Share News

CM Revanth Reddy: కిషన్‌రెడ్డి సైంధవుడు

ABN , Publish Date - Mar 01 , 2025 | 03:44 AM

తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా సైంధవుడిలా అడ్డుపడుతున్నారని అన్నారు.

CM Revanth Reddy: కిషన్‌రెడ్డి సైంధవుడు

  • తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు

  • వాళ్ల కేసీఆర్‌ దిగిపోయారని బాధపడుతున్నారు

  • ఆయన అడ్డుపడటం వల్లే మెట్రోరైలు ప్రాజెక్టు ఆగింది

  • ఆర్‌ఆర్‌ఆర్‌ను కేంద్ర క్యాబినెట్‌లో రాకుండా చేస్తున్నరు

  • ఏపీలో ముస్లిం కోటా రద్దు చేయించే ధైర్యముందా?

  • కేంద్ర మంత్రిపై సీఎం రేవంత్‌ ఫైర్‌.. బహిరంగ లేఖ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా సైంధవుడిలా అడ్డుపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు తెప్పించాల్సిందిపోయి.. ఆయా అంశాలు కేంద్ర క్యాబినెట్‌లో చర్చకు రాకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. వారికి కావాల్సిన వ్యక్తి అయిన కేసీఆర్‌ అధికారం నుంచి దిగిపోయారనే బాధతోనే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం పట్ల ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి వెంటనే అనుమతులు తీసుకురావాలని సవాల్‌ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడటంతోపాటు కిషన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ‘‘ కేంద్ర ప్రభుత్వ అనుమతుల విషయంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతున్న విధానం చూస్తుంటే.. ప్రధాని మోదీ గుజరాత్‌ నుంచి రైళ్లు, విమానాలు, లారీల్లో నోట్ల కట్టలను తెలంగాణకు పంపిస్తున్నారని బాధపడి పోతున్నట్లుగా ఉంది. మోదీ ఆస్తిని, మీ ఆస్తిని మేము అడగడం లేదు. రాష్ట్రం నుంచి మేం కట్టిన పన్నుల్లో తగిన వాటా ఇవ్వాలని మాత్రమే కోరుతున్నాం. మీరు(కిషన్‌రెడ్డి) అడ్డుపడడం వల్లే మెట్రో రైలు ఆగింది. మూసీకి నిధులడిగితే అవహేళన చేస్తున్నాడు, మూసీ నది వద్ద నిద్ర చేస్తానంటున్నాడు. గుజరాత్‌లో నర్మదా, ఉత్తరప్రదేశ్‌లో గంగానదిని వాళ్లు ప్రక్షాళన చేసుకోవచ్చు. ఢిల్లీ ఎన్నికల్లో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. ఆ రాష్ట్రాలకు ఒక నీతి, తెలంగాణకు మరో నీతా? కిషన్‌రెడ్డి నూటికి నూరు శాతం సైంధవ పాత్ర పోషిస్తున్నాడు. బీజేపీ జాతీయ మండలి సమావేశానికి వచ్చినప్పుడు తెలంగాణకు 360 కిలోమీటర్ల రీజినల్‌ రింగు రోడ్డును ఇచ్చానని నరేంద్రమోదీ ప్రకటించిన మాట వాస్తవమా? కాదా?’’ అని సీఎం రేవంత్‌ అన్నారు.


ఆర్‌ఆర్‌ఆర్‌కు క్యాబినెట్‌ ఆమోదమే లేదు..

ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు ఈరోజు వరకూ క్యాబినెట్‌ ఆమోదమే పొందలేదని సీఎం అన్నారు. దాంతో ఉత్తర భాగానికి టెండరు పిలిచినా తేదీలు వాయిదా పడుతున్నాయన్నారు. ‘‘మెట్రోకు, రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు తానే కృషి చేశానని కిషన్‌రెడ్డి అంటున్నాడు. మరి.. కేంద్ర మంత్రిగా ఆరేళ్లుగా పని చేస్తూ ఈ రెండు అంశాలను కేంద్ర క్యాబినెట్‌ ఎజెండాలో ఎందుకు పెట్టడంలేదు? ఎజెండాలో పెట్టకుండా సంబంధిత మంత్రులపై ఒత్తిడి తెస్తున్నది ఎవరు? నేను ఢిల్లీకి వెళ్లి ఇవే అంశాలపై కిషన్‌రెడ్డికి వినతి పత్రాలు ఇచ్చి వచ్చాను. డీపీఆర్‌లతో సహా అన్ని వివరాలను అందజేశాం. మోదీతో మాట్లాడి వీటిని క్యాబినెట్‌ ఎజెండాలో పెట్టించాలని కోరాం. మీరు తెచ్చిన ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పండి. మీరు బెదిరిస్తే.. బెదిరేవారు ఎవరూ లేరు. సెమీ కండక్టర్ల ఫ్యాక్టరీ తెలంగాణకు వస్తుంటే.. దానిని బెదిరించి గుజరాత్‌కు తీసుకెళ్లావు. ఉత్తరప్రదేశ్‌కు, అసోంకు ఇచ్చారు. తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. కేంద్రం నుంచి అదనంగా ఒక్క రూపాయి కూడా రాలేదు. రావాల్సిన నిధులు మాత్రమే వచ్చాయి. పదుల సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిశాం. మీరు ఇన్నిసార్లు వస్తున్నారు కానీ.. మీ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఒక్కసారి కూడా వీటి గురించి మాట్లాడడం లేదని ఆ మంత్రులను అంటున్నారు’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.


