Share News

CM Revanth Reddy: వికసిత్‌ భారత్‌ బాటలో..

ABN , Publish Date - May 25 , 2025 | 04:07 AM

వికసిత్‌ భారత్‌ లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్‌-2047’ విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఇందులో.. ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలుంటాయని పేర్కొన్నారు.

CM Revanth Reddy: వికసిత్‌ భారత్‌ బాటలో..

  • ఆ లక్ష్యంతోనే ‘తెలంగాణ రైజింగ్‌-2047’ విజన్‌ రూపకల్పన

  • ‘నేషన్‌ ఫస్ట్‌ - పీపుల్‌ ఫస్ట్‌’ ప్రాధాన్యతతో ముందుకెళ్తున్నాం

  • ఈ దేశం రాష్ట్రాల సమాఖ్య.. తెలంగాణకు సహకరించండి

  • దేశవ్యాప్త కులగణనకు కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

  • ఎస్సీ వర్గీకరణ జరిపాం.. బీసీ రిజర్వేషన్లు 42ు పెంచాం

  • 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, లక్ష ప్రైవేటు ఉద్యోగాలిచ్చాం

  • మాదక ద్రవ్యాల నిర్మూలనలో నంబర్‌ వన్‌గా తెలంగాణ

  • రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తూ మాస్టర్‌ ప్లాన్‌

  • ఆపరేషన్‌ సిందూర్‌పై మోదీకి, సైన్యానికి అభినందనలు

  • ఇందిరాగాంధీ పాకిస్థాన్‌ను రెండు ముక్కలుగా చీల్చారు

  • నీతి ఆయోగ్‌ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి

న్యూఢిల్లీ, మే 24 (ఆంధ్రజ్యోతి): వికసిత్‌ భారత్‌ లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్‌-2047’ విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఇందులో.. ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలుంటాయని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్‌ను సూపర్‌ పవర్‌గా, నెంబర్‌ వన్‌గా నిలబెట్టాలన్న మోదీ సంకల్పాన్ని ఆయన స్వాగతించారు. ‘వికసిత భారత్‌’ ప్రణాళికను రూపొందించడం అభినందనీయమని కొనియాడారు. అదే స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైందని వివరించారు. వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనలో తెలంగాణ మొదటి వరుసలో ఉంటుందని మాట ఇచ్చారు. భారత దేశం రాష్ట్రాల సమాఖ్యని, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కేంద్ర సహకారం, మద్దతు లేకుండా తెలంగాణ రైజింగ్‌ విజన్‌ అమలు చేయలేమని స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసగించారు. తొలుత.. పహల్గాంలో మారణకాండ సృష్టించిన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు సంకల్పించడం, దాన్ని భారత సైన్యం అమలు చేయడంపై అభినందనలు తెలిపారు. 1971లో ఇందిరా గాంధీ నాయకత్వంలో పాకిస్థాన్‌ను ఓడించి, ఆ దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చిన చరిత్రను గుర్తుచేశారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌లోని నాలుగు కీలకాంశాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్‌ క్లాస్‌ ఇన్‌ఫ్రా అభివృద్ధి, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు తెలంగాణ రైజింగ్‌ విజన్‌లో ప్రాధాన్యతనిస్తాం. వికసిత్‌ భారత్‌ సాధన మనందరి ఆశయం. నేషన్‌ ఫస్ట్‌-పీపుల్‌ ఫస్ట్‌ అన్న ప్రాధాన్యతతో ముందుకు వెళ్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.

10.jpg


కులగణనపై..

