Share News

CM Revanth Reddy: అన్నీ స్విగ్గీ పాలిటిక్స్‌!

ABN , Publish Date - Jul 27 , 2025 | 03:36 AM

ఒకప్పటి ఆదర్శవంతమైన రాజకీయాలు పోయి ఇప్పుడంతా స్విగ్గీ పాలిటిక్స్‌ వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమకు కావాల్సినది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ త్వరగా డెలివరీ చేస్తారని చూస్తున్నారే తప్ప సిద్ధాంతాల కోసం పాటుపడేవారు తగ్గిపోయారని పేర్కొన్నారు.

CM Revanth Reddy: అన్నీ స్విగ్గీ పాలిటిక్స్‌!

  • తమకు కావాల్సింది ఎక్కడ దొరుకుతుందనే చూస్తున్నారు

  • సిద్ధాంతాల కోసం పాటుపడే నేతలు తగ్గిపోయారు

  • మేనేజ్‌మెంట్‌ రాజకీయాలే నడుస్తున్నాయి

  • ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రమాదకరం

  • కార్యకర్తలు పోయి వలంటీర్ల వ్యవస్థ వస్తోంది

  • ప్రస్తుత రాజకీయాలపై సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు

  • జైపాల్‌రెడ్డి పురస్కారాల ప్రదానోత్సవంలో ప్రసంగం

  • పీవీ తర్వాత అంత గొప్ప రాజకీయాలు జైపాల్‌వే

  • తెలంగాణ ఏర్పాటులో ఆయన పాత్ర కీలకమని వెల్లడి

హైదరాబాద్‌/షాద్‌నగర్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఒకప్పటి ఆదర్శవంతమైన రాజకీయాలు పోయి ఇప్పుడంతా స్విగ్గీ పాలిటిక్స్‌ వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమకు కావాల్సినది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ త్వరగా డెలివరీ చేస్తారని చూస్తున్నారే తప్ప సిద్ధాంతాల కోసం పాటుపడేవారు తగ్గిపోయారని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక విలువలు తగ్గిపోయాయని... మేనేజ్‌మెంట్‌ రాజకీయాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో కార్యకర్తలు పోయి వలంటీర్‌ వ్యవస్థ వస్తోందని... కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్‌కు ప్రమాదకరమని చెప్పారు. సిద్ధాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సహేతుక సూచనలు చేస్తే తీసుకోవడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు శాసనసభ నుంచి ఎవరినీ సస్పెండ్‌ చేయలేదని రేవంత్‌ చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో క్యాపిటల్‌ ఫౌండేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ‘జైపాల్‌రెడ్డి మెమోరియల్‌ అవార్డుల’ ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అవార్డులను అందజేసి, మాట్లాడారు. దేశ రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి నిలువెత్తు శిఖరమని కొనియాడారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన వ్యక్తి జైపాల్‌రెడ్డి అని, చివరి శ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘‘జైపాల్‌రెడ్డి పెట్రోలియం శాఖ నిర్వహిస్తున్న సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.


సమాచార మంత్రిగా ఉన్న సమయంలో ప్రసార భారతి చట్టాన్ని దేశానికి అందించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర, మీడియా పాత్ర ఉండాలని ఆయన విశ్వసించారు. పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులపై ఎక్కువగా ఆలోచించేవారు. రాజకీయాలలో ధన ప్రవాహం తగ్గించాలని ప్రయత్నించారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్‌రెడ్డిది కీలక పాత్ర. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌ను ఒప్పించి తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించేలా ప్రత్యేక పాత్ర పోషించారు. జైపాల్‌రెడ్డి చొరవతోనే తెలంగాణ ఏర్పాటు చేశామని సోనియా గాంధీ ఒక సందర్భంలో నాతో చెప్పారు’’ అని రేవంత్‌ వెల్లడించారు. మన తెలంగాణ నేతలెవరూ ఈ విషయం చెప్పకపోయినా, పక్కరాష్ట్రం నేత ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పలుమార్లు ప్రస్తావించారని గుర్తుచేశారు. తెలుగు రాజకీయాల్లో పీవీ నర్సింహారావు తర్వాత మళ్లీ అంత గొప్ప రాజకీయాలు చేసింది జైపాల్‌రెడ్డి అని కొనియాడారు. పని చేసుకుపోవడమే తప్ప, గొప్పలు చెప్పుకొనే తత్వం జైపాల్‌రెడ్డిది కాదన్నారు. ఇప్పుడు ఉద్యమం చేశామని చెప్పుకొంటూ తిరుగుతున్నవారు ధర్నాచౌక్‌ ఎత్తివేసి ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం రాగానే ధర్నాచౌక్‌ను పునరుద్ధరించామని చెప్పారు. ఎవరైనా నిరభ్యంతరంగా నిరసన తెలపవచ్చని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. కాగా, ఈ రోజుల్లో రాజకీయ పార్టీలన్నీ ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసేలా నడుచుకుంటున్నాయని ఒడిశాకు చెందిన బీజేడీ రాజ్యసభ సభ్యుడు సస్మిత్‌పాత్ర పేర్కొన్నారు. పార్లమెంట్‌లో కూడా భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారని, సభ్యులతో చర్చించకుండానే బిల్లులని పాస్‌ చేస్తున్నారని ఆరోపించారు.


అధ్యాపకులు నిత్య విద్యార్థులు..

అధ్యాపకులు నిత్య విద్యార్థులని, వారు ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా విద్యార్థులకు బోధించాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద గ్రామానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సామ రవీందర్‌రెడ్డి రచించిన ఇండియన్‌ ఎకనామిక్‌ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. విద్యార్థులకు ఉపయోగపడేలా పుస్తకం రాశారని రవీందర్‌రెడ్డిని అభినందించారు.


ఆరోగ్య శ్రీలో 10.7 లక్షల మందికి వైద్యం: దామోదర రాజనర్సింహ

తాము వచ్చాక 10.70 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలందించామని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ప్రభుత్వానికి సహకరిస్తూ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్‌ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని దామోదర గుర్తు చేశారు. అలాగే సుమారు పదేళ్ల తర్వాత ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను సగటున 22 శాతం మేర పెంచామని తెలిపారు. నెట్‌వర్క్‌ హాస్పిటళ్లకు రూ.1,590 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించామని స్పష్టం చేశారు. షుగర్‌ పేషెంట్లకు ఇచ్చే మందులు, ఇన్సులిన్‌ లేవని సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


ఈవార్తలు కూడా చదవండి..

పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..

సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 27 , 2025 | 03:36 AM