CM Revanth Reddy Greets KCR Warmly: బాగున్నారా..?
ABN , Publish Date - Dec 30 , 2025 | 05:21 AM
తెలంగాణ శాసనసభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లలో ఆరుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.....
ఆరోగ్యం ఎలా ఉంది?.. కేసీఆర్‌ను ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్
కేసీఆర్ వద్దకెళ్లి నమస్కరించి, యోగక్షేమాలడిగిన సీఎం
అసెంబ్లీలో సరికొత్త సంప్రదాయానికి తెర లేపిన ముఖ్యమంత్రి
రేవంత్ రాగానే లేచి నిల్చున్న కేసీఆర్, 17 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
కుర్చీల్లోంచి లేవని కేటీఆర్, కౌశిక్‌రెడ్డి!
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సెంట్రల్‌హాల్
మేం ప్రతి సభ్యుడినీ గౌరవిస్తాం
ఎందుకెళ్లిపోయారో కేసీఆర్‌నే అడగండి
మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ శాసనసభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లలో ఆరుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తాజాగా సోమవారం శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ కొలువుదీరడానికి కొద్ది నిమిషాల ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. విపక్ష నేత కేసీఆర్‌ను ఆప్యాయంగా పలకరించారు. ఉదయం 10:29 గంటలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పక్షనేత కేసీఆర్ సభలోకి వచ్చారు. ఆ తర్వాత ఒక్క నిమిషానికే సీఎం రేవంత్‌రెడ్డి సభలోకి ప్రవేశించారు. లోపలికి రాగానే ఆయన తన స్థానంలో నుంచి కేసీఆర్‌కు నమస్కరించారు. ఆయన స్పందించకపోవడంతో రేవంత్‌రెడ్డి లేచి కేసీఆర్ దగ్గరకు వెళ్లారు. నమస్కారం చేసి.. ‘ఆరోగ్యం బాగా ఉందా? ఎలా ఉన్నారు?’ అని కేసీఆర్‌ను పలకరించారు. ఆ తర్వాత కరచాలనం చేసి, నమస్కరించారు. అనంతరం సీఎం తన సీటు వద్దకు తిరిగి వెళ్లారు. రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రె డ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు కేసీఆర్‌ను పలకరించారు. ఆయనతో కరచాలనం చేసి, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. మంత్రి ఽసీతక్క కూడా కేసీఆర్‌కు నమస్కారం చేశారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యతో పాటు పలువురు సభ్యులు కేసీఆర్ వద్దకు వెళ్లి నమస్కారం చేశారు. కాగా, సీఎం రేవంత్ రాగానే కేసీఆర్‌తోపాటు 17 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లేచి నిల్చున్నారు. కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డిలు మాత్రం సీట్లలో కూర్చొనే ఉన్నారు.
సరికొత్త సంప్రదాయం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ పలుమార్లు శాసనసభ సమావేశాలు జరిగాయి. కొత్తగా శాసనసభ కొలువుదీరిన తర్వాత స్పీకర్‌ను ఎన్నుకుంటారు. తర్వాత శాసనసభాపక్ష నేత (సీఎం), ప్రతిపక్ష నేత కలిసి సభాపతిని తోడ్కొని వెళ్లి, కుర్చీలో కూర్చోపెట్టడం ఆనవాయితీ. అయితే తొలి దఫాలో నాలుగున్నరేళ్లు, రెండోసారి ఐదేళ్లు రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు జరిగాయి. ఏ సమావేశాల్లోనూ విపక్ష నేతను ముఖ్యమంత్రే స్వయంగా వెళ్లి పలకరించడం, నమస్కరించడం జరగలేదు. తొలిసారిగా సభా సంప్రదాయాలను పక్కనపెట్టి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ను పలకరించారు. ఆయన కుర్చీ దగ్గరకే వెళ్లి నమస్కరించి మరీ యోగక్షేమాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చర్య రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొద్దిరోజులకే కేసీఆర్ ఇంట్లో జారిపడి ఆస్పత్రిలో చేరగా.. రేవంత్‌రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం ఆరా తీశారు. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆ తర్వాత పలు సభల్లో కేసీఆర్‌ను రాజకీయంగా విమర్శించినప్పటికీ ఆయన పట్ల పలు సందర్భాల్లో గౌరవంగానే వ్యవహరించారు. తాజాగా శాసనసభలో కేసీఆర్‌ను ఆప్యాయంగా పలకరించడం ద్వారా రేవంత్ సరికొత్త సంప్రదాయానికి తెరతీశారని, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారని పలువురు వ్యాఖ్యానించారు. 2014-18 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, కాంగ్రెస్ పక్ష నేతగా కుందూరు జానారెడ్డి; 2018-23 మధ్యకాలంలో సీఎంగా కేసీఆర్, కాంగ్రెస్ పక్ష నేతగా భట్టి విక్రమార్క ఉన్నారు. 2014-18 మధ్యకాలంలో కె.జానారెడ్డిని కేసీఆర్ పలు సందర్భాల్లో ఆప్యాయంగా ‘పెద్దలు జానారెడ్డి’ అని పలుమార్లు ప్రస్తావించారు తప్ప.. సభలో ఆయన దగ్గరికి వెళ్లి ఎన్నడూ కరచాలనం చేయలేదు. ఇక 2018-23 మధ్య కాంగ్రెస్ నుంచి 19 మంది శాసనసభ్యులు గెలవగా.. విపక్ష నేతగా భట్టి ఎంపికయ్యారు. అయితే, అప్పట్లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎ్‌సలో చేర్చుకోవడంతో భట్టికి విపక్ష నేత హోదా లేకుండా చేయడానికి ప్రయత్నాలు జరిగాయన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇక కేసీఆర్ ఏ రోజూ భట్టిని సభలో కలిసి, అభినందించిన దాఖలాల్లేవు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి విపక్ష నేత వద్దకు వెళ్లడం ద్వారా శాసనసభలో సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు.
