BC Reservation: రిజర్వేషన్లపై ఢిల్లీకి
ABN , Publish Date - Jul 13 , 2025 | 03:49 AM
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీలో బిల్లు ఆమోదించుకుని షెడ్యూల్ 9లో చేర్చాలంటూ కేంద్రానికి పంపిన బిల్లులపై మరోమారు మోదీ సర్కారుతో చర్చించి, ఒప్పించేలా ప్రయత్నం చేస్తోంది.
దేశవ్యాప్త మద్దతు కూడగట్టేందుకు సీఎం ప్రయత్నం
16, 17 తేదీల్లో హస్తినలోనే రేవంత్‌రెడ్డి
రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం
రిజర్వేషన్లపై రాష్ట్ర ఎంపీలతోపాటు ఇండీ
కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
21న లేదా ఆ తరువాత ఒకటి, రెండు రోజుల్లో ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సదస్సు
పార్లమెంటులో మాట్లాడాలని ఎంపీలను కోరనున్న సీఎం
హైదరాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీలో బిల్లు ఆమోదించుకుని షెడ్యూల్ 9లో చేర్చాలంటూ కేంద్రానికి పంపిన బిల్లులపై మరోమారు మోదీ సర్కారుతో చర్చించి, ఒప్పించేలా ప్రయత్నం చేస్తోంది. అలాగే ఈ అంశానికి సంబంధించి ఇండియా కూటమి మద్దతును కూడగట్టనుంది. ఈ దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీ వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ నెల 16, 17వ తేదీల్లో సీఎం ఢిల్లీలోనే ఉండనున్నట్టు సమాచారం. ఈసారి పూర్తిగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపైనే అక్కడ చర్చలు, సమావేశాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. కేంద్రానికి పంపిన బిల్లులను ఆమోదించడంతోపాటు షెడ్యూల్ 9లో చేర్చాలనే అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా కలిసే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. ఈ సందర్భంగా బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాల్సిన అవసరం, సామాజిక వర్గాలవారీ వివరాలను వారికి తెలపనున్నారు. వీటితోపాటు రాష్ట్రంలో నిర్వహించిన కులగణన వివరాలను వారికి తెలియజేసి రిజర్వేషన్ల పెంపునకు అవకాశం కల్పించాలని కోరనున్నారు. ఈ నెల 21న ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. మరోవైపు రిజర్వేషన్ల పెంపునకు దేశవ్యాప్త మద్దతు కూడగట్టాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు సహా ఇండియా కూటమిలోని ఎంపీలతో ఆయన సమావేశమై రిజర్వేషన్ల పెంపు ఆవశ్యకతను వారికి వివరించనున్నారు. ఇందుకోసం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ప్రత్యేక సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు.
ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
ఈ నెల 21న పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఎంపీలంతా ఢిల్లీకి చేరుకోనున్నారు. దీంతో అవకాశం ఉంటే పార్లమెంటు ప్రారంభమైన రోజు, లేదా ఆ తరువాత ఒకటి, రెండు రోజుల్లో ఎంపీలకు రిజర్వేషన్ల వ్యవహారంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఆ తరువాత సభలో ఈ అంశాన్ని లేవనెత్తడంతో పాటు ప్రముఖంగా దీనిపై మాట్లాడాల్సిందిగా ఎంపీలను కోరనున్నారు. 16న ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా ఈ అంశాలన్నింటిపైనా కాంగ్రెస్ అధిష్ఠానానికి వివరించనున్నారు. ఇందుకోసం ఏఐసీసీ కీలక నేతలతో రేవంత్ భేటీ కానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రిజర్వేషన్ల నేపథ్యంలోనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ఆలస్యమవుతుండడంతో.. గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ తెచ్చుకుని, ప్రత్యేక జీవో ద్వారా రిజర్వేషన్లను పెంచుకోవాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఓవైపు రాష్ట్ర పరిధిలో చేయాల్సిన పనిని చేసుకుంటూనే.. మరోవైపు రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో రిజర్వేషన్ల పెంపు బిల్లులను చేర్చేలా సీఎం అడుగులు వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు
కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి