Share News

CM Revanth Reddy: శాసన సభకు పోటీ చేయడానికి 21 ఏళ్ల వయో పరిమితి చాలు

ABN , Publish Date - Aug 21 , 2025 | 03:54 AM

శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల వయస్సును 21 ఏళ్లుగా నిర్ణయిస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.

CM Revanth Reddy: శాసన సభకు పోటీ చేయడానికి 21 ఏళ్ల వయో పరిమితి చాలు

  • రాజీవ్‌ గాంధీ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌

  • రాజీవ్‌ కాలంలోనే ఆధునిక భారతానికి పునాది : భట్టి

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల వయస్సును 21 ఏళ్లుగా నిర్ణయిస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఓటు హక్కు పొందడానికి 21 ఏళ్లు నిండాలన్న నిబంధన ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీకి కనీస వయో పరిమితిని 25 ఏళ్లుగా నిర్ణయించారని తెలిపారు. ఆ తర్వాత ఓటు హక్కు పొందడానికి ఉండాల్సిన వయసును మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 18 ఏళ్లకు తగ్గించారని చెప్పారు. పార్లమెంటుకు పోటీకి 25 ఏళ్లు నిండాలన్న నిబంధన ఉన్నా.. శాసనసభకు పోటీ చేయడానికి నిండాల్సిన వయసును 21 ఏళ్లకు తగ్గించాలని అభిప్రాయపడ్డారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌ గాంధీ విగ్రహానికి మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి బుధవారం పుష్పాంజలి ఘటించిన అనంతరం రేవంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 21 ఏళ్లు నిండిన వారు శాసనసభలో ఉంటే దేశానికి ఎంతో మేలు జరుగుతుందని రేవంత్‌ ఈ సందర్భంగా అన్నారు.


ఇందుకోసం తెలంగాణ శాసనసభ ప్రయత్నిస్తుందని, రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యాక ఈ మేరకు శాసనసభలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, దేశ సమగ్రత కాపాడేందుకు ప్రాణాలర్పించిన రాజీవ్‌ గాంధీ దేశ యువతకు స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లకు పునాది వేసింది, దేశానికి కంప్యూటర్‌ పరిచయం చేసింది, టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది రాజీవ్‌గాంధీనేనని సీఎం ఈ సందర్భంగా అన్నారు. కాగా, రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని వీర్‌ భూమిలో రాజీవ్‌గాంధీ సమాధి వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాళులర్పించారు. రాజీవ్‌గాంధీ ఆధునిక భారతానికి పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, రఘురాం రెడ్డి, కడియం కావ్య, సురేశ్‌ షెట్కర్‌, గడ్డం వంశీకృష్ణ రాజీవ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్

హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 21 , 2025 | 03:54 AM