దేశవ్యాప్త కులగణనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం రేవంత్‌.. ఈ విషయంలో తెలంగాణ అనుభవాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ‘‘తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణనతో.. బీసీలకు విద్య, స్థానిక సంస్థల్లో 42ు రిజర్వేషన్లు, ఎస్సీల ఉప వర్గీకరణ వంటి చరిత్రాత్మక నిర్ణయాలను మా ప్రజా ప్రభుత్వం తీసుకుంది. ఏకకాలంలో ఈ రెండు నిర్ణయాలు తీసుకోవడం గర్వకారణం. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే సంక్షేమ-సామాజిక న్యాయ విధానం, గ్రీన్‌ ఎనర్జీ విధానం, ఇన్‌ఫ్రా అండ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ, పర్యాటక విధానాలను అమలు చేస్తున్నాం. అభివృద్ధిలో, సంక్షేమంలో ఆయా వర్గాలకు న్యాయమైన వాటా ఇవ్వాలన్నది మా సంకల్పం. అందుకే, తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన చేపట్టాం’’ అని వివరించారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళలకు కీలక పాత్ర ఉండేలా విధానాలను రూపొందించామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు, వారితోనే పాఠశాలల నిర్వహణ, శిల్పారామంలో వంద స్టాళ్లతో మహిళా బజార్‌ ఏర్పాటు వంటి అంశాలను ప్రస్తావించారు. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలను సృష్టించామని చెప్పారు. ‘‘నిరుద్యోగ సమస్యకు నైపుణ్యాల కొరతే కారణమని గుర్తించి, యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, పోలీస్‌ స్కూల్‌, ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ స్కూల్స్‌, ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునీకరించి శిక్షణ అందజేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. తెలంగాణను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, వాటికి నియంత్రించడంలో 139 దేశాల్లో తెలంగాణ నెంబర్‌గా నిలిచిందని గుర్తుచేశారు. జూన్‌ 2 నుంచి రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రారభిస్తున్నామని, తద్వారా యువతకు స్వయం ఉపాధికి రూ.5 లక్షలు అందిస్తామన్నారు.


ధాన్యం ఉత్పత్తిలో ఆదర్శం

తెలంగాణలో 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌ తెలిపారు. ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా సాయం చేస్తున్నామన్నారు. మద్దతు ధరకు అదనంగా క్వింటాకు రూ.500 చెల్లించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నామన్నారు. గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశానికే ఆదర్శంగా నిలిచామని గుర్తుచేశారు. రైతుల కోసం చేసే వ్యయాన్ని సంక్షేమ కోణంలో కాకుండా.. ఆహార సంపద సృష్టికి పెడుతున్న పెట్టుబడిగా చూడాలని పిలుపునిచ్చారు. ఇండస్ట్రీ, ఇన్‌ఫ్రాలో అంతర్జాతీయ నగరాల సరసన తెలంగాణను నిలబెట్టాలనే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్‌- 2047 విజన్‌తో ముందుకెళ్లాలని నిర్ణయించామని సీఎం రేవంత్‌ తెలిపారు. తొలి అడుగుగా, ఏడాదిన్నరలో అమెరికా, జపాన్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా, స్విట్జర్‌ లాండ్‌లో పర్యటించి, రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామని గుర్తుచేశారు. తెలంగాణను మూడు జోన్లుగా విభజించి.. మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. తెలంగాణను కోర్‌ అర్బన్‌, సెమీ అర్బన్‌, రూరల్‌ తెలంగాణగా విభజించి, వృద్ధిని సాధిస్తామని పేర్కొన్నారు. మెట్రో రైల్‌ రెండో దశ, ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం, మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌, అగ్రీబేస్డ్‌ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని వివరించారు. సబర్మతీ రివర్‌ ఫ్రంట్‌, గంగా పునరుద్థరణ ప్రాజెక్టు మాదిరిగా తెలంగాణలో మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందని తెలిపారు. మెట్రో రెండో దశ, రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టులు ప్రస్తుతం డీపీఆర్‌ దశలో ఉన్నాయని వివరించారు. గుడ్‌ గవర్నెన్స్‌తో అత్యున్నత ప్రమాణాలతో పౌర ేసవలను అందిస్తామని, ఇందులో భాగంగా ‘బిల్డ్‌ నౌ’ యాప్‌ ద్వారా నిర్మాణ రంగానికి వేగం పెంచామన్నారు. హైదరాబాద్‌ను డేటా సెంటర్‌ హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.


ఇవి కూడా చదవండి

Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..

Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..

Updated Date - May 25 , 2025 | 04:07 AM