ఏనాడైనా తెలంగాణ కోసం అడిగావా?

‘‘ఆరేళ్ల కేంద్ర మంత్రిగా తెలంగాణకు ఏదైనా కావాలని ప్రధాని మోదీని అడిగారా? కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏనాడైనా ప్రస్తావించారా? పార్లమెంటు సమావేశాల్లోనైనా మాట్లాడారా? మీకు చిత్తశుద్ధి లేదు. మీ కేసీఆర్‌ దిగిపోయాడన్న బాధలో మాకు అడ్డం పడుతున్నారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు బండి సంజయ్‌... ఆటోలు పోతే ఆటోలు ఇస్తాం, లారీలు పోతే లారీలు ఇస్తాం, బైక్‌ పోతే బైక్‌ ఇస్తామన్నాడు. ఇచ్చింది గుండు సున్నానే. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014లో మోదీ చెప్పారు. ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు? ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామన్నారు. ఎన్ని ఇళ్లు ఇచ్చారు? రాష్ట్రంలో బీసీ కులగణన చేపడితే.. బీసీల్లో మైనారిటీలను చేర్చినందున.. బీసీ రిజర్వేషన్ల బిల్లును తిరస్కరిస్తామని, రద్దు చేస్తామని అంటున్నారు. గుజరాత్‌లో 29 ముస్లిం ఉప కులాలు బీసీ రిజర్వేషన్లను అనుభవిస్తున్నాయి. బిహార్‌లో 26 ముస్లిం బీసీ కులాలు రిజర్వేషన్లను అనుభవిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో కూడా ఉన్నాయి. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. వీటిని మండల్‌ కమిషన్‌ సిఫారసు చేసింది. దూదేకుల, నూర్‌బాషా వంటి బీసీ కులాలు ఉన్నాయి. కుల గణన జరిగితే అధికారం కోల్పోతామనేభయంతో కిషన్‌రెడ్డి బీసీ కుల గణనపై అడ్డం పడుతున్నాడు. మా మందకృష్ణ మాదిగను బాగానే కౌగిలించుకున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేయడం లేదు? పక్క రాష్ట్రంలో బీసీల్లోని ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను చంద్రబాబును డిమాండ్‌ చేసి రద్దు చేసే ధైర్యముందా?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు.


బెదిరిస్తామంటే కుదరదు..

కేంద్రంలో వారి ప్రభుత్వం ఉన్నందున బెదిరిస్తామని కిషన్‌రెడ్డి అనుకుంటున్నారని, కానీ.. ఈ విధానం ఎక్కువ కాలం నడవదని సీఎం రేవంత్‌ అన్నారు. ‘‘బాధ్యత గల సీఎంగా ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులు ఇవ్వాలని అడగుతున్నాం. ఒక్క రోజన్నా మాతో కలిసి వచ్చావా? మెట్రోలో రెండో స్థానంలో ఉండే హైదరాబాద్‌ ఇప్పుడు తొమ్మిదో స్థానానికి పడిపోయింది. నిర్మలా సీతారామన్‌ తమిళనాడు మెట్రోకు అనుమతి ఇప్పిస్తారు కానీ... కిషన్‌రెడ్డి తెలంగాణకు ఇప్పించరు. అవసరమైతే... ప్రధానికి ఇచ్చిన అన్ని వివరాలను, డీపీఆర్‌లను కిషన్‌రెడ్డి ఇస్తా. ఎప్పటిలోగా వీటికి కిషన్‌రెడ్డి అనుమతులు తెస్తారో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. బీసీ కులాలు, ఎస్సీ కులాల కోసం మేము చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించడం ఇష్టం లేకపోతే... వదిలేయండి. బీఆర్‌ఎ్‌సను ఓడిస్తామంటూ ప్రగల్బాలు పలికే మీరు.. కులగణనలో పాల్గొనని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావును ఒక్కరోజైనా డిమాండ్‌ చేశారా? మీ ఇద్దరి పీఆర్వోలు ఒక్కరే కదా? తప్పు తప్పు అంటున్నారు. ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలి కదా ? మీకు ఏ వివరాలు కావాలన్నా... కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ సెక్రటరియేట్‌కు రండి. అన్ని వివరాలు చూపిస్తాం. బీసీ కులాలకు అన్యాయం జరగాలని కిషన్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు కుదరవు. బీఆర్‌ఎస్‌, బీజేపీ చీకటి ఒప్పందాన్ని, వాళ్లు తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తాం’ అని రేవంత్‌ అన్నారు.


