Share News

Telangana Eco Town: తెలంగాణలో ఎకో టౌన్‌ నమూనా

ABN , Publish Date - Jun 03 , 2025 | 05:41 AM

జపాన్‌లోని కిటాక్యుషు నగరాన్ని ఆదర్శంగా తీసుకొని హైదరాబాద్‌లో 80 ఎకరాల్లో ఎకో టౌన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. జపాన్ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. తెలంగాణ యువతకు జపనీస్‌ భాష నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారిస్తున్నారు.

Telangana Eco Town: తెలంగాణలో ఎకో టౌన్‌ నమూనా

జపాన్‌లోని నమూనాను ఇక్కడ అభివృద్ధి చేస్తాం.. తెలంగాణ-కిటాక్యుషు మధ్య సహకార ఒప్పందం

హైదరాబాద్‌-కిటాక్యుషు మధ్య విమాన.. అనుసంధానం కోసం ప్రయత్నిస్తున్నాం

కిటాక్యుషు మేయర్‌తో భేటీలో సీఎం రేవంత్‌

రాష్ట్రంలో 80 ఎకరాల్లో ఎకోటౌన్‌: శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): జపాన్‌లోని కిటాక్యుషు నగరం తరహాలో హైదరాబాద్‌లో ఎకో టౌన్‌ నమూనాను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసమే అనేక జపాన్‌ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. సోమవారం కిటాక్యుషు నగర మేయర్‌ కజుహిసా టకేచీ ప్రతినిఽధి బృందంతో ఐటీసీ కాకతీయ హోటల్‌లో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, కిటాక్యుషూ మధ్య పరస్పర సహకార ఒప్పందాలు జరిగాయి. అనంతరం కిటాక్యుషు నగర మేయర్‌తో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కొత్త ప్రపంచ భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం ద్వారా రాష్ట్ర పురోగతిని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఏప్రిల్‌లో జపాన్‌ను సందర్శించినప్పుడు అక్కడి అభివృద్ధిని, పనితీరును చూడడంతోపాటు ఎకో టౌన్‌ మోడల్‌లో ఉన్న కిటాక్యుషూ నగరం నుంచి ఎంతో ప్రేరణ పొందినట్లు, ఆ ప్రేరణతోనే హైదరాబాద్‌లో ఎకోటౌన్‌ తరహా నమూనాను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణ, కిటాక్యుషు మధ్య కుదిరిన ఒప్పందం.. సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, సున్నా ఉద్గారాలు, పట్టణ ఆవిష్కరణల్లో సహకారానికి పునాది కానుందని పేర్కొన్నారు. మూసీనది అభివృద్ధి, పునరుజ్జీవ ప్రాజెక్టుపై తమ దృష్టి ఉందన్నారు. తెలంగాణ యువతకు నైపుణ్యం కల్పించడం తమ ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. రాష్ట్ర యువత జపనీస్‌ భాష నేర్చుకోవాలనుకుంటున్నారని, అదే సమయంలో జపాన్‌లో అవకాశాలను కోరుకుంటున్నారని సీఎం అన్నారు. జపాన్‌ ప్రభుత్వ సహకారంతో వారికి జపనీస్‌ నేర్పించాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. హైదరాబాద్‌- కిటాక్యుషు మధ్య విమాన ప్రయాణాలకు అనువుగా అనుసంధానం కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కిటాక్యుషు నగర అభివృద్ధి తెలంగాణ రైజింగ్‌కు సరిపోయేలా ఉందన్నారు.


రాష్ట్రంలో 80 ఎకరాల్లో ఎకో టౌన్‌..

భావితరాల అవసరాలకు అనుగుణంగా జపాన్‌లోని కిటాక్యుషు నగరం స్ఫూర్తితో రాష్ట్రంలో 80 ఎకరాల్లో ఎకో టౌన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. తెలంగాణ,కిటాక్యుషు నగరం మధ్య కుదిరిన పరస్పర సహకార ఒప్పందం ఇందుకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. సోమవారం టీహబ్‌లో రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ అనే లక్ష్యంతో అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని గ్లోబల్‌ లీడర్‌గా మార్చాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పమన్నారు. ఏడాదిన్నరలో రాష్ట్రానికి సుమారు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. రాష్ట్రంలో జపాన్‌ కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన 50 మంది యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు లభించాయని, మరింత మందికి దక్కేలా టాంకాం లాంటి ప్రభుత్వ సంస్థల ద్వారా జపనీస్‌ భాషను నేర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో సీఎస్‌ రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేశ్‌రంజన్‌, సీఎం కార్యదర్శి అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఈవో మధుసూదన్‌, సీఐఐ తెలంగాణ చైర్మన్‌ శివప్రసాద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఇవీ చదవండి:

కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్

పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 05:41 AM