రెండేళ్లలో రెండుసార్లే..
గత ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎన్నికైన కేసీఆర్.. తొలిసారి ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వచ్చారు.ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగ కార్యక్రమానికి హాజరై, వెంటనే వెళ్లిపోయారు. అనంతరం సాధారణ సమావేశాలకు ఆయన హాజరవడం ఇదే తొలిసారి. ఇప్పుడు కూడా కేవలం కొద్ది నిమిషాలే కూర్చొని, వెళ్లిపోవడం గమనార్హం.
సారొచ్చారు.. వెళ్లారు..!
కేసీఆర్ సభలో ఉన్నది 7 నిమిషాలే
శాసనసభ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అని సర్వత్రా చర్చ జరిగింది. ఆ చర్చకు తెర దించుతూ బీఆర్‌ఎస్ అధినేత సోమవారం శాసనసభకు వచ్చారు. ఇటీవల జరిగిన బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క. ప్రభుత్వాన్ని నిలదీస్తా’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సభలో ఉండి, ప్రభుత్వాన్ని నిలదీస్తారని అంతా భావించారు. కానీ, అలాంటిదేం జరగలేదు. కేసీఆర్ ఉదయం 10.29 గంటలకు సభలోకి వచ్చారు. శాసనసభ సమావేశం ప్రారంభమవగానే పలు పేపర్లను ప్రవేశపెట్టినట్లు ప్రకటించిన స్పీకర్.. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిల సంతాప తీర్మానంపై మాట్లాడుతుండగానే 10:36 గంటలకు కేసీఆర్ బయటకు వెళ్లిపోయారు. ఆయన కేవలం ఏడు నిమిషాలే సభలో ఉండడం గమనార్హం. ఇక సంతాప తీర్మానం అనంతరం మాజీ సభ్యులకు శ్రద్ధాంజలి ఘటించి, రెండు నిమిషాల పాటు సభ మౌనం పాటించింది. దివంగత సభ్యులకు నివాళులర్పించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి 10:40 గంటలకు సభ నుంచి వెళ్లిపోయారు. సీఎం కంటే నాలుగు నిమిషాలు ముందే కేసీఆర్ వెళ్లిపోవడం గమనార్హం.
ఎందుకు వెళ్లిపోయారో కేసీఆర్‌నే అడగండి: సీఎం
శాసనసభ నుంచి బీఆర్‌ఎస్ పక్ష నేత కేసీఆర్ వెంటనే ఎందుకు వెళ్లిపోయారో ఆయన్నే అడగాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సభలో విపక్ష నేతను పలకరించడంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శాసనసభ, మండలికి కలిపి అసెంబ్లీ లాబీలో సెంట్రల్ హాల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సెంట్రల్ హాల్ ఏర్పాటు గురించి అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి మ్యాప్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అసెంబ్లీలో కేసీఆర్‌ను కలిసి పలకరించడాన్ని ప్రస్తావించిన విలేకరులు.. మాజీ సీఎం సభ నుంచి వెంటనే ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించారు. అది ఆయన్నే అడగాలని సీఎం రేవంత్ సూచించారు. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారని అడగ్గా.. ‘మేం మాట్లాడుకున్నది మీకెలా చెబుతాం?’ అని ముఖ్యమంత్రి అన్నారు. కేసీఆర్‌ను కలవడం ఇదే మొదటిసారి కాదని, గతంలో ఆస్పత్రిలో కూడా కలిశానని చెప్పారు. కాగా, పార్లమెంటు మాదిరిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కలిపి అసెంబ్లీ లాబీలో సెంట్రల్ హాల్‌ను ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ తెలిపారు. ఇందులోకి ఎమ్మెల్యేలు, మంత్రులందరికీ ప్రవేశం ఉంటుందని చెప్పారు. తాము ప్రతి సభ్యుడినీ గౌరవిస్తామన్నారు.