రాష్ట్రంపై మీ ముద్ర ఏదీ?

రాష్ట్రం నుంచి కేంద్ర క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం వహించిన జైపాల్‌రెడ్డి హైదరాబాద్‌కు మెట్రో రైలు, వెంకటస్వామి సింగరేణి కార్మికులకు పింఛన్‌ వంటి సౌకర్యాలు తెచ్చి.. తమవంతు ముద్ర వేశారని సీఎం రేవంత్‌ తెలిపారు. కానీ, కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి తెలంగాణ కోసం చేసిందేంటని, రాష్ట్రంపై ఆయన ముద్ర ఏముందని ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో ప్రాజెక్టులపై ప్రధానమంత్రిని, కేంద్రమంత్రులను, మిమ్మల్ని కూడా కలిసి, అన్నీ వివరించిన తర్వాత కూడా అవగాహన రాహిత్యంతో సీఎం మాట్లాడుతున్నారని మీరు మాట్లాడటం బాధ్యతారాహిత్యం. కేంద్రమంత్రిగా ఉంటూఏ ఒక్కటీ సాధించలేని మీరు, ఒత్తిడితో మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదు. తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు అనుమతులు సాధించినిధులు మంజూరు చేయించడం కేంద్రమంత్రిగా మీ నైతిక బాధ్యత’’ అని సీఎం అన్నారు.


ప్రత్యేక శ్రద్ధ వహించాలి..

‘‘హైదరాబాద్‌ చరిత్ర, సంస్కృతితో ముడిపడి ఉండడంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే మూసీ నది పునరుజ్జీవంపైనా మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టుకు సహకరించాలని 2024 జూలై 22న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసి లేఖ అందజేశాం. మీతోపాటు, తాజాగా ప్రధాని మోదీకి లేఖ అందజేశా. సబర్మతి, గంగానది పునరుజ్జీవంపై మీరు పలుమార్లు ప్రకటనలు చేశారు. పత్రికల్లో వ్యాసాలు రాశారు. కానీ, తెలంగాణలో మూసీ నది పునరుజ్జీవంపై విషం చిమ్ముతున్నారు. ఇది పూర్తిగా ద్వంద్వ వైఖరి. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం 2024 ఫిబ్రవరి 20, జూన్‌ 26న, డిసెంబరు 12 జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమై ప్రాధాన్యాన్ని వివరించాను. ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని చేపట్టాలని కోరాను. ఒకేసారి రెండు భాగాలు పూర్తికాకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొనే వ్యయప్రయాసలను వివరించాను. ఆ తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఉత్తర భాగానికి టెండర్లు పిలిచింది. కానీ, కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం లభించకపోవడంతో టెండర్లను మళ్లీ పొడిగించాల్సి వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌ అనుమతులు, మంజూరుకు (రూ.34,367.62 కోట్లు) సంబంధించిన వివరాలను, ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు రేడియల్‌ రోడ్ల నిర్మాణంపై (రూ.45 వేల కోట్లు) వివరించి మీకు లేఖ అందజేశా. తాజాగా ప్రధానికి లేఖ అందజేశా. ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా రీజినల్‌ రింగ్‌ రైలు నిర్మించాలని లేఖ అందజేశా. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ సమీపంలో నిర్మించనున్న డ్రైపోర్ట్‌ను ఆంధ్రప్రదేశ్లోని బందరు పోర్ట్‌కు అనుసంధానించేలా గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి నిర్మించాలని గడ్కరీని కలిసిన ప్రతిసారీ కోరాను. వీటితో హైదరాబాద్‌ సీవరేజీ మాస్టర్‌ ప్లాన్‌ (రూ.17,212.69 కోట్లు), వరంగల్‌ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ప్లాన్‌ (4,170 కోట్లు)కు సంబంధించి మీతో చర్చించాను. మొత్తంగా తెలంగాణ రాష్ర్టానికి సంబంధించి రూ.1,63,559.31 కోట్ల ప్రాజెక్టుల అనుమతులు, మంజూరుపై చర్చించి పూర్తి వివరాలతో మీకు లేఖను అందజేశాను అని గుర్తు చేశారు. ఇకనైనా మీరు ప్రాజెక్టుల అనుమతులు, నిధుల మంజూరుకు ప్రత్యేక శ్రద్థ వహించాలి’’ అని లేఖలో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Mar 01 , 2025 | 03:44 AM