడి చేసినప్పుడు ప్రధానికి అండగా నిలబడి.. ‘యుద్ధం చేయండి, మీ నిర్ణయాలను సమర్థిస్తామ’ని ఆనాడు అఖిలపక్షంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. నాలుగు రోజుల తర్వాత ఎవరికి ఎవరు లొంగిపోయారో తెలియదు కానీ అర్ధాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటికి వచ్చి ‘యుద్ధాన్ని ఆపేసినా.. భారత్‌ను బెదిరించినా’ అనే పరిస్థితి వచ్చింది’’ అని సీఎం ధ్వజమెత్తారు. పాకిస్థాన్ మనపై దాడి చేసినప్పుడు యుద్ధం చేయడానికి అఖిలపక్షంతో చర్చించిన మోదీ.. యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిలపక్ష భేటీ నిర్వహించలేదని నిలదీశారు. ‘‘ఇది నీ సొంత వ్యవహారం కాదు.. మీ పార్టీ వ్యవహారం కాదు. దేశ భద్రతకు సంబంధించిన విధానం. యుద్ధం విరమించడం ద్వారా 140కోట్ల భారతీయుల ఆత్మ గౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టి, గొప్పల కోసం బీజేపీ వాళ్లు ఉపన్యాసాలిస్తున్నారు’’ అని విమర్శించారు. దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదన్నారు. భారత సైన్యం విజయవంతంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందని, రాజకీయాలకు అతీతంగా తాము మద్దతిచ్చామని సీఎం గుర్తుచేశారు.
నాడు ఇందిర తెగువ..
‘‘నాయకత్వం అంటే ఆషామాషి కాదు.. యుద్ధం అంటే ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు. యుద్ధం అంటే ధైర్యం ఉండాలి. యుద్ధతంత్రం ఉండాలి. యుద్ధనీతి ఉండాలి. గుండె ధైర్యం ఉండాలి. గుండెలో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడు. చైనా అతి తెలివితేటలు ప్రదర్శిస్తే 1967లో ఆ దేశంతో (నాథులా పాస్ వద్ద) జరిగిన సంఘర్షణలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చైనాను ఓడించి ప్రపంచ దేశాలకు సందేశాన్నిచ్చారు’’ అని వ్యాఖ్యానించారు. మోదీ హయాంలో గల్వాన్‌లో మన కర్నల్ సంతో్‌షను పొట్టన పెట్టుకుంటే ఏమీ చేయలేకపోయామని ఆవేదన వెలిబుచ్చారు. 1971లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బెదిరించినా.. నాటి ప్రధాని ఇందిర వెరవలేదని, పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేశారని గుర్తుచేశారు. పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో హైదరాబాదులో తయారుచేసిన క్షిపణులే దేశ గౌరవాన్ని నిలబెట్టాయని.. మోదీ వేరే దేశం నుంచి కొన్న రాఫెల్ యుద్ధ విమానాలను పాక్ కూల్చేసిందని వ్యాఖ్యానించారు.
అనేక మంది కాంగ్రెస్ పెద్దలు దేశం కోసం ఆత్మ బలిదానాలు చేశారని ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. పహల్గాం కాల్పుల వెనుక ఉన్నవారిని ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోలేదని.. కాల్చిన ఉగ్రవాదులు ఎక్కడున్నారో సమాచారం ఎందుకు సేకరించట్లేదని నిలదీశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించే సమయమే మోదీకి లేదని ధ్వజమెత్తారు. దేశంకోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై బీజేపీ చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. 1971 యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ చూపిన తెగువ, స్ఫూర్తిని నేటి ప్రధాని కొనసాగించలేకపోయారని.. ట్రంప్ చెబితే కాల్పుల విరమణ చేసే పరిస్థితి ఇప్పటి కేంద్ర సర్కారుదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు. పాక్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని మోదీ వెనుకడుగు వేశారని విమర్శించారు. రాహుల్ గాంధీని విమర్శించడం ద్వారా బీజేపీ నాయకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్
గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే
Read Latest Telangana News And Telugu News