మాదిగలకు మేలే లక్ష్యం
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:07 AM
రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మాదిగలు, అందులోని ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగతో అన్నారు.

అందుకే ఎస్సీల వర్గీకరణ చేపట్టాం.. న్యాయపరమైన చిక్కుల్లేకుండా చేశాం
ఏవైనా సమస్యలు, అభ్యంతరాలు ఉంటే... సబ్ కమిటీ, కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలి
మందకృష్ణ మాదిగతో భేటీలో సీఎం రేవంత్
కులాల కూర్పులో శాస్ర్తీయత పాటించలేదు
సవరణల తరువాత చట్టబద్ధత కల్పించాలి
సీఎం రేవంత్ నిబద్ధత అభినందనీయం
ఆయనకు సోదరుడిగా ఉంటా: మందకృష్ణ
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మాదిగలు, అందులోని ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగతో అన్నారు. ఎస్సీల వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలో లోపాలున్నాయని, సవరణలు చేయాల్సి ఉందని తెలుపుతూ ఇదే అంశంపై సమయం ఇస్తే కలిసి మాట్లాడుతానంటూ మందకృష్ణ సోమవారం సీఎంకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం కృష్ణను ఆహ్వానించగా.. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉపకులాల వర్గీకరణలోని లోపాలను మందకృష్ణ.. సీఎం రేవంత్‌కు వివరించారు. కులాల కూర్పులో కమిషన్ శాస్త్రీయతను పాటించలేదని, అందువల్ల కొన్ని కులాల గ్రూపులు మా రిపోయాయని తెలిపారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీలను 4 గ్రూపులు (ఏ, బీ, సీ, డీ)గా వర్గీకరించాలని కోరారు. ఒకవేళ వెనకబాటుతనం ఆధారంగా వర్గీకరణ చేస్తే దాని ప్రకారమే ఇప్పుడున్న మూడు గ్రూపులకు అదే సూత్రాన్ని వర్తింపజేయాలన్నారు. ఎస్సీ కు లాల్లో అతిపెద్ద జనాభాగా ఉన్న మాదిగలకు కేటాయించిన రిజర్వేషన్ శాతంలో అన్యాయం జరిగిందన్నారు. అదే సమయంలో జనాభాలో రెండో స్థానంలో ఉండి, అభివృద్ధి చెందిన మాలలకు మాత్రం వారి జ నాభా నిష్పత్తి కంటే ఎక్కువగా కోటా ఇచ్చారని తెలిపారు.
గ్రూపుల్లో మార్పులు చేయాలి..
గ్రూపు-1లో చేర్చిన మన్నె, కొలుపులవాండ్లు, పంబాడ, పంభాలా, ముండాల, సంబన్ కులాలు గతంలో గ్రూపు-బీ, సీలో ఉన్నాయని, వీటిని ఇప్పుడు గ్రూపు-3లో చేర్చాలని మందకృష్ణ అన్నారు. మధ్యస్తంగా లబ్ధిపొంది ఇప్పుడు గ్రూపు-2 జాబితాలో ఉన్న ఎల్లమ్మల్వార్, ఎల్లమ్మలవాండ్లు, పంచమ, పరయ కులాలు గతంలో గ్రూపు-సీ, డీలో ఉన్నాయని, వీటిని ఇప్పుడు గ్రూపు-3లో చేర్చాలని కోరారు. ఇక గ్రూపు-3లో చేర్చిన ధోర్ కులాన్ని, గ్రూప్-1లో చేర్చిన మాంగ్ గరోడి కులాన్ని గ్రూప్-2లో చేర్చాలన్నారు. ఇక గ్రూపు-3లో ఉన్న పాకి, మోటి, తోటి, రెల్లి కులాలను గ్రూపు-1లో చేర్చాలని తెలిపారు. ఎస్సీ జనాభాలో 4వ స్థానంలో ఉన్న బేడబుడ్గ, జంగం కు లానికి మరికొన్ని కులాలను కలిపి వాటి జనాభాతో ఏర్పాటుచేసిన గ్రూప్-1 విధంగానే.. జనాభాలో 3వ అతిపెద్ద జనాభా కలిగి ఉన్న నేతకాని కులానికి మహార్, హోలియదాసరితో పాటు మరికొన్ని కులాలను కలిపి గ్రూపు-3గా ఏర్పాటుచేయాలని కోరారు. ఇక సామాజికంగా, ఆర్ధికంగా, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అత్యంత ప్రయోజనాలు పొందిన మాల, వారి ఇతర కులాలను కలిపి గ్రూపు-4గా ఏర్పాటు చేయాలని సూచించారు. తీర్మానంలో ఈ సవరణలను చేసిన తరువాత వర్గీకరణకు చట్టబద్ధత తీసుకురావాలన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై సీఎం రేవంత్ నిబద్ధతను మందకృష్ణ అభినందించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సోదరుడిగా ఉంటానన్నారు.
అభ్యంతరాలను కమిషన్‌కు చెప్పాలి..
ఎస్సీల వర్గీకరణ తీర్మానంలో ఉన్న లోపాల గురించి మందకృష్ణ వివరించిన అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఎస్సీల వర్గీకరణ కోసమే అసెంబ్లీ చర్చించి, క్యాబినెట్ సబ్ కమిటీతో పాటు ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. కమిషన్ ఇచ్చిన నివేదిక ను క్యాబినెట్‌లో చర్చించి అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తద్వారా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేశామన్నారు. ఏవైనా సమస్యలు, అభ్యంతరాలు ఉంటే సబ్ కమిటీతోపాటు, కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా వర్గీకరణకు తీర్మానం చేయాలని సీఎం రేవంత్ గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అసెంబ్లీలో కొట్లాడిన విషయాన్ని సమావేశానికి వచ్చిన ప్రతినిధులు గుర్తుచేశారు. ఈ స మావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్‌మాదిగ, మాజీ ఎంపీ వెంకటేశ్ నేత తదితరులు పాల్గొన్నారు. అనంతరం మందకృష్ణ.. సబ్‌కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. కాగా, ఎమ్మార్పీఎస్ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరుల కోసం భారీ స్తూపాన్ని నిర్మించాలని మందకృష్ణ కోరారు. అందులో వారి స్మృతులతో ఒక మ్యూజియంను ఏర్పాటుచేయాలని, అందుకు హైదరాబాద్ నడిబొడ్డున 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని అన్నారు. అలాగే మాదిగ అమరుల కుటుంబాల్లో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం, పక్కా ఇల్లు, రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలని, వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని భేటీ అనంతరం సీఎం రేవంత్‌కు మందకృష్ణ లేఖ రాశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News